
అలహాబాద్ విశ్వవిద్యాలయం
లక్నో: అలహాబాద్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ రతన్ లాల్ హంగ్లూ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి, లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదనే ఆరోపణల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఆయన.. తీవ్ర పని ఒత్తిడి కారణంగానే తాను వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. 'నేను రాజీనామా చేసిన విషయం వాస్తవమే. నాకు వ్యతిరేకంగా వచ్చే ఆరోపణలు, ఫిర్యాదుల్లో నిజంలేదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. నిరాధారమైన ఆరోపణలతో.. అకారణంగా తరచూ విచారణలు చేపడుతుండడంతో విసుగుచెంది రాజీనామా చేస్తున్నాను' అని హంగ్లూ పేర్కొన్నారు. ఇతరుల ప్రలోభాలకు లోనుకాకుండా, ఒత్తిడిని తట్టుకుంటూ నిజాయితీగా తన విధులు నిర్వర్తించానని హంగ్లూ ఈ సందర్బంగా తెలిపారు. అయితే హంగ్లూ పనితీరును తప్పుబడుతూ గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. అలహాబాదు విశ్వవిద్యాలయంలో 2016 నుంచి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు చుట్టుముట్టడంతో హంగ్లూ పనితీరుపై నిఘా పెరిగింది.
ఈ క్రమంలోనే.. యూనివర్సిటీ విద్యార్థినులు ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదంటూ గతవారం జాతీయ మహిళా కమిషన్ అతనికి వ్యతిరేకంగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే.. 'తనపై వచ్చిన ఆరోపణలను సీబీఐ ఎదుట నిరూపించండి. ఆ తర్వాత హైకోర్టులో తేల్చండి' అంటూ హంగ్లూ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కాలేజీలో తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసేవారిని మాఫీయాగా అభివర్ణించడంతో ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు. యూనివర్సిటీలో 1,200 మంది నియామకాలు జరగాలి. నేను అక్కడ ఉంటే, ఇతరులు సిఫార్సులు, అభ్యర్థనలు స్వీకరించను. కేవలం అభ్యర్థి మెరిట్ ప్రాతిపదికన మాత్రమే వెళ్తానని, మాఫియా నుంచి ఆర్డర్లు ఎంతమాత్రం తీసుకోనని ప్రకటించారు.
తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి కాబట్టే రాష్ట్రపతి కార్యాలయం రెండు సార్లు ఫైల్‌ను వెనక్కిపంపిందని హాంగ్లూ అన్నారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి చట్టపరమైన సహాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే విషయమై డిసెంబరు 26న జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరై, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కాగా ప్రొఫెసర్ హంగ్లూ 2015 నుంచి అలహాబాద్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమితులైనారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి యూనివర్సిటీలో వీసీగా విధులు నిర్వర్తించారు.