సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్ నమోదైంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్ తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 75.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్‌లో 44.75 శాతం మంది ఓటేశారు. పూర్తిగా పట్టణ ప్రాంత సెగ్మెంట్లైన మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్ నమోదైంది.
వేసవి ఎండల తీవ్రత వల్ల పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు బయటకు రాలేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 70.75 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల పోలింగ్ గణాంకాలతో పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8.06 శాతం మేర పోలింగ్ తగ్గడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో గడువు ముగియకముందే శాసనసభ రద్దు కావడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.07 శాతం ఓటింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment