Andhra Pradesh: ఏపీ ఓటర్లు 4.08 కోట్లు | Andhra Pradesh State voters are above 4 crore | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఏపీ ఓటర్లు 4.08 కోట్లు

Published Tue, Jan 23 2024 4:49 AM | Last Updated on Tue, Jan 23 2024 4:49 AM

Andhra Pradesh State voters are above 4 crore - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరుకుంది. వీరిలో పురుష ఓటర్లు 2,00,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452, థర్డ్‌ జెండర్‌ 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. 2024 ఓటర్ల తుది జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. గతేడాది అక్టోబర్‌ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసి అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు.

ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఉండేలా చర్యలు చేపట్టడంతో పోలింగ్‌ స్టేషన్లు మరో 214 పెరిగాయన్నారు. పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 46,165కి చేరింది. తాజాగా విడుదల చేసిన తుది జాబితాపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 23 నుంచి సీఈవో కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితాను https://­electoralsearch.­eci.gov.in/లో చూడొచ్చన్నారు. ఫారం 6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని చెప్పారు.

ముసాయిదాతో పోలిస్తే పెరుగుదల
అక్టోబర్‌లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక, తొలగింపుల తర్వాత 4.08 కోట్లకు చేరింది. సవరణ సందర్భంగా 22,38,952 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితా సమయంలో 18–19 ఏళ్ల ఓటర్ల సంఖ్య 2,88,155గా ఉంటే తుది జాబితా వచ్చే సరికి ఈ సంఖ్య 8,13,544కు చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు,  ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించడం ద్వారా 16,52,422 మంది ఓటర్లను తొలగించారు. 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


6.55 లక్షల మంది మహిళా ఓటర్లు అదనం
రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6,55,130 మంది అదనంగా ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 2,00,74,322 కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,036 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకాకుళం మినహా మిగిలిన 25 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 9,37,988 కాగా దానికంటే కొద్దిగా తక్కువగా 9,37,883 మంది మహిళా ఓటర్లున్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396 మంది ఓటర్లు ఉంటే అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,61,538 మంది ఓటర్లు ఉన్నారు.



పూర్తి పారదర్శకంగా జాబితా
జనవరి 2022 నుంచి తొలగించిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించి వంద శాతం ఆధారాలను సేకరించిన తరువాతే సవరణ చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ సమయంలో 21,18,940 ఓటర్లను తొలగించగా కేవలం 13,061 కేసుల్లో మాత్రమే నిబంధనలు పాటించలేదని, వాటిని నిబంధనలకు అనుగుణంగా సవరించామని పేర్కొంది. సున్నా ఇంటి నెంబర్‌పై 2,51,767 ఇళ్లు, ఒకే ఇంటి నెంబర్‌పై పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 1,57,939 ఇళ్లను గుర్తించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి సవరణ చేసినట్లు తెలిపింది.

జీరో నెంబర్‌ ఇంటి కేసులను 97 శాతం సవరణ చేయగా పది కంటే ఎక్కువ ఓట్లున్న ఇళ్ల సంఖ్యలో 98 శాతం పరిష్కరించినట్లు తెలిపింది. ఓట్ల తొలగింపు, డూప్లికేటు ఓట్లు, మరణాలు, చిరునామా మార్పు లాంటి వాటిపై రాజకీయ పార్టీల నుంచి 14,48,516 ఫిర్యాదులు రాగా అందులో 5,64,497 కేసులు అర్హత ఉన్నవిగా గుర్తించి వాటిని తొలగించినట్లు పేర్కొంది.  

కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరే పెద్ద మొత్తంలో ఓట్ల తొలగింపు, చేర్పులకు దరఖాస్తు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇలా బల్క్‌గా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలోని ఓట్లు వేరువేరు చోట్ల నమోదైన కేసులను గుర్తించి వాటిని సవరించామని, ఈ విధంగా విశాఖలో 26,000 ఓట్లను సవరణ చేయగా, ఎన్టీఆర్‌ జిల్లాలో 2,27,906 ఓటర్లను సవరించినట్లు తెలిపింది. నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో కూడా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.


వారికి ఇంటివద్దే ఓటు హక్కు
80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు, కోవిడ్‌ సోకిన వారు ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా, దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. ఇటీవలే పొరుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడు ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకునే ఓటర్ల విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడే నివాసం ఉంటున్నట్లు (ఆర్డినరీ రెసిడెన్స్‌) ధృవపత్రం ఇచ్చిన వారు మాత్రమే ఓటరుగా చేరడానికి అర్హులని, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పది రోజులు ముందు దాకా..
ఎన్నికల వరకు ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ చేపడుతూనే ఉంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా చెప్పారు. ఎన్నికల తేదీకి పది రోజుల ముందు వరకు అందిన వివరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో సందేహాలు, ఉంటే అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement