
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీకి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జేఎన్‌యూ, హెచ్‌సీయూ వంటి విశ్వవిద్యాలయాల్లో జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ అనుబంధ సంస్థ తాజాగా అలహాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూసింది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సమాజ్‌వాది చత్ర సభ(ఎస్‌సీఎస్) భారీ విజయాన్ని ఖాయం చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విధంగా మట్టి కరిచిన ఆ పార్టీ తిరిగి విద్యార్థి ఎన్నికల రూపంలో పెద్దమొత్తంలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తం ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఒకే సీటును అది కూడా జనరల్ సెక్రటరీని దక్కించుకోగా ఎస్‌సీఎస్ మాత్రం అధ్యక్ష, ఉపాధ్యక్షపదవితోపాటు మరో రెండు కీలక పదవులను తన ఖాతాలో వేసుకుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏబీవీపీ 4 స్థానాలను సొంతం చేసుకుంది. తాజా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎస్‌సీఎస్ తరుపున బరిలో నిలిచి విజయం సాధించిన అధ్యక్షుడు అవినాష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది అందరు విద్యార్థుల విజయం అని చెప్పారు. కాగా, గురుదాస్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.