
ప్రధాని మోదీతో కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమను నమ్మించి, మోసం చేసి వెనుదిరిగారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలని ప్రధాని సూచించినట్లు వెల్లడించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం మంగళవారం తొలిసారిగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలసిన కన్నా మీడియాతో మాట్లాడారు.
పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, 2019లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ప్రధానికి చెప్పానన్నారు. ‘రాష్ట్ర అభివృద్ధికి ఏ సపోర్ట్ అయినా ఇస్తాం. 2014లో చెప్పినవి చేశాం. ఇంకా పెండింగ్‌లో ఉన్నవి కూడా చేస్తాం. చంద్రబాబు మమ్మల్ని నమ్మించి, మోసగించి వెనుదిరిగినా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్పండి’ అని ప్రధాని సూచించినట్లు కన్నా తెలిపారు.
సీఎం అసమర్థతతో తెచ్చుకోలేకపోయారు
‘తిరుపతి సాక్షిగా వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ రూపంలో అడిగిన దానికంటే రెండు రెట్లు ఎక్కువే ఇచ్చింది. ముఖ్యమంత్రి అవినీతి, అసమర్థత వల్ల అది తెచ్చుకోలేకపోయారు. ఏపీ ప్రజల పక్షాన నిలబడతామని ప్రధాని చెప్పమన్నారు..’ అని కన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానికి కన్నా వినతిపత్రం అందచేశారు.
ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌షా పిలుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నుంచి అత్యవసర ఆహ్వానం అందింది. 2019 ఎన్నికల సందర్భంగా ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా సేకరించనున్నట్లు తెలిసింది. కన్నా సహా పార్టీ నేతలు సోము వీర్రాజు, కె.హరిబాబు, పురందేశ్వరి, విష్ణుకుమార్‌రాజు, రవీంద్రరాజు తదితరులు బుధవారం అమిత్‌షాతో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment