komati reddy ramgopal reddy
-
వైఎస్ఆర్టీపీ దీక్షకు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంఘీబావం
-
కాంగ్రెస్.. గజిబిజి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో నైరాశ్యం అలముకుంది! అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలకుతోడు రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సాగిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్‌ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తిప్పికొట్టలేకపోతోందన్న భావన కేడర్‌ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీ మారుతున్నారంటూ రోజుకో నేత పేరు తెరపైకి వస్తుండటం, ఆ వార్తలను కొందరు ఖండిస్తున్నా మరికొందరు మౌనంగా ఉండటంతో పార్టీలో ఎవరుంటారో, ఎవరు వీడతారో అర్థంకాక కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీలోని ముఖ్య నాయకులకు గాలం వేస్తోందన్న వార్తలు కూడా కేడర్‌లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు తోడు కొందరు నాయకులు రహస్యంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కలిశారన్న ప్రచారాన్ని ఎదుర్కొనే వ్యూహంలో కూడా పార్టీ రాష్ట్రశాఖ వెనుకబడటం గమనార్హం. నిజంగానే టచ్‌లో ఉన్నారా..? రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆయన సతీమణి పద్మినిల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే శశిధర్‌రెడ్డితోపాటు రాజనర్సింహ తాము బీజేపీలో చేరడం లేదని, అలాంటి ప్రస్తావనే రాదని కొట్టిపారేశారు. కానీ సుదర్శన్‌రెడ్డి మాత్రం ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు. దీనికితోడు గత ఎన్నికలకు ముందే రాజనర్సింహ సతీమణి పద్మిని బీజేపీ కండువా కప్పుకోవడంతో ఆమెపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మరో నేత, మెదక్ జిల్లా నుంచి పార్లమెంటుకు పోటీ చేసిన ఓ అభ్యర్థి, టీపీసీసీలో కీలక పదవిలో ఉన్న మహిళా నాయకురాలు ఒకరు బీజేపీతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. వీరంతా తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నా ఆ నాయకులు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాము బీజేపీలోకి వెళుతున్నామని తమ కేడర్‌తో కూడా చర్చించకుండానే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. భారీ చేరికలా? ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటన కూడా కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తుండటంతో కమలదళంలోకి భారీగా చేరికల కార్యక్రమం కూడా ఉంటుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ వర్గాలు మాత్రం చేరికలుంటాయని చెబుతున్నాయే కానీ ఎవరన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీలోకి వెళతానని చెప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్ అసంతృప్త నేత వివేక్ తదితరులు కాషాయ కండువాలు కప్పుకోవచ్చని, వారికి మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా తోడవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాజగోపాల్‌రెడ్డి చేరిక సాంకేతికంగా ఇబ్బందికరమైందని బీజేపీ అధిష్టానమే చెబుతోందని, ఈ కారణంతో ఆయన చేరిక కొంత ఆలస్యం కావచ్చని సమాచారం. ఖాళీ చేయడమేమో కానీ... రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ డిసెంబర్‌కల్లా గాంధీ భవన్‌ను ఖాళీ చేయించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని చెబుతుండగా ఖాళీ చేయడమేమోకానీ మానసికంగా ఇబ్బందుల్లో పడేసే పనిలో మాత్రం బీజేపీ సక్సెస్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం కారణంగానే కాంగ్రెస్ కేడర్ అయోమయంలో పడిపోతోంది. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, కావాలనే కొందరు నేతల పేర్లను ప్రచారంలో పెట్టి వారంతా తమ పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలను పంపడం ద్వారా మైండ్‌గేమ్ ఆడుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కానీ దీన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది వేచిచూడాల్సిందే. గంభనంగా కాంగ్రెస్... పార్టీ నుంచి నాయకులంతా వెళ్లిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం గంభనంగా ఉంది. రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదని గట్టిగా నమ్ముతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తమకన్నా ఒక సీటు అదనంగా వచ్చినా ఓట్ల శాతం మాత్రం బీజేపీకన్నా దాదాపు 10 శాతం తమకే ఎక్కువగా వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తోంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు భవిష్యత్తులో తామే ప్రత్యామ్నాయం కాగలమని, నేతలెవరూ పార్టీని వీడరని కాంగ్రెస్ నాయకత్వం నమ్ముతోంది. క్యాడర్ సైతం ఇదే నమ్మకంతో ఉందని పేర్కొంటోంది. ఒకవేళ ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినా ప్రతిపక్షంగా మాత్రం తామే నిలబడగలమని ధీమాగా ఉంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతోంది. పట్టణ ప్రాంతాల్లో టీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. -
చతికిలబడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్
సాక్షి, హైదరాబాద్: మితిమీరిన ఆత్మవిశ్వాసం.. గత ఎన్నికల్లో గెలిచామన్న ధీమా.. లోపించిన వ్యూహం.. పట్టించుకోని నాయకత్వం.. వెరసి స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లోనూ ఘోర పరాజయం పాలైంది. గెలిచే అవకాశమున్న నల్లగొం డ స్థానాన్ని కూడా చేజేతులా పోగొట్టుకుని మండలిలో సింగిల్ సీటుకే పరిమితమైంది. వరంగల్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. రంగారెడ్డిలో ఓ మోస్తరు ఓట్లు సాధించినా అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ వరకు పకడ్బందీ వ్యూహం లేకపోవడంతో ఓడిపోయింది. ఓటమికి సవాలక్ష కారణాలు గతంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్య లో గెలిచారు. నల్లగొండ, రంగారెడ్డి స్థానాల పరిధిలో అయితే ఎమ్మెల్సీ సీటు గెలిచే స్థాయి కన్నా ఎక్కువ ఓట్లే ఆ పార్టీకి ఉన్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిలో ఎక్కువ మంది టీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో వరంగల్‌తో పాటు ఆ రెండు స్థానాల్లో కూడా టీఆర్ఎస్కు మంచి సంఖ్య లో ఓటర్లు లభించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి భర్త రాజగోపాల్‌రెడ్డి 150 ఓట్లకు పైగా మెజార్టీతో ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన తేరా చిన్నపురెడ్డిపైనే విజయం సాధించారు. అప్పుడు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం సమష్టి కృషితో టీఆర్ఎస్ను ఖంగు తినిపించారు. ఈ ఎన్నికల్లో ఆ వ్యూహం ఎక్కడా కనిపించలేదు. ఓ వైపు అధికార పార్టీ ఓటర్లను పోగు చేసుకునే విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తే కాంగ్రెస్ మాత్రం క్యాంపు రాజకీయాలు నడపడంలో ఫెయిలైంది. గతంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారిని, సానుభూతిపరులను ఆకట్టుకునే విషయంలో కూడా స్థాని క, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోంది. గెలుపు ముంగిట బొక్క బోర్లా నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం విషయానికి వస్తే 2015 డిసెంబర్లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు, అభ్యర్థులు పాతవారే అయినా ఫలితం మాత్రం తిరగబడింది. గత ఎన్నికల్లోనూ గెలిచామని, అప్పుడు ఓటేసిన వారంతా ఇంకా తమవైపే ఉన్నారని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ చతికిలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రాజగోపాల్‌కి వచ్చిన మెజార్టీని అధిగమించి టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ సాధించారంటే గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌తో పోలిస్తే ఎంత క్రాస్ ఓటింగ్ జరిగిందో అర్థమవుతుంది. దీనికితోడు ఉత్తమ్, జానారెడ్డి లాంటి నేతలు ఈ సారి పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి ప్రతి ఓటరును కదిలించిన కాంగ్రెస్ నేతలు ఈసారి పట్టించుకోకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి ఒంటిచేత్తో ఎన్నికను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అందుకే ఓడిపోయారనే చర్చ జరుగుతోంది. -
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నుంచి ఉదయ్ మోహన్ రెడ్డి పేర్లను ఏఐసీసీ సోమవారం అధికారికంగా వెల్లడించింది. కాగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వరంగల్ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి స్థానానికి పట్నం మహేందర్‌రెడ్డి, నల్లగొండ స్థానానికి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 2015లో జరిగిన సాధారణ ఎన్నికలలో కొండా మురళీధర్‌రావు (వరంగల్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొం డ), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో కొండా ముర ళీధర్‌రావు డిసెంబరులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడింటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
ఫ్రంట్‌లో కొడుకు, కూతురే: కోమటిరెడ్డి
యాదగిరిగుట్ట: థర్డ్ ఫ్రంట్ అంటూ ఇటీవల సీఎం కేసీఆర్ దేశమంతా పర్యటిస్తే ఎవరు కూడా మద్దతు ప్రకటించలేదని, ఆ ఫ్రంట్‌లో ఉన్నది కేవలం కేసీఆర్ ఆయన కొడుకు, కూతురేనని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను కాదు.. కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేయాలని ఇటీవల పలు సభల్లో అభ్యర్థులను కేటీఆర్ అవమానించారన్నారు. ముఖం చూపెట్టలేని ఎంపీలను గెలిపిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని కోమటిరెడ్డి హామీనిచ్చారు. అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. -
సీపీఐ జైలుభరో ఉద్రిక్తం
పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట.. పలువురి అరెస్ట్ పేదల భూములు గుంజుకుంటే గోరి కడతాం జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి భూసేకరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ ముకరంపుర : రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట జైలు భరో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు సీపీఐ కార్యాలయం నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని బైఠాయించారు. ‘మన భూములపై మన హక్కులను కాపాడుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. దాదాపు రెండు గంటల ధర్నా చేసిన అనంతరం ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రధాన ద్వారం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరి గింది. కార్యకర్తలను బలవంతంగా ఈడ్చుకెళ్లే క్రమంలో పలువురి చొక్కాలు చిరిగాయి. కొందరు కార్యకర్తలు గాయాలపాలయ్యారు. పోలీసులు 150 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేసి కరీంనగర్ వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. మోడీ సర్కారు గోరీ కడుతాం.. ఈ సందర్బంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... భూసేకరణ బిల్లు ద్వారా రైతుల భూములను గుంజుకుంటే కేంద్ర ప్రభుత్వానికి గోరీ కడతామన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న బలవంతపు భూసేకరణ చట్టం భూమిని కొందరి చేతుల్లో కేంద్రీకరించడానికి దోహదపడుతుందన్నారు. ప్రజ లు భూములు కోల్పోవడంతో సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదముందని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చే ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కౌన్సిల్ సబ్యుడు బోయిని అశోక్, నాయకులు కూన శోభారాణి, కర్రె భిక్షపతి, గూడెం లక్ష్మి, పొనగంటి కేదారి, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, పెండ్యాల ఐలయ్య, అందె స్వామి, వేల్పుల బాలమల్లు, పంజాల శ్రీనివాస్, మారుపాక అనిల్‌కుమార్, కాల్వ నర్సయ్య, కొయ్యడ సృజన్‌కుమార్, గుంటి వేణు, బి.మహేందర్, సూర్య, ఎనగందుల రాజయ్య, రవి, రవీందర్‌రెడ్డి, వెంకటరమ ణ,కనకయ్య, కిన్నెర మల్లమ్మ,సంతోష్‌చారి, మణికంఠరెడ్డి, మల్లేశ్, రాజ్‌కుమార్, జక్కు రాజుగౌడ్, జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, చెప్యాల వేణు తదితరులు పాల్గొన్నారు.