ఏయూలో ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రారంభం
Published Tue, Aug 13 2013 6:46 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఏయూ న్యాయ కళాశాలలో ఈ ఏడాది నుంచి ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల (సెల్ఫ్ ఫైనాన్స్) కోర్సు ప్రారంభించినట్టు ఏయూ వీసీ జి.ఎస్.ఎన్.రాజు తెలిపారు. ఏయూ సెనేట్ హాల్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. 10+2 (ఇంటర్) ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుకు అర్హులన్నారు. ఎల్‌ఎల్‌బీలో ఉన్న 60 సీట్లను లాసెట్ కన్వీనర్ ఆదేశాల మేరకు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. ఈ కోర్సులో చేరేందుకు ఇతర దేశాల విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకున్నారని వీసీ చెప్పారు. ఎల్‌ఎల్‌బీలో పది సెమిస్టర్‌లుంటాయని, 24 కంపల్సరీ సబ్జెక్టులు, 6 ఆప్షనల్ సబ్జెక్టులతో పాటు ఇతర సబ్జెక్టులుంటాయని వీసీ వివరించారు. ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను లా కళాశాల ప్రిన్సిపాల్ త్వరలో వెబ్‌సైట్‌లో పొందుపర్చుతారని పేర్కొన్నారు.
లా కళాశాల చరిత్ర గొప్పది
ఏయూ లా కళాశాల చరిత్ర గొప్పదని, ఇక్కడ చదువుకున్నవారు మంచి హోదాల్లో నిలిచారని వీసీ వివరించారు. ఇక్కడ చదివిన ఎం.వెంకయ్య నాయుడు, కె.ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రులుగా, జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా, సుప్రీంకోర్టు న్యామూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి కె.రామస్వామి, దేశంలో మొట్టమొదటి మహిళా హైకోర్టు జడ్జి అమరేశ్వరి, జస్టిస్.పి.రామకృష్ణరాజు, మాజీ ఎన్నికల అధికారి జి.వి.జి.కృష్ణమూర్తి, డి.వి.సుబ్బారావు ఇలా ఎంతో మందిని ఈ కళాశాల దేశానికి అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావు, రెకా ్టర్ సూర్యనారాయణ రాజు, లా కళాశాల ప్రిన్సిపాల్ ఎ. సుబ్రహ్మణ్యం, న్యాయ విభాగం ఆచార్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement