
సాధారణంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటర్లకు బహుమతులు ఇస్తుంటారు. తమకు ఓట్లు వేయడం కోసం చీరలు, నగల నుంచి కుక్కర్లు, టీవీలు, గ్రైండర్ల వరకు ఓటర్లకు ఎర వేస్తారు. అయితే, తమిళనాడులో ఈ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. ఓటర్లకే కాకుండా వారి చేత ఓట్లు వేయించే పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులకు కూడా బహుమానాలు ప్రకటిస్తున్నారు. తమకు ఎక్కువ ఓట్లు వేయించిన వారికి వాహనాలు, ఫ్రిడ్జ్‌లు, నగదు ఇస్తామని, విదేశీ, స్వదేశీ ప్రయాణాల ఖర్చు భరిస్తామని అభ్యర్థులు హామీలిస్తున్నారు. అరక్కోణం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ (డీఎంకే) ఈ కొత్త ట్రెండ్‌కు నాంది పలికారు. ఆయన నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
ఏ సెగ్మెంట్లో తనకు ఎక్కువ ఓట్లొస్తాయో ఆ సెగ్మెంట్ ఇన్‌చార్జికి కోటి రూపాయలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. పలు విద్యాసంస్థలు, ఒక స్టార్ హోటల్‌కు యజమాని అయిన జగద్రక్షకన్ తమిళనాడు అభ్యర్థుల్లోని నలుగురు కోటీశ్వరుల్లో ఒకరు. ఇక వెల్లూరులోని షణ్ముగం (అన్నాడీఎంకే) అయితే, నియోజకవర్గం ఇన్‌చార్జిలకు బుల్లెట్ మోటారుసైకిళ్లు, విదేశీ ట్రిప్‌ల ఆశ పెడుతున్నారు. ఇక్కడి మరో పోటీదారు కతీర్ ఆనంద్ (డీఎంకే) ఉత్తమ ప్రతిభ చూపిన కార్యకర్తలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తానని వాగ్దానం చేశారు. ఇలాంటి బహుమతుల వల్ల కార్యకర్తలు, కింది స్థాయి నేతలు మరింత ఉత్సాహంగా పని చేస్తారని కతీర్ ఆనంద్ తండ్రి, డీఎంకే కోశాధికారి దురై మురుగన్ అన్నారు. తామిచ్చే సొమ్మును పార్టీ కార్యాలయ నిర్మాణం వంటి పనులకు ఉపయోగించాలని ఆయన షరతు విధించారు. కాగా, ఈ భారీ నగదు నజరానాపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. వెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదుతో ఐటీ అధికారులు కతీర్ ఆనంద్ నివాసాల్లో సోదాలు జరిపారు. కతీర్ అఫిడవిట్‌లో తన చేతిలో రూ.9 లక్షల నగదు ఉందని తెలిపారు. అయితే ఐటీ దాడుల్లో రూ.19 లక్షలు దొరికాయి. ఈ అదనపు సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment