‘అన్న నమస్తెనే.. బావున్నవా’ అన్కుంట జానయ్య ఇంటికచ్చి కూసున్నడు. సింగల్విండొ చేర్మన్ జానయ్య మూడు రంగుల పార్టీ లీడర్ సుత.
‘యేం సంగతులో శెప్పు జానయ్యా.. యెట్లుంది పాల్రమెంట్ ఎలశ్చన్. గీసారన్న మీ పార్టికి బర్కత్ ఉంటదా లేదా?’ పెద్ద బిడ్డ తెచ్చిచ్చిన శాయ గిలాస జానయ్యకిచ్చి నేనోటి దీస్కొని అడ్గిన.
‘ఏడన్న.. యేం లాబం గన్పిత్తలేదు గదన్నా. గీడ క్యాండెటు జూత్తెనెవో ఎవ్వలకు దెల్వనోడైండు. తాలూకలల్ల లీడర్లు లేరు. మొన్న అసంబ్లిల వోడిపొయిన లీడర్లు సుత సరింగ కలిశత్తలేరు. యెవలన్న పెద్దలీడర్లత్తె ఆసరుంట దంటె ఆల్లు ఇటు మొకమే జూత్తలేరాయె..’ జానయ్య బాదల్జెప్పవట్టిండు.
‘గట్లంటవేంది జానా.. మొన్న విజ్యశాంతి, కోదండరాము అచ్చిపాయె గద. జనాలు గుడ బాగనె అచ్చిరి. క్యాండెటు సుత గెలుత్తనని మొన్నో పేపర్కు ఇంటర్వుగుడిచ్చె. నువ్వేమొ గిట్లంటన్నవ్’ మొకం చిట్లిచ్చి నేనడిగిన.
‘అరె గాల్లత్తె ఏవైతదన్న.. గీడ ఎవ్వలొ దెల్వని అయిద్రబాదు లీడర్కు సీటిచ్చిరి. నేశ్నల్ లీడర్లో, ఇస్టేటు లీడర్లో వత్తె పాయిద ఉంటది గని. గీ విజ్యశాంతి, కోదండరాము, వోడిపెయిన యెమ్మెల్లెలు తిర్గితె వోట్లు వడ్తయా..’ నన్నే రిటన్ అడిగిండు జానయ్య.
‘నువ్వద్దె.. మరి మీ పెద్దలీడల్రను పిల్పియ్యద్దా.. రావులు గాంది, ఉత్తమ కుమారు, రేవంత్రెడ్డి, ఇక్రమార్క అసొంటోల్లను..’ నేనడిగిన.
‘ఉత్తము, రేవంత్రెడ్డి ఆల్లే పోట్జెయ్యవట్టిరి. ఇక్రమార్క కమ్మంలనె వున్నడు. ఇగ స్టేట్ల పోటుగాల్లెవలున్నరు? ఇగ పెద్దసారు రావులుగాంది పార్టనెటిదె లేకుంట వొయిన ఆంద్రల తిర్గుతన్నడు గని గీడికత్తలేడు’ నారాజైండు జానయ్య.
జానయ్యను ఏంతెల్వనోని తీర్గ జూసి.. ‘ఆంద్రల రావులుగాంది దోస్త్ శెంద్రంబాబు కాంగిరెస్కు సపోట్ ఇయ్యవట్టె. మొన్న తెలంగాన ఎలశ్చన్ల కాంగిరెస్ను ఎన్కుండి శెంద్రంబాబే నడిపిచ్చిండు గద. గందుకె గిప్పుడు రావులుగాంది దోస్తు కోసవె ఆంద్రకు వోయిండు..’ నేన్జెప్పిన.
‘సాల్ తియ్ అన్న. శెంద్రాలుబాబు తోటి పొత్తు తెలంగాన్లనె తెగిపాయె. ఆంద్రల తెల్దేశెం, కాంగిరెసు యెవలకాల్లు ఎకేరే పోట్జెత్తన్రు.. పేపర్ల జూల్లేద?..’ పాయింటు దీసిండు జానయ్య.
‘నువ్వో పిస్సోన్లెక్కున్నవ్ జానా. శెంద్రంబాబుకున్న ఇకమాతులు దేశెంల యెవ్వలకన్నుంటయా? గాసారు ఐదేండ్లల్ల జేసినన్ని అరాశకాలు దేశెంల యేడ జర్గలె. సర్కారు మీదున్న యెతిరేక వోట్లు చీల్చాల్నని గీ యేషాలు. తెలంగానల పొత్తుల్తోటి కల్సి నిలవడ్డోల్లు ఆంద్రల ఎందుకు యెవలకాల్లు పోటి జేత్తన్రు. గాయింత తెల్వదా?’ కొశ్శెన్ జేసిన.
‘గందుకనేనా. రావులుగాంది ఆంద్రలకు వోయి మోడిని దిట్టిండు. పదానినయితె ప్సెశల్ టేటస్ ఇత్తనన్నడు.. గని శెంద్రంబాబును వొక్కమాట సుత అన్లె’ యాదికి దెచ్చుకొని జెప్పిండు జానయ్య.
‘గాడ జగన్‌కు జనాలు జే గొడ్తన్రు. గాయినె ఆడ సీయెం అయితడని దేశెంల అన్ని సర్వెలు సుత శెప్తన్నయ్. శెంద్రంబాబుకు గెల్సుడు కట్టమని ఎర్కయింది. గందుకె పత్తలేకుంట పెయిన కాంగిరెసును మొత్తం శీట్లకు పోట్జేపిచ్చిండు. యాక్టరు దోస్తు పవన కల్యానంను, వుత్తర పదేశు మాయవతిని, కమ్మనిస్టుల్ని యెగేశి పొత్తువెట్టించి ఆల్లతోటి పోట్జేపిచ్చిండు. ఆల్ల యెన్నారై దోస్తు కేయెపాలును నిలవెట్టిచ్చిండు. గీల్లంత వోట్లల్ల శీల్కలు దెత్తె మల్ల గెల్వచ్చని దొంగేశాలేత్తండు శెంద్రంబాబు’ అంటు తెల్వజెప్పిన.
జానయ్యకు అర్దవైంది. గిలాస టీపాయి మీద వెట్టి.. ‘రావులుగాంది వొయినా, రాకాసులు వోయిన గాడ జగన్ పార్టె గెలుత్తంది. గండ్ల డవుటె లేదు.. మనూరి పక్కల గుంటూరుçపల్లె, కొత్తపల్లెలున్న ఆంద్రోల్లు సుత గదె శెప్తన్రు. ఆల్లు వోటెయ్యడాన్కి గుంటూర్కు వోతరట. జగన్ అత్తెనె ఇడిపెయిన ఆంద్ర డెవులపు అయితదని అంటన్రు.. ’ అన్కుంట లేశిండు.
‘మన రొండు రాశ్టాలల్ల రావుల్‌గాంది కేల్ కతమైంది. గీడ టియారెస్సుకు గిప్పట్ల సావులేదు. వూల్లల్ల టియారెస్సు దప్ప యేరే పార్టె లేకుంట పోయింది. గాడ ఆంద్రల తెల్దేశెం సుత కతమైతది. ఆంద్రల జగను పార్టి సర్కారత్తదని దేశెమంత కోడైకూత్తంది. జనాలకు పన్జేసే దిల్లునోడు గావాలె గని.. కుట్రలు, కుతంత్రాలు జేసెటోల్లెందుకు..?’ నేను సుత లేశిన పొలం కాడికి వోయెతందుకు.
– పోలంపల్లి ఆంజనేయులు, సాక్షి ప్రతినిధి– కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment