స్థానిక.. ‘సమరమే’! | Telangana ZPTC And MPTC Elections | Sakshi
Sakshi News home page

స్థానిక.. ‘సమరమే’!

Published Wed, Apr 17 2019 10:36 AM | Last Updated on Wed, Apr 17 2019 10:36 AM

Telangana ZPTC And MPTC Elections - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ నాలుగైదు రోజుల్లో వెలవడనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌లో ‘స్థానిక’ కోలాహలం కనిపిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా పరిషత్‌ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవాలని ఆయా నేతలకు దిశానిర్దేశం చేసి బాధ్యతలు  కూడా అప్పజెప్పారు.

ఈ నెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందని, వచ్చే నెల (మే) రెండో వారంలోగా ఎన్నికలు పూర్తవుతాయని చెబుతున్నారు. సమయం కూడా తక్కువగానే ఉండడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సారి నల్లగొండ జిల్లా పరిషత్‌ జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ కావడంతో పోటీ ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాలకు గాను 31మంది జెడ్పీటీసీ సభ్యులు, వారిలో నుంచి ఒక జెడ్పీ చైర్మన్, ఒక వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అవుతారు. అదే మాదిరిగా, 31 మంది మండల పరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీ) అదే సంఖ్యలో ఉపాధ్యక్ష పదవులు కూడా ఉంటాయి. ఇక, జిల్లావ్యాప్తంగా 349 ఎంపీటీసీ సభ్యులకు ఎన్నిక జరగాల్సి ఉంది. పార్టీ ఎన్నికల గుర్తుతో జరిగే ఎన్నికలు కావడం, పెద్ద సంఖ్యలో పోస్టులు అందుబాటులో ఉండంతో అధికార పార్టీలో ఆశావహులంతా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు.

జెడ్పీ చైర్మన్‌ పీఠంపై గురి!
గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లా పరిషత్‌ ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యింది. ఈ సారి జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. దీంతో జెడ్పీ చైర్మన్‌ పీఠంపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న మండలం నుంచి ముందు జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనరల్‌ సీట్‌ కావడంతో సహజంగానే బీసీ, ఇతర వర్గాలకు చెందిన వారిని కాకుండా, ఓసీలకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయా ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులుగా ఉన్న నాయకులు జెడ్పీ పీఠంపై గురిపెట్టారు.

జెడ్పీటీసీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పజెప్పడంతో పలువురు నాయకులు వారి వెంటపడుతున్నారని చెబుతున్నారు. తమకే అ వకాశం వస్తుందని ఎవరికి వారు చెబుతున్నా.. పార్టీ నాయకత్వంనుంచి అందుతున్న సమాచారం మేరకు పార్టీకి, నాయకత్వానికి మొదటినుంచి ‘వి«ధేయులు’గా ఉన్న వారికే అవకాశం ఉంటుందని సమాచారం. అంతే కా కుండా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అవకాశం దక్కాలంటే ముందుగా జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, ఎం పీ, ఇతర సీనియర్‌ నాయకుల మద్దతు కూడా అవసరమని చెబుతున్నారు.

ఇది, ముం దునుంచీ పార్టీలో ఉన్న వారికి, పార్టీ ఆవి ర్భావం నుంచి కొనసాగుతున్న వారికే సాధ్యమని పేర్కొంటున్నారు. అధినేత కేసీఆర్‌ ఇప్పటికే జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరనే అంశంలో ఒక నిర్ణయానికి వచ్చారని, కొందరు నాయకులకు సూచాయగా సమాచారం ఇచ్చారని అంటున్నారు. మరోవైపు పలువురు నాయకులు ఎం పీపీ పోస్టులపైనా ఆశలు పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే అవకాశం కల్పిం చా లని అప్పుడే నాయకుల వద్ద క్యూ కడుతున్నారు.

మ్మెల్యేలకు తలనొప్పిగా ఎంపిక బాధ్యత
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పజెప్పడం వారికి తలనొప్పిగా మారనుందని అంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మొదటినుంచి పార్టీలో ఉన్న వారు, ఆ తర్వాత వివిధ పార్టీలనుంచి వచ్చిచేరిన వారు అది కూడా కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలనుంచి వచ్చిన వారు... ఇలా, మూడు నాలుగు కేటగిరీలుగా నాయకులు ఉన్నారు. వీరందరినీ సమన్వయ పరిచి, ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టమేనన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

మిర్యాలగూడలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న భాస్కర్‌ రావు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయన పార్టీ మారిన సందర్భంలో ఆయన అనుచరులంతా కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌కు వచ్చారు. ఇప్పుడు తమ నాయకుడే మళ్లీ టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే కావడంతో సహజం గానే ఆయన వర్గానికి ప్రాధాన్యం లభి స్తోంది. మొదటినుంచీ పార్టీలో ఉన్న వారికి ఇది జీర్ణం కావడం లేదు. ఇదే పరిస్థితి దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో కూడా ఉంది. సీపీఐనుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో పాత టీఆర్‌ఎస్‌ నాయకత్వం కలిసిపోలేదంటున్నారు.

నల్లగొండలో టీడీపీనుంచి టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయిన కంచర్ల భూపాల్‌ రెడ్డితో పాటు పార్టీ మారిన టీడీపీ శ్రేణులు, మొదటినుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న శ్రేణులకు పెద్దగా పొసగడం లేదు. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గం వేరుగా ఉండగా, ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యే చిరుమర్తి వర్గం వేరుగా ఉంది. వీరి మధ్య కూడా పెద్దగా సయోధ్య లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎమ్మెల్యేలు ఎంపిక చేయడం ఒకింత సమస్యాత్మకంగా మారనుందని విశ్లేషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement