
సూర్యాపేట: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి మాదిగలకు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్‌చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 24 ఏళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా వర్గీకరణ జరగడం లేదని వాపోయారు.
ముందుగా హామీలు ఇస్తున్న పార్టీలు అధికారంలోకి వచ్చాక మాదిగల డిమాండ్‌పై చిన్నచూపు చూస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వర్గీకరణపై దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణతోనే ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని, ఈ విషయమై అన్ని పార్టీల మద్దతు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ ఉద్యమంపై అణచివేతకు పాల్పడుతోందని, మాదిగల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని ఆరోపించారు.