సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో నైరాశ్యం అలముకుంది! అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలకుతోడు రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తిప్పికొట్టలేకపోతోందన్న భావన కేడర్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీ మారుతున్నారంటూ రోజుకో నేత పేరు తెరపైకి వస్తుండటం, ఆ వార్తలను కొందరు ఖండిస్తున్నా మరికొందరు మౌనంగా ఉండటంతో పార్టీలో ఎవరుంటారో, ఎవరు వీడతారో అర్థంకాక కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలోని ముఖ్య నాయకులకు గాలం వేస్తోందన్న వార్తలు కూడా కేడర్‌లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు తోడు కొందరు నాయకులు రహస్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిశారన్న ప్రచారాన్ని ఎదుర్కొనే వ్యూహంలో కూడా పార్టీ రాష్ట్రశాఖ వెనుకబడటం గమనార్హం.
నిజంగానే టచ్‌లో ఉన్నారా..?
రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన సతీమణి పద్మినిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే శశిధర్‌రెడ్డితోపాటు రాజనర్సింహ తాము బీజేపీలో చేరడం లేదని, అలాంటి ప్రస్తావనే రాదని కొట్టిపారేశారు. కానీ సుదర్శన్‌రెడ్డి మాత్రం ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు. దీనికితోడు గత ఎన్నికలకు ముందే రాజనర్సింహ సతీమణి పద్మిని బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆమెపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మరో నేత, మెదక్ జిల్లా నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన ఓ అభ్యర్థి, టీపీసీసీలో కీలక పదవిలో ఉన్న మహిళా నాయకురాలు ఒకరు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరంతా తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నా ఆ నాయకులు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాము బీజేపీలోకి వెళుతున్నామని తమ కేడర్‌తో కూడా చర్చించకుండానే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
భారీ చేరికలా?
ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన కూడా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తుండటంతో కమలదళంలోకి భారీగా చేరికల కార్యక్రమం కూడా ఉంటుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ వర్గాలు మాత్రం చేరికలుంటాయని చెబుతున్నాయే కానీ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీలోకి వెళతానని చెప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు టీఆర్‌ఎస్ అసంతృప్త నేత వివేక్ తదితరులు కాషాయ కండువాలు కప్పుకోవచ్చని, వారికి మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా తోడవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతికంగా ఇబ్బందికరమైందని బీజేపీ అధిష్టానమే చెబుతోందని, ఈ కారణంతో ఆయన చేరిక కొంత ఆలస్యం కావచ్చని సమాచారం.
ఖాళీ చేయడమేమో కానీ...
రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ డిసెంబర్‌కల్లా గాంధీ భవన్‌ను ఖాళీ చేయించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని చెబుతుండగా ఖాళీ చేయడమేమోకానీ మానసికంగా ఇబ్బందుల్లో పడేసే పనిలో మాత్రం బీజేపీ సక్సెస్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం కారణంగానే కాంగ్రెస్ కేడర్ అయోమయంలో పడిపోతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, కావాలనే కొందరు నేతల పేర్లను ప్రచారంలో పెట్టి వారంతా తమ పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలను పంపడం ద్వారా మైండ్‌గేమ్ ఆడుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ దీన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది వేచిచూడాల్సిందే.
గంభనంగా కాంగ్రెస్...
పార్టీ నుంచి నాయకులంతా వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం గంభనంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని గట్టిగా నమ్ముతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తమకన్నా ఒక సీటు అదనంగా వచ్చినా ఓట్ల శాతం మాత్రం బీజేపీకన్నా దాదాపు 10 శాతం తమకే ఎక్కువగా వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో తామే ప్రత్యామ్నాయం కాగలమని, నేతలెవరూ పార్టీని వీడరని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతోంది. క్యాడర్ సైతం ఇదే నమ్మకంతో ఉందని పేర్కొంటోంది. ఒకవేళ ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినా ప్రతిపక్షంగా మాత్రం తామే నిలబడగలమని ధీమాగా ఉంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది.
కాంగ్రెస్.. గజిబిజి!
Published Wed, Jul 3 2019 1:24 AM | Last Updated on Wed, Jul 3 2019 5:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment