సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. నల్లగొండ స్థానం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి, వరంగల్ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నుంచి ఉదయ్ మోహన్ రెడ్డి పేర్లను ఏఐసీసీ సోమవారం అధికారికంగా వెల్లడించింది.
కాగా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సాయంత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. వరంగల్ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి స్థానానికి పట్నం మహేందర్‌రెడ్డి, నల్లగొండ స్థానానికి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. 2015లో జరిగిన సాధారణ ఎన్నికలలో కొండా మురళీధర్‌రావు (వరంగల్), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొం డ), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో కొండా ముర ళీధర్‌రావు డిసెంబరులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడింటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment