సాక్షి, హైదరాబాద్: మితిమీరిన ఆత్మవిశ్వాసం.. గత ఎన్నికల్లో గెలిచామన్న ధీమా.. లోపించిన వ్యూహం.. పట్టించుకోని నాయకత్వం.. వెరసి స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లోనూ ఘోర పరాజయం పాలైంది. గెలిచే అవకాశమున్న నల్లగొం డ స్థానాన్ని కూడా చేజేతులా పోగొట్టుకుని మండలిలో సింగిల్ సీటుకే పరిమితమైంది. వరంగల్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్.. రంగారెడ్డిలో ఓ మోస్తరు ఓట్లు సాధించినా అభ్యర్థి ఎంపిక నుంచి పోలింగ్ వరకు పకడ్బందీ వ్యూహం లేకపోవడంతో ఓడిపోయింది.
ఓటమికి సవాలక్ష కారణాలు
గతంలో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ నుంచి పెద్ద సంఖ్య లో గెలిచారు. నల్లగొండ, రంగారెడ్డి స్థానాల పరిధిలో అయితే ఎమ్మెల్సీ సీటు గెలిచే స్థాయి కన్నా ఎక్కువ ఓట్లే ఆ పార్టీకి ఉన్నాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారిలో ఎక్కువ మంది టీఆర్‌ఎస్ గూటికి చేరారు. దీంతో వరంగల్‌తో పాటు ఆ రెండు స్థానాల్లో కూడా టీఆర్‌ఎస్‌కు మంచి సంఖ్య లో ఓటర్లు లభించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి భర్త రాజగోపాల్‌రెడ్డి 150 ఓట్లకు పైగా మెజార్టీతో ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచిన తేరా చిన్నపురెడ్డిపైనే విజయం సాధించారు. అప్పుడు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం సమష్టి కృషితో టీఆర్‌ఎస్‌ను ఖంగు తినిపించారు. ఈ ఎన్నికల్లో ఆ వ్యూహం ఎక్కడా కనిపించలేదు. ఓ వైపు అధికార పార్టీ ఓటర్లను పోగు చేసుకునే విషయంలో చాలా సీరియస్‌గా వ్యవహరిస్తే కాంగ్రెస్ మాత్రం క్యాంపు రాజకీయాలు నడపడంలో ఫెయిలైంది. గతంలో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారిని, సానుభూతిపరులను ఆకట్టుకునే విషయంలో కూడా స్థాని క, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోంది.
గెలుపు ముంగిట బొక్క బోర్లా
నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం విషయానికి వస్తే 2015 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఓటర్లు, అభ్యర్థులు పాతవారే అయినా ఫలితం మాత్రం తిరగబడింది. గత ఎన్నికల్లోనూ గెలిచామని, అప్పుడు ఓటేసిన వారంతా ఇంకా తమవైపే ఉన్నారని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ చతికిలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో రాజగోపాల్‌కి వచ్చిన మెజార్టీని అధిగమించి టీఆర్‌ఎస్ అభ్యర్థి మెజార్టీ సాధించారంటే గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌తో పోలిస్తే ఎంత క్రాస్ ఓటింగ్ జరిగిందో అర్థమవుతుంది. దీనికితోడు ఉత్తమ్, జానారెడ్డి లాంటి నేతలు ఈ సారి పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి ప్రతి ఓటరును కదిలించిన కాంగ్రెస్ నేతలు ఈసారి పట్టించుకోకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి ఒంటిచేత్తో ఎన్నికను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అందుకే ఓడిపోయారనే చర్చ జరుగుతోంది.
అతివిశ్వాసం.. వ్యూహలోపం!
Published Tue, Jun 4 2019 6:54 AM | Last Updated on Tue, Jun 4 2019 9:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment