దేశంలో ఒక పక్క ఓటింగ్‌లో మహిళా చైతన్యం వెల్లువెత్తుతుండగా, మరో పక్క వారి ఓట్లు భారీగా గల్లంతవుతున్నాయి. ప్రముఖ సిఫాలజిస్ట్ ప్రణయ్‌రాయ్ తన తాజా పుస్తకం ‘వెర్డిక్ట్’లో ఈ విషయాన్ని బయటపెట్టారు. 1962లో మహిళా ఓటర్లలో 47 శాతం మందే ఓటేశారు. 2014కి వచ్చేసరికి వారి ఓటింగ్ శాతం 66కి పెరిగింది. 1962లో పురుషులకన్నా స్త్రీల ఓటింగ్ 15 శాతం తక్కువగా నమోదైంది. 2014 నాటికి ఈ వ్యత్యాసం 1.5 శాతానికి తగ్గింది. ఎన్నికలకు సంబంధించి మహిళల్లో చైతన్యం పెరిగిందనడానికి ఇదొక సంకేతం. అయితే మరోపక్క ఓటర్ల జాబితాలో నేడు 2.34 కోట్ల మంది స్త్రీలు అంతర్థానమయ్యారని ప్రణయ్‌రాయ్ అధ్యయనంలో తేలింది. జనాభా లెక్కలను, అందులో స్త్రీ పురుషుల ఓటర్ల శాతాన్ని పోల్చి ఆయన ఈ లెక్క తేల్చారు. దేశ పురుష జనాభాలో 97.2 శాతం ఓటర్లుగా నమోదయ్యారు. కానీ మహిళా ఓటర్ల విషయంలో ఇది 92.7 శాతమే. ఈ విధంగా 18 ఏళ్లు నిండిన 2.34 కోట్ల మంది స్త్రీలు తమ ఓటు హక్కు కోల్పోయారు. అంటే ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓట్లన్నమాట!
ఓటర్ల జాబితాల్లో మహిళలు మిస్ కావడం వెనుక సామాజిక, రాజకీయ కారణాలున్నాయని ప్రణయ్‌రాయ్ విశ్లేషించారు. ఉదాహరణకు అమెరికాలో లక్షలాదిమంది నల్లజాతి ఓటర్ల పేర్లు నమోదు కానీయకుండా చేస్తున్నారు. భారత్ వంటి సమాజాల్లో కేవలం స్త్రీలు కావడం వల్లే విద్య, వైద్యం, ఆహారం సహా రకరకాల సేవల విషయంలో వారి పట్ల వివక్ష కనబరుస్తున్నారు. దేశంలో జరిపిన పలు అధ్యయనాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. మహిళల పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయడంలోనూ ఈ విధమైన వివక్ష ఉంటున్నదని ప్రణయ్‌రాయ్ వివరిస్తున్నారు.
స్వాతంత్య్రానంతరం మహిళల ఓటింగ్ భారీగా పెరగడమనేది ‘జండర్’ అంశాలు రాజకీయ చర్చలో భాగమయ్యేందుకు దారితీసింది. పార్టీలు, నాయకులు స్త్రీల అభివృద్ధి కోణంపై దృష్టి పెట్టేందుకు దోహదపడింది. మహిళలు ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచించి ఓటేయడాన్ని, కుటుంబ ప్రభావం నుంచి కొంతమేరకు బయటపడటాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో అంతర్థానమయిన మహిళా ఓటర్ల పేర్లు నమో దు చేయించేందుకు ఈసీ తక్షణమే చర్యలు చేపట్టాల్సి వుంది.
ముస్లింలూ, దళితులూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు వేర్వేరు పరిశోధనలు పేర్కొన్నాయి. నిజానికి మన ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేస్తున్నది ఈ వర్గాలేనని, గత కొన్ని దశాబ్దాలుగా ముస్లిం, దళిత, మైనార్టీ, మహిళా ఓటర్ల ఓటింగ్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నదని ప్రొఫెసర్ జావేద్ ఆలం తన పరిశోధన గ్రంథం ‘హూ వాంట్స్ డెమోక్రసీ’లో వెల్లడించారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డిబేట్స్ ఇన్ డెవలప్‌మెంట్ పాలసీ వ్యవస్థాపకులు ఆబూసలే షరీఫ్ ప్రకారం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తది తర రాష్ట్రాల్లోని 50శాతం ముస్లిం కుటుంబాల్లో ఇంటికొక పేరన్నా ఓటర్ల జాబితా నుంచి మాయమైపోయింది.
ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం కుటుంబాల్లో సగటున నలుగురు సభ్యులుంటే ముగ్గురికే ఓటున్నట్టు బయటపడింది.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40–50 ముస్లిం కుటుంబాలపై జరిపిన పరిశీలనలో ఇంటికొక్క ఓటు మాత్రమే నమోదైనట్లు తేలింది. జనగణన లెక్కల ప్రకారం కర్ణాటకలో దాదాపు 60 లక్షల ఓట్లు నమోదు కాలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ విధంగా దేశంలో 3 కోట్ల ముస్లింలు, నాలుగు కోట్ల మంది దళితుల ఓట్లు మిస్ అయినట్టు సాఫ్ట్‌వేర్ నిపుణులు ఖలీద్ సైఫుల్లా చెబుతున్నారు. స్పెల్లింగ్ తప్పులు, ఉర్దూలో వయసు నమోదు, వివక్ష వంటివి ఇందుకు కారణాలుగా కనబడుతున్నాయని ఆయన అన్నారు. మన సమాజంలో మహిళలు, దళిత బహుజనులే అత్యధిక వివక్ష ఎదుర్కొంటున్నారనే సత్యం చివరికి ఓటర్ల జాబితాల్లో సైతం బయటపడింది.
- బి.భాస్కర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, 9989692001
Comments
Please login to add a commentAdd a comment