
హైదరాబాద్: తెలంగాణాలో బీజేపీ వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ..బీజేపీ రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముందే..చెప్పుకోవడానికి కథలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు లేవు..కనీసం పీఎం ఆవాస్ యోజన కూడా రాకుండా చేశారని విమర్శించారు. మధ్యప్రదేశ్లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో వాతావరణం చూశాను.. మూడు చోట్లా బీజేపీ సర్కార్‌లే మళ్లీ వస్తాయని జోస్యం చెప్పారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం అహర్నిశలూ పని చేస్తుందని చెప్పారు. సీఎంగా తాను 13 సంవత్సరాలుగా పని చేశాను.. ఇక్కడ సీఎం కేసీఆర్ సచివాలయానికి పోడని తెలిసి ఆశ్చర్య పోయానని చౌహన్ తెలిపారు. నీళ్లు, నిధులు, నియామాకాలు అన్నారు..అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
డిజైన్ మార్పుల పేరుతో అంచనాలు పెంచి ప్రాజెక్టులు ఆలస్యం చేశారు...కానీ సాగుభూమి మాత్రం పెరగలేదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ పాలనలో కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చారని అన్నారు. సర్కారు ఉద్యగాలు రాలేదు.. ప్రైవేటు ఉద్యోగాల కల్పనా జరగలేదని తెలిపారు. నిజాం రాజు పోయాక కూడా తెలంగాణాలో రాచరికం ఇంకా ఉందని వెల్లడించారు. ఒక్కసారి బీజేపీకి ఓటేసి గెలిస్తే తెలంగాణాను అభివృద్ధి పథంలో నడిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment