సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికార పార్టీ శక్తులు పథకం ప్రకారం అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, కాబట్టి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది..‘అధికార పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లు ఫోర్జరీ చేసిన 17–సి ఫామ్‌లు తెచ్చి, అక్కడి కౌంటింగ్ సూపర్‌వైజర్లతో చీటికీమాటికీ వాదనలకు దిగి లెక్కింపు ప్రక్రియను ఆలస్యమయ్యేలా చేసేందుకు ప్రయత్నించొచ్చు. కాబట్టి 17–సి ఫోర్జరీ ఫామ్‌లను తెచ్చే ఏజెంట్లపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించాలి.
ఎన్నికల పరిశీలకులందరినీ వీలైనంత వరకూ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనే ఉండేలా చేయడమే కాకుండా.. ఇలాంటి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేయాలి. అప్పుడే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకుని విధినిర్వహణ చేస్తారు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవారిలో గందరగోళం, అయోమయం సృష్టించేందుకు వారిని స్క్రీనింగ్ చేయడం, అనుమతి ఇవ్వడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయాలని చూస్తున్నారు. మా పార్టీ తరఫున నియమితులయ్యే ఏజెంట్లలో కొందరి నియామకాన్ని కావాలనే తిరస్కరించి, వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వ్యవధిని కూడా ఇవ్వకపోవచ్చు. చివరి క్షణంలో వచ్చే చిక్కులను అధిగమించడానికి ఏజెంట్ల అనుమతి ప్రక్రియను వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు.
కౌంటింగ్ ఏజెంట్లందరినీ తనిఖీ చేయాలి: ‘కౌంటింగ్ ఏజెంట్లందరినీ క్షుణ్నంగా తనిఖీ చేయడంతోపాటు వారు సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, కత్తులు, కత్తెరలు, నీళ్ల బాటిళ్లు వంటివి తీసుకురాకుండా నిరోధించాలి. లెక్కింపు కేంద్రాల లోపల కౌంటింగ్ ఏజెంట్లు ఈవీఎంలు పరిశీలించేటప్పుడు ఏర్పాటు చేసే మెష్ (వల)తోపాటు దాని వెంట ఇనుప బారికేడ్లను కూడా పెట్టాలి. దీని వల్ల అనవసర వివాదాలు తలెత్తకుండా ఉంటాయి. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించాలి. కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే రాష్ట్ర పోలీసు అధికారులు అధికార పార్టీ నుంచి వచ్చే ఒత్తిడులు, వారి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత మేరకు కేంద్ర భద్రతా బలగాలను ఆయా కేంద్రాల వద్ద నియమించాలి’ అని ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి విన్నవించారు. ఎన్నికల కమిషన్‌లోని ముఖ్య అధికారులందరిపైనా తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తాము ఈసీ ముందుంచిన అంశాలపై సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా పోలింగ్‌ను నిర్వహించినందుకు ఎన్నికల కమిషన్‌లోని ముఖ్య అధికారులకు వైఎస్సార్‌సీపీ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు.
కౌంటింగ్‌లో అధికార పార్టీ అల్లర్లు సృష్టించొచ్చు
Published Wed, May 1 2019 4:54 AM | Last Updated on Wed, May 1 2019 9:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment