గ్రామస్వరాజ్యమే లక్ష్యమంటూ లీడ్ ఇండియా పేరుతో హడావుడి చేశారు..వలసవాదులు విశాఖ సంపదను దోచేస్తున్నారని మొసలి కన్నీరు కార్చారు..మరి ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి.. మీరు గొంతు చించుకొని వల్లించిన రెండు నినాదాలకు విరుద్ధంగా విశాఖకు ఎందుకు దిగమతయ్యారు?వీవీ లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మీనారాయణపై విశాఖవాసులు సంధిస్తున్న ప్రశ్నలివి..ఆయన ఏ తాను ముక్కో అందిరికీ తెలిసేందే.. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఎవరి ప్రభావంతో.. ఎవరి ప్రయోజనాల కోసం పని చేశారో.. నిబంధనలకు విరుద్ధంగా అనుకూల వర్గ మీడియాకు లీకులిచ్చి ఎంత ప్రచారం పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి... ప్రత్యక్ష పోటీకి దిగడం కూడా అదే ‘వర్గ’ ప్రయోజనం కోసమేనని స్పష్టమవుతోంది.ఎన్నికల్లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇందులో అనుమానమే లేదు.కానీ కొన్నాళ్ల క్రితం ఉత్తరాంధ్రలో పర్యటించి ఇక్కడి వనరులను వలసదారులు దోచేస్తున్నారని.. విశాఖపై వలసవాదుల ప్రభావం పోవాలని ప్రసంగాలు దంచేసిన ఈ పెద్ద మనిషి.. ఇప్పుడు ఏ నిబద్ధతతో విశాఖ నుంచి పోటీ చేస్తున్నారని ఇక్కడి మేధావులు ప్రశ్నిస్తున్నారు.సొంత ప్రాంతం రాయలసీమ గడప దాటి.. కనీసం ఉద్యోగ రీత్యా కూడా ఎటువంటి అనుబంధం లేని విశాఖకు ఎందుకు వచ్చినట్లని నిలదీస్తున్నారు.ఎవరి ఓట్లు చీల్చడానికి.. ఎవరి ప్రయోజనాల రక్షణకు విశాఖపై పడ్డారని ప్రశ్నిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ వివిధ హోదాల్లో పని చేసి గతేడాది మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఈయనకు మించిన డీజీలు, ఐజీల గురించి వింటుంటాం.. సీబీఐలోనూ అటువంటివారెందరో ఉన్నారు. కానీ అందరిలోకి ఈయనే ఎందుకు ప్రత్యేకం అంటే.. ఒకే ఒక్క కేసు.. దాంతోనే ఈయన్ను అనుకూల మీడియా బలవంతపు సెలబ్రిటీని చేసేసి.. జనంపైకి వదిలింది. తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి మృతి చెందిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర తలపెట్టారు. దాన్ని అడ్డుకోవాలని చూసిన అధిష్టానాన్ని కాదని.. తన తండ్రి చనిపోయిన చోట నల్లకాలువలో ప్రజలకిచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేపట్టారు. దాంతో ఆగ్రహించిన ఆ పార్టీ అధిష్టానం సీబీఐని ఉసిగొల్పి ఆస్తుల కేసులు నమోదు చేయించింది. డిఫ్యుటేషన్‌పై హైదరాబాద్‌లో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ అప్పుడే తెరపైకి వచ్చారు. అంతే.. వైఎస్ జగన్ కేసు విచారణాధికారిగా అనుకూల మీడియా ఆమాంతం ఆయన్ను ఎత్తేసింది. అందుకు ప్రతిగా ఈయనగారు ఉద్యోగ ధర్మానికి ద్రోహం చేసి మరీ.. ఆ ’వర్గ’ మీడియాకు లీకులిచ్చి.. లేనిపోని కథనాలు వండివార్చేందుకు సహకరించారు. అప్రతిష్ట మూటకట్టుకున్నారు. గోప్యంగా ఉంచాల్సిన విచారణాంశాలను మీడియాకు లీక్ చేయడంపై అప్పట్లో వివాదాలు చుట్టుముట్టాయి. ఇదే లక్ష్మీనారాయణ.. చంద్రబాబునాయుడుపై కేసుల విచారణ విషయానికి వచ్చేసరికి సీబీఐలో తగినంత స్టాఫ్ లేరని కోర్టుకు నివేదించి చేతులు దులిపేసుకున్నారు. ఇక్కడే ఆయన నిజాయితీ ముసుగు తొలగిపోయి.. పనితీరు బట్టబయలైంది. ఆయన గారి అసలు రూపం అందరికీ స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత డిఫ్యుటేషన్ పేరిట సొంత రాష్ట్రంలో అందించిన ‘సేవలను’ గుర్తించిన సీబీఐ కేంద్ర కార్యాలయం ఈయన్ను మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక 2018 మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
గ్రామస్వరాజ్యమంటూ విశాఖ నగరానికి ఎందుకొచ్చినట్టు?
లీడ్ ఇండియా పేరిట గత ఏడాది కాలంగా చేసిన రాష్ట్ర పర్యటనల్లో భాగంగా లక్ష్మీనారాయణ విశాఖకు కూడా వచ్చారు. ఆ సందర్భాల్లోనే ఉత్తరాంధ్రను వలసవాదులు దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా విశాఖకు ఎప్పుడొచ్చినా.. వలసవాదులు ఈ ప్రాంతాన్ని దోచేస్తున్నారని, ఇలానే కొనసాగితే తెలంగాణ ఉద్యమ పరిస్థితులు ఇక్కడా ఉత్పన్నమవుతాయని ఆవేశకావేశాలు ప్రదర్శించేవారు. మరి అదే పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణలు అర్ధంతరంగా ఇక్కడికి దిగుమతి కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి ఓట్లు చీల్చేందుకు.. ఎవరికి మేలు చేసేందుకు జేడీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారో చెప్పాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
అటు తిరిగి ఇటు తిరిగిచివరికి జనసేనలోకి
పదవీ విరమణ తర్వాత ఏడాదిగా లీడ్ ఇండియా పేరిట గ్రామస్వరాజ్యమే లక్ష్యమంటూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత లోక్‌సత్తా పార్టీ పగ్గాలు తీసుకోనున్నారనే వాదనలు వినిపించాయి. అయితే ఎన్నికల ప్రకటనల వెలువడిన తర్వాత భీమిలి టీడీపీ అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ పేరు తెరపైకి వచ్చింది. అబ్బే.. నేను ఏ పార్టీలోనూ చేరడంలేదని అయ్యగారు ఖండించారు. కానీ విశాఖ ఎంపీ సీటు కోసం టీడీపీలో బాలకృష్ణ అల్లుళ్ళ మధ్య పోరు నేపథ్యంలో సదరు లక్ష్మీనారాయణ రాత్రికి రాత్రి జనసేనలోకి జంప్ చేసి.. మరునాడు ఉదయమే విశాఖ ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి రావడంతో ఆయన అసలు రంగు బయటపడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులాలు, మతాలకు తాను అతీతమని, అవినీతిని సైతం సహించనని చెప్పుకునే లక్ష్మీనారాయణ.. టీడీపీ భజనసేనగా, కులసేనగా ముద్రపడ్డ జనసేనలోకి, పైగా అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు అభిశంసన ఎదుర్కొన్న మాయావతి మద్దతిచ్చిన పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జేడీ మేక వన్నె పులివైఎస్సార్‌సీపీ
రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్ వెస్లీ నీతి నిజాయితీ కలిగిన అధికారినని చెప్పుకుని ఖద్దరుకు అమ్ముడుపోయిన జేడీ లక్ష్మీనారాయణ అసలు రూపం బట్టబయలైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మకై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా 13 చార్జీషీట్లు వేసినందుకు ప్రతిగా క్విడ్‌ప్రోకో (నీకు ఇది నాకు అది)లో భాగంగానే ఈరోజు తెలుగుదేశానికి ముసుగు పార్టీ అయిన జనసేన టికెట్ ఇప్పించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత రాజకీయాలు కుళ్లిపోయాయని, వివేకానంద, మహత్మగాంధీ తనకు మార్గదర్శకమని విద్యార్థులు, యువతకు నీతి పాఠాలు బోధించే లక్ష్మీనారాయణ.. ఆ సిద్ధాంతాలు, విలువలను విశాఖ బీచ్‌లో ఎందుకు పాతరేశారో విద్యార్ధి లోకానికి జవాబివ్వాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పి ప్యాకేజీలకు అమ్ముడుపోయి సమాజానికే పెద్ద ప్రశ్నగా మారిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీకు ఆదర్శప్రాయుడా.. మార్గదర్శకుడా.. అని నిలదీశారు. ఎందరో ఉద్దండులను లోక్‌సభకు పంపిన విశాఖ ప్రజలు ఇటువంటి మేకవన్నె పులులకు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు.
జేడీ.. దమ్ముంటే రాయలసీమలో పోటీ చెయ్
దళిత న్యాయవాదుల సంఘం నేత :పాకా సత్యనారాయణ
జేడీ లక్ష్మీనారాయణకు దమ్ముంటే సొంత గడ్డ రాయలసీమలో పోటీ చేయాలని దళిత న్యాయవాదుల సంఘం నేత పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన భారం ఉత్తరాంధ్రకు ఎందుకని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌పై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో పావుగా మారిన జేడీకి ఎన్నికల్లో పోటీ చేసే నిబద్ధత ఎక్కడిదని ప్రశ్నించారు. సొంతంగా పార్టీ పెడుతున్నట్టు చెప్పి.. ఎన్నికలొచ్చేసరికి టీడీపీ సీటు కోసం ప్రయత్నించి.. చివరి నిమిషంలో జనసేనలోకి వెళ్ళిన ఆయనలో విలువలు ఎక్కడున్నాయని నిలదీశారు. జనసేన విశాఖ ఎంపీ టికెట్‌కు దరఖాస్తు చేసుకోని గేదెల శ్రీనిబాబును మొదట ఎంపిక చేసి.. ఆయన వద్దని వెళ్లిపోతే జేడీకి ఇచ్చారన్నారు. కానీ జేడీ కంటే ముందు విశాఖవాసి బొలిశెట్టి సత్యనారాయణ దరఖాస్తు చేసినా పట్టించుకోకుండా దరఖాస్తు చేయని జేడీకి కట్టబెట్టారు. ఏ అర్హత ఉందని ఆయన్ను ఇక్కడ నిలబెట్టారో తెలియదు. ఓడిపోయిన తర్వాత తాను విశాఖలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ప్రజలకు అందుబాటులో ఉంటానని జేడీ హామీ ఇవ్వగలరా అని పాకా సత్యనారాయణ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment