సాక్షి, న్యూఢిల్లీ : బీహార్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పరిధిలోని 72 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సోమవారం జోరుగా పోలింగ్ జరుతుతోంది. పశ్చిమ బెంగాల్‌లో అక్కడక్కడ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండగా, ఇంతకుముందు జరిగిన మూడు విడతల్లాగానే నేటి పోలింగ్‌లో కూడా అక్కడక్కడా ఈవీఎంలు మొండికేస్తున్నాయి. ముందుగా నిర్దేశించిన గడువు ప్రకారం ఒక్క కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసిపోతుండగా, మిగతా అన్ని చోట్ల సాయంత్రం ఆరు గంటలకు ముగిసిపోనుంది.
ఏప్రిల్ 11న జరిగిన మొదటి విడత లోక్‌సభ పోలింగ్‌లో 69.5 శాతం పోలింగ్, ఏప్రిల్ 18న జరిగిన రెండో విడత పోలింగ్‌లో 69.44 శాతం, మూడవ విడత పోలింగ్‌లో 67.99 శాతం పోలింగ్ నమోదయింది. మే 19 వరకు మరో మూడు విడత పోలింగ్ జరుగనుంది. మే 23వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. నాలుగో విడత ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల చైతన్యం ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడా చూసినా సరే ఉదయం నుంచే వారు బారులు కట్టి కనిపిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి దేశవ్యాప్తంగా పలు పార్టీలు, నాయకులు మహిళా ఓటర్లను ఆకర్షించడంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. మహిళా ఓటర్లను ఆకట్టుకున్నట్లయితే వారు కచ్చితంగా అనుకున్న పార్టీకి వేస్తారని, మగవారిలాగా వారిలో ఊగిసలాట ధోరణి ఉండదని వారి నమ్మకం.
పోలింగ్‌లో ఒక్క శాతం ఓటు పెరిగినా అభ్యర్థుల జాతకాలు తారుమరయ్యే అవకాశం ఉండడంతో మహిళా ఓటర్ల శాతంపైన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం పెరిగింది. అయితే ఓటింగ్ వయస్సు వచ్చినప్పటికీ కొంత మంది మహిళలు ఓటర్లుగా నమోదవడం లేదు. దేశవ్యాప్తంగా 45.10 కోట్ల మంది మహిళలకు ఓటు హక్కు వయస్సు రాగా, వారిలో 43 కోట్ల మంది మహిళలు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఓటర్లుగా నమోదు కాలేదు. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో సరాసరి 38 వేల మంది మహిళల ఓట్లు గల్లంతైనట్లే. పలు లోక్‌సభ సీట్లలో ఇంతకన్నా తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు ఓడిపోవడం లేదా గెలవడం తెల్సిందే.
ఓటు హక్కు కలిగిన మహిళలు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 33 శాతం పురుషులు ఓటేయగా, 29 శాతం మహిళలు ఓటేశారు. ఆ ఎన్నికల ద్వారానే ఇప్పటివరకు అత్యధికంగా 16వ లోక్‌సభకు అత్యధికంగా మహిళలు ఎన్నికయ్యారు. మొత్తం లోక్‌సభ ఎంపీల్లో వారి ప్రాతినిథ్యం 11.4 శాతానికి పెరిగింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 55.82 శాతం మంది మహిళలు ఓట్లు వేయగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారి శాతం 65.63 శాతం మహిళలు ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో పురుషులు 67.17 శాతం మంది ఓట్లు వేశారు. అంటే పురుషులకన్నా రెండు శాతం కన్నా తక్కువ మంది మహిళలు ఓట్లువేశారు. ఈసారి కచ్చితంగా పురుషుల సంఖ్యను మించి మహిళలు ఓట్లు వేస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment