
సాక్షి, భోపాల్ : మదర్సాలలో సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్యను అందించాల్సిన అవసరముందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో మదర్సా బోర్డు ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చౌహాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మదర్సాల్లో ఆధునిక విద‍్యను బోధించడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే మదర్సాలకు ప్రభుత్వం ఇస్తున్న మౌలిక వసతుల కల్పన మొత్తాన్ని రూ. 25 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
సంప్రదాయ, ఆధునిక విద్యను అందించడం వల్ల విద్యార్థులు మానవతావాదులగా, వ్యక్తిత్వ నిపుణులుగా తయారవుతారని చౌహాన్ అన్నారు. భగవంతుడు మనకు ఇచ్చిన బహుమతి.. విద్యార్థులే. వారిని ఆదర్శవంతమైన వారిగా మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, పెద్దలకు ఉంది. విద్యార్థులను ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది రేపటి భారతానికి అందించాలంటే.. అందుకు మనం చేయాల్సింది వారికి నాణ్యతమైన విద్యను అందించడమేనని చౌహాన్ చెప్పారు. విద్యార్థులకు ఒకటో తరగతి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందివ్వాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం మదర్సా బోర్డుకు ప్రత్యేకంగా ఆడిటోరియంను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అన్ని మతాలవారు.. అన్ని రకాల ప్రజలు సమైక్యంగా దేశానికి సేవ చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు.