
సాక్షి, న్యూఢిల్లీ : ఇక అంతర్జాతీయ ఎడిషన్‌లో కూడా రోజువారి రాజకీయ కార్టూన్ల ప్రచురణను నిలిపివేస్తున్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రకటించింది. కొన్నేళ్ల క్రితమే దేశీయ ఎడిషన్లలో రాజకీయ కార్టూన్ల ప్రచురణను ఈ పత్రిక నిలిపివేసింది. తమ అంతర్జాతీయ ఎడిషన్‌లో కొన్ని పేజీల్లోని కార్టూన్లు జాతి విద్వేష పూరితంగా ఉంటున్నాయని, ఇటీవల ప్రచురించిన ఓ కార్టూన్ కూడా అదే తరహాలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పత్రికా యాజమాన్యం ప్రకటించింది.
గత ఏప్రిల్ 25వ తేదీన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతాన్యూహు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై పత్రిక ప్రచురించిన రాజకీయ కార్టూన్ జాతి విద్వేషాన్ని ప్రతిబింబించినట్లు ఉందని ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బెంజామిన్ అనే కుక్క మెడకు తాడువేసి ట్రంప్ లాగుతున్నట్లు ఆ రాజకీయ వ్యంగ్య చిత్రం ఉంది. ఈ కార్టూన్‌ను ఉద్దేశపూర్వకంగా వేయలేదని, తమ దష్టికి రాకుండానే ప్రచురణకు నోచుకుందని ఆ పత్రిక వివరణ కూడా ఇచ్చుకుంది. చూసినా, చూడకపోయిన ప్రచురించిన వార్తలకు, కార్టూన్లకు పత్రికా యాజమాన్యం బాధ్యత వహించాల్సిందే. చూడలేదనడం అర్థరహితం. అలాగే వివాదాస్పదం అయినందున మొత్తానికి రాజకీయ కార్టూన్లనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం కూడా అర్థరహితమే అవుతుంది. జాతి విద్వేషాలను రెచ్చగొట్టకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూనే భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం కూడా పత్రికా యాజమాన్యంకు ఉండాల్సిందే.
న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం భావిస్తున్నట్లుగా కార్టూన్లు దేశాల సరిహద్దులు దాటి వెళుతున్నప్పటికీ వాటికి సరిహద్దులంటూ ఉండవు. వివిధ దేశాల్లో కార్టూన్లపై వివాదం చెలరేగడం కొత్త కాదు. దానిష్ పత్రిక ‘ఐలాండ్స్ పోస్టెన్’ ప్రవక్త మొహమ్మద్ కార్టూన్‌ను ప్రచురించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆ కార్టూన్‌ను పునర్ ముద్రించడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా ఇస్లాం మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పలుసార్లు కార్టూన్లను ప్రచురించినందుకు ఫ్రెంచ్ వ్యంగ్య వార పత్రిక ‘చార్లీ హెబ్డో’పై పలుసార్లు దాడులు జరిగాయి. 2011లో ఆ పత్రికా కార్యాలయంపై బాంబు దాడి జరగ్గా, 2015, జనవరిలో ఆ పత్రిక కార్యాలయంపై కాల్పులు జరిగాయి.
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సెరినా విలయమ్స్‌పై మార్క్‌నైట్స్ వేసిన కారికేచర్ కూడా వివాదాస్పదం అయింది. జాతి, మత విశ్వాసాలకు సంబంధించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలిగానీ వివాదాస్పదం అవుతున్నాయన్న కారణంగా కార్టూన్లను నిలిపివేయడం అర్థరహితమే కాదు, మూర్ఖత్వమే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment