హస్తిన చేరిన హోదా పోరు | Today is YSRCP Mahadarna in Delhi | Sakshi
Sakshi News home page

హస్తిన చేరిన హోదా పోరు

Published Mon, Mar 5 2018 1:06 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Today is YSRCP Mahadarna in Delhi - Sakshi

ఢిల్లీ చేరుకున్న అనంతరం సఫ్దర్‌జంగ్‌ వద్ద హోదా కోసం నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి, న్యూఢిల్లీ: ఐదుకోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేక హోదాను సాధించడం కోసం జరుగుతున్న పోరాటం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంది. ‘‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’’ అన్న నినాదంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆవేదనను యావత్‌ భారతావనికి వినిపించేందుకు సమాయత్తమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.  నేడు ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులతో పాటు శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతుండడంతో ముఖ్యనే తలంతా ముందే చేరుకుని ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మహా ధర్నా కోసం హాజరయ్యే వారి కోసం శుక్రవారం విజయవాడ నుంచి ఢిల్లీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఆదివారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంది. వేలాదిగా తరలివచ్చిన వారికి భోజనంతో పాటు వసతి ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి, హైదరాబాద్, బెంగు ళూరుల నుంచి రైళ్లు, విమానాల ద్వారా పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించిన చంద్రబాబు సర్కార్‌ ఢిల్లీలోనూ తన నైజాన్ని బయటపెట్టుకుంది. ఏపీభవన్‌లో హోదా ఉద్యమకారులు మీడియాతో మాట్లాడనీ యకుండా ఆంక్షలు విధించింది. పోలీసులను పంపి అడ్డుకునే ప్రయత్నంచేయడంతో అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆకాంక్షను సజీవంగా ఉంచిన పోరాటం..
ప్రత్యేక హోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పోరాటాలు, ధర్నాలు, బంద్‌లు, ఊరూరా యువభేరీలు భారీ ఎత్తున నిర్వహించారు. అందువల్లనే ప్రత్యేకహోదా అన్న భావన ఇప్పటికీ సజీవంగా ఉంది. ఓటుకు కోట్లు కేసు భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది. అందుకే వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో తలపెట్టిన మహా ధర్నాకు రాజకీయాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. ఈ నెల 20వ తేదీ వరకు పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేయనున్నారు. అప్పటికీ స్పందన లేకపోతే ఈనెల 21న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. ఆఖరి అస్త్రంగా ఏప్రిల్‌ 6వ తేదీన వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు.

ఉద్యమాన్ని అణగదొక్కేందుకు బాబు సర్కార్‌ కుట్రలు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో దానిని అణగదొక్కే రాష్ట్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్సార్‌ సీపీ నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు ఢిల్లీకి చేరుకుంటుండడంతో ఇక్కడి ఏపీ భవన్‌లో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని, మీడియా ప్రతినిధులు ఎవరి ఇంటర్వ్యూలూ తీసుకోరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా లేని ఆంక్షలు ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల సమావేశాన్ని కవర్‌ చేస్తున్న సాక్షి టీవీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదాపై అనకాపల్లి పార్లమెంటు జిల్లా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గురివాడ అమర్‌నాథ్‌  మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకొని ఏపీ భవన్‌లో ఎలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, ఆ ఆవరణ నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు చూపాలని మీడియా ప్రశ్నించగా.. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడాలని పోలీసులు సమాధానం ఇచ్చారు.

ప్రత్యేక హోదాయే పరిష్కారం..
రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోయిన ఏపీ ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’ నినాదంతో తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిŠ, రాజన్న దొర, కళావతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని, హోదాతోనే రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. విభజన వేళ పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఏపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేస్తే.. తాము పదేళ్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. తిరుపతిలో ప్రధాని మోదీ స్వయంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గత నాలుగేళ్లు పోరాటం చేస్తుంటే.. హోదాపై అనేక సార్లు మాటమారుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 

హోదా వస్తుందనే నమ్మకం కలుగుతోంది
మా పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ప్రత్యేక హోదా లభిస్తుందనే నమ్మకం కలుగుతోంది. అసలు ఇంత కాలం రాష్ట్రానికి హోదా రాకపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. కేంద్రంపై ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ ఆయన ఒత్తిడి తేలేక పోవడం ఒక తప్పిదం అయితే హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ అని మభ్యపెట్టి అంగీకరించడం మరో తప్పిదం. మా పోరాటానికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశ ఉంది. ఏపీ ప్రజల్లో హోదా కావాలన్న భావన రోజు రోజుకూ పెరుగుతోంది. విభజన వల్ల నష్టపోయిన పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. హోదా కావాలన్న ఆకాంక్షను జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకే ధర్నా చేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. 
– వి. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు

కేంద్రంతో ‘బాబు’ లాలూచీ ఎందుకో..?
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న పార్టీలతో సీఎం చంద్రబాబు కలిసి రాకుండా కేంద్రంతో ఎందుకు లాలూచీ పడుతున్నారో అర్ధం కావడం లేదు. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లయినా అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. మెరుగైన వైద్యం కావాలన్నా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేస్తుంటే చంద్రబాబు మాత్రం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా రోజుకో మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. హోదా కోసం మొదట్నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వివిధ రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. 
– మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత

చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి..
హోదా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేస్తుంటే చంద్రబాబు అవహేళన చేస్తూ హోదాతో ఏమి వస్తుందంటూ ఇన్నాళ్లూ ప్రశ్నించారు. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడేమో హోదా ఇవ్వాల్సిందేనంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. రూ. 1.54 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి చెబితే బాబు అప్పుడు మాట్లాడకుండా కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే బాగుందంటూ కేంద్రంపై ప్రశంసలు కురిపించి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పి తీరాల్సిందే.
–ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన మండలిలో ప్రతిపక్షనేత

ఉద్ధరిస్తామన్న టీడీపీ ఏం ఒరగపెట్టింది!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ చేస్తున్న పోరాటంలో భాగంగా పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంపై ఇతర పార్టీలతోనూ చర్చించి అందులో భాగమవుతామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ, రాష్ట్ర విభజన నాడు సభలో వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారన్నారు. బీజేపీ ఇచ్చిన హామీకి ఇప్పుడు అతీగతీ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తాం కాబట్టి ఏపీని ఉద్ధరిస్తామని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడేం సాధించారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ అమలు చేయాలని ముందు నుంచి తాము చేస్తున్న డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement