Allahabad University
-
దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన యూనివర్శిటీ ఏది?
దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ విశ్వవిద్యాలయం మనకు ముగ్గురు ప్రధానమంత్రులను, రాష్ట్రపతిని అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశానికి ముగ్గురు ప్రధాన మంత్రులను అందించిన ఘనత ఈ యూనివర్శిటీకే దక్కుతుంది. మాజీ ప్రధానులు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, గుల్జారీలాల్ నందాలు తమ ఉన్నత విద్యను ఇక్కడే కొనసాగించారు. దేశంలోని నాలుగు పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 27,28 తేదీలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది. ఇందుకోసం వర్సిటీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. యూనివర్సిటీలో పూర్తిస్థాయి విద్యార్థుల సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. దీనిలో 1996 నుంచి ఇప్పటివరకు ఇక్కడ విద్యనభ్యసించినవారు పాల్గొననున్నారు. దీనిలో పాల్గొనేందుకు 1,100 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మాయో భవనం అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని పురాతన భవనం. ఇందులో ఇంతకుముందు మయో కాలేజీ నడిచేది. ఇది కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది. అయితే 1887 సెప్టెంబర్ 23న అలహాబాద్ విశ్వవిద్యాలయం స్థాపన తర్వాత, ఇక్కడ సైన్స్ ఫ్యాకల్టీ విభాగం ఏర్పడింది. ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించి జరిగిన పలు పరిశోధనలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలకు ప్రత్యేక ప్రయోగశాలలు ఉన్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నేపధ్యలో అన్ని విభాగాలను అలంకరించారు. ఈ యూనివర్శిటీ విద్యార్థి రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ యూనివర్శిటీలో చదువుకున్న నారాయణ్ దత్ తివారీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన అలహాబాద్ యూనివర్సిటీ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. -
యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతలు..పలువురికి గాయాలు
లక్నో: అలహబాద్ యూనివర్సిటీ తీవ్ర హింసాత్మకంగా మారింది. సెక్యూరిటీ గార్డు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరువురు ఘర్షణకు దిగడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వడం, మోటారు సైకిళ్లుకు నిప్పంటించడం వంటివి చేశారు. ఈ ఘర్షణలో ఇరువురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. యూనివర్సిటీలో ఫీజుల పెంపు విషయమై నెలల తరబడి నిరసన జరుగుతోంది. అందులో భాగంగా ఓ విద్యార్థి నాయకుడు క్యాంపస్‌లోని బ్యాంకుకు వెళ్లాలనుకున్నాడు. ఐతే గార్డు అందుకు అనుమతించ లేదు. దీంతో వాగ్వాదం ఏర్పడి అది కాస్త ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌పై విదేశాంగ మంత్రి ఫైర్) -
అలహాబాద్ వర్సిటీ వీసీ రాజీనామాకు ఆమోదం
న్యూఢిల్లీ: అలహాబాద్ వర్సిటీ వీసీ రతన్ లాల్ హంగ్లూ రాజీనామాకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ) వెల్లడించింది. అనేక అవక తవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని రాష్ట్రపతి ఆదేశించారని పేర్కొంది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్చార్డీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి వర్సిటీ వీసీగా ఉన్న సమయంలోనూ హంగ్లూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. -
అలహాబాద్ యూనివర్సిటీ వీసీ రాజీనామా
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ రతన్ లాల్ హంగ్లూ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదనే ఆరోపణల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆయన.. తీవ్ర పని ఒత్తిడి కారణంగానే తాను వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 'నేను రాజీనామా చేసిన విషయం వాస్తవమే. నాకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల్లో నిజంలేదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. నిరాధారమైన ఆరోపణలతో.. అకారణంగా తరచూ విచారణలు చేపడుతుండడంతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నాను' అని హంగ్లూ పేర్కొన్నారు. ఇతరుల ప్రలోభాలకు లోనుకాకుండా, ఒత్తిడిని తట్టుకుంటూ నిజాయితీగా తన విధులు నిర్వర్తించానని హంగ్లూ ఈ సందర్బంగా తెలిపారు. అయితే హంగ్లూ పనితీరును తప్పుబడుతూ గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. అలహాబాదు విశ్వవిద్యాలయంలో 2016 నుంచి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడంతో హంగ్లూ పనితీరుపై నిఘా పెరిగింది. ఈ క్రమంలోనే.. యూనివర్సిటీ విద్యార్థినులు ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదంటూ గతవారం జాతీయ మహిళా కమిషన్ అతనికి వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే.. 'తనపై వచ్చిన ఆరోపణలను సీబీఐ ఎదుట నిరూపించండి. ఆ తర్వాత హైకోర్టులో తేల్చండి' అంటూ హంగ్లూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కాలేజీలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసేవారిని మాఫీయాగా అభివర్ణించడంతో ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు. యూనివర్సిటీలో 1,200 మంది నియామకాలు జరగాలి. నేను అక్కడ ఉంటే, ఇతరులు సిఫార్సులు, అభ్యర్థనలు స్వీకరించను. కేవలం అభ్యర్థి మెరిట్ ప్రాతిపదికన మాత్రమే వెళ్తానని, మాఫియా నుంచి ఆర్డర్లు ఎంతమాత్రం తీసుకోనని ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి కాబట్టే రాష్ట్రపతి కార్యాలయం రెండు సార్లు ఫైల్‌ను వెనక్కిపంపిందని హాంగ్లూ అన్నారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన సహాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయమై డిసెంబరు 26న జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కాగా ప్రొఫెసర్ హంగ్లూ 2015 నుంచి అలహాబాద్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైనారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి యూనివర్సిటీలో వీసీగా విధులు నిర్వర్తించారు. -
బీజేపీకి మళ్లీ షాక్.. మరో వర్సిటీ ఎన్నికల్లో ఓటమి
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీకి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే జేఎన్‌యూ, హెచ్‌సీయూ వంటి విశ్వవిద్యాలయాల్లో జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన ఆ పార్టీ అనుబంధ సంస్థ తాజాగా అలహాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూసింది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సమాజ్‌వాది చత్ర సభ(ఎస్సీఎస్) భారీ విజయాన్ని ఖాయం చేసుకుంది. రాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విధంగా మట్టి కరిచిన ఆ పార్టీ తిరిగి విద్యార్థి ఎన్నికల రూపంలో పెద్దమొత్తంలో విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ ఒకే సీటును అది కూడా జనరల్ సెక్రటరీని దక్కించుకోగా ఎస్సీఎస్ మాత్రం అధ్యక్ష, ఉపాధ్యక్షపదవితోపాటు మరో రెండు కీలక పదవులను తన ఖాతాలో వేసుకుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏబీవీపీ 4 స్థానాలను సొంతం చేసుకుంది. తాజా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎస్సీఎస్ తరుపున బరిలో నిలిచి విజయం సాధించిన అధ్యక్షుడు అవినాష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది అందరు విద్యార్థుల విజయం అని చెప్పారు. కాగా, గురుదాస్‌పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. -
బీఎస్పీ నేత హత్య.. భగ్గుమన్న అల్లర్లు!
అలహాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడిని కాల్చిచంపడం ఉత్తరప్రదేశ్‌లోని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఎస్పీ నేత రాజేశ్ యాదవ్‌ను అలహాబాద్ యూనివర్సిటీ ఎదురుగానే సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనతో భగ్గుమన్న బీఎస్పీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి హింసకు దిగారు. తమ నేత హత్యకు కారకులను వెంటనే అరెస్టుచేయాలంటూ రెండు బస్సులకు నిప్పుపెట్టారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిపై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి దాటకుండా అలహాబాద్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి సమయంలో రాజేశ్ యాదవ్ కొంతమందిని కలిసేందుకు యూనివర్సిటీ సమీపంలోని తారాచంద్ హాస్టల్‌కు వెళ్లారు. డాక్టర్ ముకుల్ సింగ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన రాజేశ్ కొందరితో గొడవపడ్డాడు. దీంతో దుండగులు ఆయనపై దాడి చేశారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి ముకుల్ సింగ్ తెలిపారు. రాజేశ్ యాదవ్ హత్యతో అలహాబాద్‌లో బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. -
'ఎంపీలు, ఎమ్మెల్యేలతో సరే.. ఇక మేమెందుకు'
అలహాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తూ రాజకీయాలతో సతమతమవుతున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ, జాతి వ్యతిరేక నినాదాల చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జేఎన్‌యూ వార్తల్లో నిలవగా... వీటి బాటలోనే అలహాబాద్ యూనివర్సిటీ రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థి సంఘం నాయకురాలు కొన్ని రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలతో యూనివర్సిటీలను నిర్వహించడం కంటే వర్సిటీ వైస్ చాన్సలర్ గా రాజకీయ నేతలనే నియమిస్తే బాగుంటుందని అలహాబాద్ వర్సిటీ చాన్సలర్ ఆర్ఎల్ హంగ్లూ తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలువబడుతూ పేరు గాంచిన ఈ కేంద్ర వర్సిటీ రాజకీయాల కారణాలతో దీని ప్రతిష్ట మసక బారుతుందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. పీజీ ఎంట్రన్స్ టెస్టులు అన్ లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, బీజేపీ నేతలు, ఏబీవీపీ నేతలు నిరాహారదీక్షకు దిగి ఆఫ్ లైన్ విధానాన్ని ఒప్పుకునేలా చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్మృతీఇరానీ, బీజేపీ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ఈ నేపథ్యంలో వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా తాము ఉండటం కంటే ఎంపీలు, ఎమ్మెల్యేలనే నియమించడం మంచిదంటూ ఆర్ఎల్ హంగ్లూ తన అసహనాన్ని వెల్లగక్కారు. -
ఇక లొల్లి అలహాబాద్ యూనివర్సిటీలో!
అలహాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ, జాతి వ్యతిరేక నినాదాల వివాదం నేపథ్యంలో ఢిల్లీలోని జేఎన్‌యూ పతాక శీర్షికలకు ఎక్కగా తాజాగా అలహాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్.. తనను యూనివర్సిటీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించింది. యూనివర్సిటీలో కొందరు అధికారుల నియామకాన్ని తాను వ్యతిరేకించడంతో తనను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని అలహాబాద్ యూనివర్సిటీ మొదటి మహిళా విద్యార్థి నాయకురాలు జ్యోతీ సింగ్ ఆరోపించింది. యూనివర్సిటీ అధికారులు తన అడ్మిషన్‌ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె మీడియాతో తెలిపారు. యూనివర్సిటీ పరిసరాల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ యోగి ఆదిత్యానంత్ నిర్వహించిన కార్యక్రమాన్ని తాను వ్యతిరేకించినప్పటి నుంచి.. తనపై దూషణలు పెరిగాయని ఆమె వెల్లడించింది. కాగా యూనివర్సిటీలో ఆమె ప్రవేశం పొందటంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చేపట్టిన విచారణలో యూనివర్సిటీ అధికారుల తప్పిదం వల్లనే జ్యోతీ సింగ్‌కు పరిశోధక విద్యార్థిగా సీటు లభించిందని తేలినట్లు సమాచారం. -
ఏయూలో ఎల్ఎల్బీ కోర్సు ప్రారంభం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఏయూ న్యాయ కళాశాలలో ఈ ఏడాది నుంచి ఎల్ఎల్బీ ఐదేళ్ల (సెల్ఫ్ ఫైనాన్స్) కోర్సు ప్రారంభించినట్టు ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు తెలిపారు. ఏయూ సెనేట్ హాల్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. 10+2 (ఇంటర్) ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులన్నారు. ఎల్ఎల్బీలో ఉన్న 60 సీట్లను లాసెట్ కన్వీనర్ ఆదేశాల మేరకు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ కోర్సులో చేరేందుకు ఇతర దేశాల విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకున్నారని వీసీ చెప్పారు. ఎల్ఎల్బీలో పది సెమిస్టర్లుంటాయని, 24 కంపల్సరీ సబ్జెక్టులు, 6 ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టులుంటాయని వీసీ వివరించారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను లా కళాశాల ప్రిన్సిపాల్ త్వరలో వెబ్సైట్లో పొందుపర్చుతారని పేర్కొన్నారు. లా కళాశాల చరిత్ర గొప్పది ఏయూ లా కళాశాల చరిత్ర గొప్పదని, ఇక్కడ చదువుకున్నవారు మంచి హోదాల్లో నిలిచారని వీసీ వివరించారు. ఇక్కడ చదివిన ఎం.వెంకయ్య నాయుడు, కె.ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రులుగా, జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా, సుప్రీంకోర్టు న్యామూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి కె.రామస్వామి, దేశంలో మొట్టమొదటి మహిళా హైకోర్టు జడ్జి అమరేశ్వరి, జస్టిస్.పి.రామకృష్ణరాజు, మాజీ ఎన్నికల అధికారి జి.వి.జి.కృష్ణమూర్తి, డి.వి.సుబ్బారావు ఇలా ఎంతో మందిని ఈ కళాశాల దేశానికి అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.రామ్మోహన్రావు, రెకా ్టర్ సూర్యనారాయణ రాజు, లా కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుబ్రహ్మణ్యం, న్యాయ విభాగం ఆచార్యులు పాల్గొన్నారు.