సాక్షి, కాకినాడ: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మంగళవారం జనసేనకు రాజీనామా చేశారు. పెద్దాపురం అసెంబ్లీ సీటు ఆశించి ఆయన భంగపడ్డారు. జనసేన అభ్యర్థిగా నిలిచిన తుమ్మల రామస్వామికి సహకరించమని కూడా పార్టీ నుంచి ఎవరు అడగకపోవడంతో అవమానంగా భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
పంతం గాంధీమోహన్ (ఫేస్‌బుక్ ఫొటో)
పవన్ అన్నయ్య చిరంజీవిని అందరు వదిలి వెళ్ళిపోయినా తాను ఒక్కడినే ఆయనను వదలలేదని గాంధీమోహన్ తెలిపారు. చిరంజీవికి చెప్పే జనసేనలో చేరానని, బహుశా ఆయనతో ఉండడం వల్ల తనకు టిక్కెట్ రాలేదని భావిస్తున్నట్టు తెలిపారు. ‘మా అన్నయ్య చిరంజీవికి అన్యాయం జరిగిందని ప్రతి సమావేశంలో పవన్ మాట్లాడతారు. ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి నాకు ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నాను. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్న పవన్.. జనసేన పార్టీలో అభ్యర్ధులకు టిక్కెట్లు ఎలా ఇచ్చారో గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. జనసేనలో సీట్లు చిరంజీవి ఇచ్చారా, టీడీపీ ఇచ్చిందా? నాకు చీకటి ఒప్పందాలు, రాత్రి రాజకీయాలు తెలియవ’ని పంతం గాంధీ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment