సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు అన్యాయం చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, కె.పి.వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలిసి టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేయడంతో పాటు, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయహోదా రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేస్తున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజల అవసరాలను కేంద్రం గుర్తించడం లేదన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమానంగా చూడటంలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో ఇప్పుడున్న సీట్లు కూడా రావని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ పిల్ల చేష్టలను పార్లమెంటులో అవిశ్వాస చర్చ సందర్భంగా దేశమంతా గమనించిందని, కౌగిలింతలు, కన్నుగొట్టడాలేనా రాహుల్ చేయగలిగిందని తలసాని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి ప్రమాదమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీ వైపే మొగ్గుచూపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వాదనను దేశం ముందుకు తెచ్చారని తలసాని చెప్పారు. కాంగ్రెస్ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై రాజకీయాలు చేస్తున్నదన్నారు. దేశానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్ష పాటించడం లేదని చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు సీట్ల దందానే: శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ నష్టపోయినా పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు సీట్లదందాలో మునిగిపోయారని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. సమైక్యరాష్ట్రంలో లాభపడిన ఆంధ్రాకే మరోసారి ప్రత్యేకహోదా పేరిట లాభం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందా అని ప్రశ్నించారు.
తెలంగాణకు అన్యాయం జరిగేలా ఉన్నా పార్టీ నిర్ణయాలను ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ నేతలకు పదవుల ధ్యాస, సీట్ల దందా తప్ప ప్రజలపై ధ్యాసలేదని, ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కి వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లు కూడా రావని, వారు ఏం చేసినా తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే మళ్లీ అధికారం అని చెప్పారు.
కాంగ్రెస్ ఆంధ్రా పార్టీ: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కేవలం ఏపీ పార్టీ అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలసి తెలంగాణ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుత తెలంగాణకు వ్యతిరేకంగా అప్పటి సమైక్య రాష్ట్ర సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏనాడూ ప్రశ్నించలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఏపీ ప్రయోజనాలను తప్ప తెలంగాణను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు, నల్లగొండ జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు మెదిపిన పాపాన పోలేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా పక్షపాతి అని తేలిపోయిందన్నారు. రాహుల్‌గాంధీ ఒక ప్రాంతీయ పార్టీలో సాధారణ నాయకునిలా మాట్లాడారని, అలాంటి తెలివితక్కువ నాయకుడ్ని ఏనాడూ, ఎక్కడా చూడలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment