'ఎంపీలు, ఎమ్మెల్యేలతో సరే.. ఇక మేమెందుకు'
అలహాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఒక్కొక్కటిగా వార్తల్లో నిలుస్తూ రాజకీయాలతో సతమతమవుతున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ, జాతి వ్యతిరేక నినాదాల చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని జేఎన్యూ వార్తల్లో నిలవగా... వీటి బాటలోనే అలహాబాద్ యూనివర్సిటీ రాజకీయ రంగు పులుముకుంది. విద్యార్థి సంఘం నాయకురాలు కొన్ని రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే.
ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలతో యూనివర్సిటీలను నిర్వహించడం కంటే వర్సిటీ వైస్ చాన్సలర్ గా రాజకీయ నేతలనే నియమిస్తే బాగుంటుందని అలహాబాద్ వర్సిటీ చాన్సలర్ ఆర్ఎల్ హంగ్లూ తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్ గా పిలువబడుతూ పేరు గాంచిన ఈ కేంద్ర వర్సిటీ రాజకీయాల కారణాలతో దీని ప్రతిష్ట మసక బారుతుందంటూ ఆందోళన వ్యక్తంచేశారు. పీజీ ఎంట్రన్స్ టెస్టులు అన్ లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, బీజేపీ నేతలు, ఏబీవీపీ నేతలు నిరాహారదీక్షకు దిగి ఆఫ్ లైన్ విధానాన్ని ఒప్పుకునేలా చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి స్మృతీఇరానీ, బీజేపీ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, ఈ నేపథ్యంలో వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా తాము ఉండటం కంటే ఎంపీలు, ఎమ్మెల్యేలనే నియమించడం మంచిదంటూ ఆర్ఎల్ హంగ్లూ తన అసహనాన్ని వెల్లగక్కారు.