సామ, దాన, భేద దండోపాయాలు.. మాయోపాయాలు.. టక్కుటమార విద్యలు, కుట్రలు, కుతంత్రాలు.. చిన్నప్పుడెప్పుడో వీటి గురించి వినే ఉంటాం. కానీ, ఇప్పుడు వీటి గురించి చాలా తరచుగా వింటున్నాం.. కంటున్నాం. ఇప్పుడు నడుస్తున్న ‘రాజకీయాలు’ అటువంటివి మరి. ప్రస్తుత ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేయాలన్న తాపత్రయంతో నేతలు విలువలకు తిలోదకాలిస్తున్న తీరు రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన వారిని పోటీలోకి దించడం మొదలుకుని డమ్మీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించడం.. ఓటర్ల కంటే మూఢనమ్మకాలకే ఎక్కువ విలువ ఇవ్వడం వరకూ.. నేతాశ్రీలు చేయని ఫీట్లు లేవు. వేయని వేషాలు లేవు. ఇంకో విషయం.. ఇవన్నీ కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదండోయ్!! ఇరుగుపొరుగు.. ఉత్తర, పశ్చిమాల్లోనూ ఇదేతీరు!!
పేరులో.. నేమ్ ఉంది!
పేరులో ఏముంది? అని అంటుంటారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన నామినేషన్ల ప్రక్రియను చూస్తే మాత్రం పేరులో ఇంత విషయం ఉందా? అనిపిస్తుంది. ‘ప్రజాశాంతి’ పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగిన మత ప్రబోధకుడు కె.ఎ.పాల్. ఆంధ్రప్రదేశ్‌లోని 38 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను బరి లోకి దించారు. ఓటర్ల మధ్య గందరగోళం సృష్టించి ఆ స్థానంలో బలంగా ఉన్న పార్టీకి కొంత మేరకైనా నష్టం చేకూర్చాలన్నది ఈ కుతంత్రం ఉద్దేశం. తాము గెలవకున్నా ఫర్వాలేదు.. ప్రత్యర్థి బలాన్ని తగ్గిస్తే చాలన్న దురాలోచన అన్నమాట.
♦ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ స్థానంలో కేంద్రమంత్రి అనంత్ గీతే నెగ్గింది కేవలం రెండు వేల పైచిలుకు ఓట్లతో మాత్రమే. ఈ స్థానంలో అనంత్ సమీప ప్రత్యర్థి సునీల్ తట్‌కెరె! కాకపోతే సునిల్ పేరున్న మరో అనామక స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 9,849 ఓట్లు పడ్డాయి. వీటిల్లో ఏ కొన్ని తట్‌కెరెకే పడి ఉన్నా ఫలితం తారుమారయ్యేదే!.
♦ హింగోలీలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ శివసేన అభ్యర్థి సుభాష్ వాంఖెడే 1,632 ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ సతావ్ చేతిలో ఓడిపోయారు. సుభాష్ పేరుతో పోటీచేసిన ఇద్దరికి ఆరువేల చొప్పున ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో వాంఖెడే అదే హింగోలి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. కానీ ఈసారి ఆయనకు ప్రత్యర్థులుగా ఎనిమిది మంది సుభాష్‌లు బరిలో నిలిచి సవాల్ విసురుతున్నారు.
♦ నాందేడ్‌లో ఈసారి ఇద్దరు అశోక్‌లు బరిలో ఉండగా.. ఒకాయన మాజీ ముఖ్యమంత్రి. ఇంకొకరు సాధారణ పౌరుడు, స్వతంత్ర అభ్యర్థి.
♦ గత ఎన్నికల్లో ముంబైలోని అలీబాగ్ స్థానం నుంచి పోటీ చేసిన మీనాక్షీ పాటిల్‌కు ప్రత్యర్థులుగా ఆరుగురు మీనాక్షీలు నిలిచారు. ఇక్కడ ఇంటి పేరు కూడా ఒకటే కావడం చెప్పుకోవాల్సిన అంశం.
♦ తమిళనాడు విషయానికొస్తే ఇక్కడ కూడా చాలా స్థానాల్లో ఒకే పేరున్న.. ఇనీషియల్ ఉన్న వారూ బరిలో ఉన్నారు. చెన్నై సెంట్రల్ నియోజకవర్గంలో పీఎంకే అభ్యర్థి సామ్ పాల్ కాగా.. అదే పేరు, స్పెల్లింగ్‌తో ఇంకొకరు ప్రత్యర్థిగా నిలబడ్డారు. సామ్యుల్ పాల్ పేరుతో మరొకరు పోటీ చేస్తుండటం విశేషం.
♦ పెరంబూర్ ఉప ఎన్నికల్లో పి.వెట్రివేల్ (ఏఎంఎంకే) కాగా.. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులవీ అవే పేర్లు. 15 లోక్‌సభ స్థానాల్లోనూ ఒకే పేర్లను పోలిన వారు పలువురు ఉన్నారు.
ఓటరు స్లిప్స్ పంచకుండా..
ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు అనుసరించే ఇంకో కుయుక్తి.. కొన్ని ప్రాంతాల్లో ఓటర్ స్లిప్‌లు పంచకపోవడం. ఓటరు జాబితా నుంచి కొన్ని పేర్లు తొలగించడం ఇంకో మార్గం. ఆంధప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ తన సేవామిత్ర ఆప్ సాయంతో కొన్ని లక్షల ఓట్లు తొలగించిందన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆంధప్రదేశ్‌లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ బీజేపీ దాదాపు 40 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించిందని, ఇందులో దళితులు, ముస్లింలే ఎక్కువగా ఉన్నారని జేడీఎస్ జాతీయ కార్యదర్శి, మాజీ న్యాయమూర్తి బిజి కోల్సే పాటిల్ ఇటీవలే ఆరోపించిన విషయం ప్రస్తావనార్హం. చివరగా మూఢనమ్మకాలపై ఒకే ఒక్క ఉదాహరణ.. పార్టీ ఆఫీసుల గుమ్మాలకు తగిలించే నిమ్మకాయ, పచ్చి మిరపకాయలను ప్రత్యర్థుల కార్యాలయాల్లోకి పారేయడం ద్వారా ప్రతికూలతలన్నీ అటు వైపు నెట్టేస్తామని ఒక పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment