ఓటర్లు లంచం తీసుకుంటే నేరమేనా? | Madabhushi Sridhar Article On Voters Corruption | Sakshi
Sakshi News home page

ఓటర్లు లంచం తీసుకుంటే నేరమేనా?

Published Fri, Jan 24 2020 12:15 AM | Last Updated on Fri, Jan 24 2020 12:15 AM

Madabhushi Sridhar Article On Voters Corruption - Sakshi

న్యాయవేత్త, సుప్రీం కోర్టు న్యాయవాది, పద్మవిభూషణ్‌ స్వర్గీయ పీపీ రావుగారు ఒకసారి ఢిల్లీనుంచి ఏపీలో  వారి సొంత గ్రామానికి వెళ్లారట. అక్కడ ఎన్నికల ప్రచారం హోరుగా జరుగుతుంటే చూశారు. గ్రామ ప్రెసిడెంట్‌ కోసం ఇంత తీవ్రమైన ప్రచారమా? అని ఆశ్చర్యపోయారు. ఆ మరునాడు ఆయన ఉన్న అతిధి గృహానికి ఒక నాయకుడు పీపీ రావుగారి ఆశీస్సులకోసం వచ్చారు. ఎవరని అడిగారు. ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నాయకుడని చెప్పారు. నిన్న పోటాపోటీగా ప్రచారం చేసారు. అంతలో ఏమైంది? అని రావుగారు మరోసారి ఆశ్చర్యపోయారు. ‘పోటీ కొనసాగితే ప్రచారం కోసం ఓట్లకోసం ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది సార్‌.. దానికన్నా ప్రత్యర్థికి కావలిసింది ఇచ్చి ప్రశాంతంగా గెలవడం కరెక్టనిపించిందండీ. నాకేమో ఈ ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి. కనుక... ఆయనతో రాజీ పడ్డానండీ.’ అన్నాడు. ఆ పక్కనే నిన్నటిదాకా తీవ్రంగా పోటీపడిన ప్రత్యర్థి కూడా ఉన్నారు. ‘అవును సార్‌ ఈ సారి గెలవడానికి ఆయనకు సాయం చేయడమే కరెక్టని నాకని పించిందండి. నేను మరోసారి పోటీ చేసినప్పడు నాకు సాయం చేస్తానన్నారు’ అని వివరించాడు. అంటే దాని అర్థం తెలిసిపోయి ఉంటుంది. 

ప్రత్యర్థిని కొనుక్కొని ఎన్నికల పోటీనుంచి విరమింపచేయడం ప్రజాస్వామిక వ్యూహం. డబ్బు, పదవి, ప్రలోభాలు కూడా లంచాలే అని మనమంతా అనుకుంటాం. కాని ఇవేవీ కోర్టులో రుజువు కావడం కష్టం. ఒకవేళ రుజువులున్నా అయిదేళ్లలో ఎన్నిక రద్దు కావడం సాధ్యం కాదు. కిందికోర్టు పైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చేలోగా రెండు సార్లు ఈయనగారు ఎన్నికయ్యే సదుపాయాలు చాలా ఉన్నాయి. ఈ కష్టాలన్నీ పడే బదులు డబ్బు తీసుకుని పోటీనుంచి విరమిం చడం ప్రత్యర్థి వ్యూహమైతే కావలసినంత డబ్బు ఇచ్చి పోటీ లేకుండా గెలవడం, లేదా పోటీలో ఓట్లు కొనేయడం సరైన పద్ధతి అని నాయకులు అనుకుంటున్నారు. దాన్నే చాణక్యమని మీడియా అంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ, చివరకు మునిసిపాలిటీ ఎన్నికల్లోనైనా సరే లంచాలు ఇవ్వడానికి తీసుకోవడానికి భయం లేదు. ఎవరికిస్తారు ఈ లంచాలు? ముందు పార్టీలో టిక్కెట్లు ఇచ్చే అధికారం, ఫ్రభావం కలిగిన వారికి ఇస్తారు. టిక్కెట్‌ సంపాదిస్తారు. తరువాత గెలవడానికి రెండు ప్రతిబంధకాలు. బలీయమైన ప్రత్యర్థి, ఓట్లు ఇప్పించగల సంఘాలు, వ్యక్తులు. వీరికి కూడా లంచాలు ఇస్తారు. అధికారంలో ఉన్నవాళ్లు పదవులు ఇప్పిస్తామని ప్రలోభపెట్టడం లంచం ఇవ్వడంకన్నా తీవ్రమైనది. ఎన్నికలు, ప్రత్యర్థిని కొనడం, లేదా ఓటర్లకు లంచాలు ఇవ్వ డంకన్నా విధానమండలి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎంపీ స్థానం సంపాదించడానికి అధికారంలోఉన్న పార్టీకి ఒకేసారి భారీ ఎత్తున డబ్బు ఇచ్చేస్తే మరీ సులువు. ఇది ఇంకా గొప్ప వ్యూహం. ఇట్లా టికెట్టిచ్చి గెలిపించుకోవడంకన్నా గెలిచిన అభ్యర్థిని కొనుక్కోవడం ఇంకా సులువు. 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి. నాగిరెడ్డి ఒక విషయం విలేకరుల సమావేశంలో చెప్పారు. అదేమంటే ఓటర్లు రాజకీయ పార్టీలనుంచి పోటీచేసే వారినుంచి లంచాలు తీసుకుంటే అది చట్టం గుర్తించగల నేరం కాదు అని. కానీ  ఒక అభ్యర్థి లేదా ఆయన ఏజెంట్లు డబ్బు పంచుతుంటే అది నేరమేనా? అవును నేరమే. అయితే వెంటనే కేసు పెట్టవచ్చా. అంటే ఎవరు కేసు పెడతారు? డబ్బు తీసుకున్న ఓటరా, ఇచ్చిన లీడరా? పెట్టరు. తమకు తామే నష్టం చేసుకుంటారా? పోనీ ప్రత్యర్థి తరఫువారు కేసు పెడతారా? వారు కూడా అదే పనిలో చాలా బిజీగా ఉంటారు కదా. తమ గెలుపుకోసం నోట్లకు ఓట్లు పంచాలా లేక, ప్రత్యర్థిమీద కేసులు పెడుతూ కూర్చోవాలా? కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు. ఫిర్యాదు చేయకపోయినా నేరం జరుగుతూ ఉంటే పోలీసులు, ఎన్నికల కమిషన్‌ ఏమీ చేయదా అని సామాన్యుడి ప్రశ్న. దాన్ని కాగ్నిజబుల్‌ నేరం అని ప్రకటిస్తూ చట్టం సవరించకపోతే అది సాధ్యం కాదు. ఆ విషయం ఎన్నికల కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పింది. బీజేపీ సర్కారుకు కూడా చెప్పింది. కాంగ్రెసయినా బీజేపీ అయినా గెలిచే వ్యూహరచయితలు చాణక్యులే కనుక వారు ఆ సవరణ చేయలేదు. అందరూ దొంగలే కదా.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement