కాగిత.. కాసుల మేత... | Untold Story Of Pedana MLA Kagitha Venkata Rao | Sakshi
Sakshi News home page

కాగిత.. కాసుల మేత...

Published Sat, Mar 9 2019 4:03 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Untold Story Of Pedana MLA Kagitha Venkata Rao - Sakshi

సాక్షి, స్పెషల్‌ ఫోకస్‌(కృష్ణా): వివాద రహితుడు.. ధనం ఆశించని వ్యక్తి.. అందరికీ అందుబాటులో ఉంటారని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు పేరు. ఇవి నాణ్యానికి ఒకవైపే.. మరో వైపు అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి ఆనవాళ్లు. అధికారంతో ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు.  పీఏ, తనయుడు బినామీలుగా మొత్తం అవినీతి కథ నడిపిస్తున్నారు. కాంట్రాక్టుల నుంచి అంగన్‌వాడీ ఉద్యోగాల వరకు పది శాతం కమీషన్‌ ముట్ట చెప్పందే ఫైల్‌ ముందుకు కదలని పరిస్థితి. ఆయనే పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు. మీడియం డ్రెయిన్‌ పనుల్లో అడుగడుగునా అవినీతికి పాల్పడి రూ.కోట్లు కొల్లగొట్టారు. ఐదేళ్లలో రూ.కోట్లు దోచేశారు.

అవి‘నీటి’ పారుదల!

కృత్తివెన్ను వద్ద నాసికరంగా చేపట్టిన కరకట్ట పనులు   

గ్రామీణ నీటి పారుదల శాఖ(ఆర్‌డబ్లూఎస్‌) ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేసవిలో తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటారు. అయితే నీరు సరఫరా చేయకపోయినా చేసినట్లు చూపించారు. ఏడాదికి రూ.2 కోట్ల వరకు స్వాహా చేస్తున్నారు. అంటే ఐదేళ్లలో దాదాపు రూ.10 కోట్ల వరకు మింగినట్లు ఆరోపణలున్నాయి.

ఏ పనైనా కప్పం కట్టాల్సిందే..

నియోజకవర్గంలో నిర్వహించే ఏ అభివృద్ధి పనులకైనా కప్పం కట్టాల్సిందే.  మొత్తం తనయుడు కాగిత కృష్ణప్రసాద్‌ దగ్గరుండి తీసుకుంటాడు. పనిని బట్టి 7 నుంచి 10 శాతం వరకు కమీషన్‌ వసూలు చేస్తుంటారు. మామూళ్లు అందనిదే పని ముందుకు కదలదు.

♦ గత ఐదేళ్లుగా పెడన నియోజవర్గంలో నిర్వహించిన సిమెంట్‌ రోడ్ల పనుల్లో భారీగా కమీషన్‌ దండుకున్నారు. ఐదేళ్లుగా 5,441 కిలో మీటర్ల మేర సిమెంట్‌ రోడ్డు నిర్మించగా.. రూ.2.72 కోట్లు వెచ్చించారు. అందులో 10 శాతం కమీషన్‌ అంటే రూ.27 లక్షల వరకు దండుకున్నారు. బంటుమిల్లి మండలంలో రూ.72.70 లక్షలతో పనులు జరుగుతున్నాయి. అందులో పది శాతం కమీషన్‌ రూ.7 లక్షల వరకు కమీషన్‌ దండుకున్నారు.

♦ కృత్తివెన్ను మండలంలో రూ.70 కోట్లతో చేపట్టిన కరకట్ట పనులను సబ్‌ కాంట్రాక్ట్‌కు తీసుకున్నారు. పనులు నాసిరకంగా చేపట్టి రూ.కోట్లు దండుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అధికారులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.

రూ.కోట్లు విలువ చేసే భూములు కొనుగోలు

అవినీతి సొమ్ముతో పెడన మండలం దిరిశెవల్లి గ్రామంలో కొనుగోలు చేసిన భూముల్లో చెరువులు తవ్విన దృశ్యం   

అవినీతి సొమ్ముతో పెడన మండలం దిరిశెవల్లి సమీపం 70 ఎకరాలు ఎమ్మెల్యే కొనుగోలు చేశాడు.  ప్రస్తుతం ఎకరం అక్కడ రూ.25 లక్షలు పలుకుతోంది. ప్రస్తుతం మూలమర్రికుంట, ముచ్చులగుంట మధ్యలో మరో 75 ఎకరాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అంటే మరో రూ.18 కోట్లు విలువ చేసే పొలం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఏ మేరకు పోగేశారో అర్థం అవుతోంది. ఈ భూములు మొత్తం పడమట నాగేంద్రను బినామీగా పెట్టి కథ నడుపుతున్నారు.

♦ పట్టణంలోని రూ.90 లక్షలు పెట్టి ఓ భవనం కొనుగోలు చేశారు.

♦ పట్టణంలోని ప్రధాన దారిలో ఉన్న స్థలాన్ని మండలంలో టీడీపీ నాయకుడు చల్లపాటి లక్ష్మీపతిరావు ఆక్రమించాడు. ఎమ్మెల్యే కాగితే వెంకట్రావుకు అమ్మేందుకు సిద్ధం అవుతున్నారు. సుమారు రూ.10 కోట్ల విలువ. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.

♦ జింజేరు వద్ద 43 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎకరం రూ.15 లక్షలు పలుకుతోంది అంటే రూ.6.40 కోట్లు విలువ చేసే స్థలం కొనుగోలు చేశారు. 

♦ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో తనఖా పెట్టిన భూములను బినామీ పేర్లతో గుట్టుచప్పుడు కాకుండా వేలం పాట నిర్వహించి తక్కువ ధరకు భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.కోట్లు విలువ చేసే భూములు ఇలా హస్తగతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.

మా స్థలాన్ని ఆక్రమించారు

మేం హైదరాబాద్‌లో నివాసముంటున్నాం. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి మా పది ఎకరాల భూమిని చూసుకుని వెళ్లే వాళ్లం. ఏడాది క్రితం వచ్చి చూస్తే మా పొలాన్ని ఎమ్మెల్యే కాగిత వర్గీయులు చెరువుగా మార్చేశారు. ఇదేమని ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ‘మేం కొన్నాం.. ఏ మైనా ఉంటే కోర్టులో చూసుకోండి’. అన్నారు. మేం పొలం ఎవరికీ అమ్మలేదు. అలాంటిది వారెప్పుడు కొన్నారో అర్థం కావడం లేదు. ఈ విషయమై పోలీసులకు  ఫిర్యాదు చేశాం. గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు.
–భాను కిరణ్, బాధితులు

అధికారం అండతో భూ కబ్జా!

 తాళ్లూరు శ్యామలమ్మ పేరు మీదే ఉన్న పది ఎకరాల భూమి 

అధికారం అండగా అధికార పక్షం బరితెగిస్తోంది. భూ కబ్జాలకు తెగబడుతోంది. గ్రామాల్లోని లేని వారి భూములు టార్గెట్‌ పెట్టుకుంది. భూ యజమానులకు తెలియకుండానే సదరు భూమి విక్రయించినట్లు ఎమ్మెల్యే, బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించేస్తున్నారు. అనంతరం ఆ భూమిని చెరువులుగా మార్చేసి లీజుకిచ్చేస్తున్నారు. 
కృత్తివెన్ను మండలం ఇంతేరులో.. దినవయి భానుమూర్తి కుమార్తె తాళ్లూరు శ్యామలాంబకు పసుపు కుంకుమ నిమిత్తం సర్వే నంబర్‌ 23/1బీలో పది ఎకరాల పొలం 1955లో ఇచ్చారు. శ్యామలాంబ, తన కుమారుడు సాయికిరణ్‌ గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇదే సర్వే నంబరులో మరో 7.86 ఎకరాల స్థలాన్ని దినవయి భానుమూర్తి వారి కుమారులు నాగేశ్వరరావు, దినవర్తి శంకరానంద్‌కు రాశారు. వీళ్లు కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

కబ్జా ఇలా..

ఇదే అదునుగా భావించిన ఎమ్మెల్యే బినామీలను రంగంలోకి దింపారు. ఈ పొలాలను  2014లో బినామీలు బడుగు సుబ్రమణ్యేశ్వరరావు, బడుగు వెంకటేశ్వరరావు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీనికి ఎమ్మెల్యే పీఏ గుర్తి వెంకటరమణ, మరో వ్యక్తి కేవీవీ సత్యనారాయణను సాక్షి సంతకాలు చేశారు. పొలం యజమానులు గ్రామంలో లేకపోయినా ఉన్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రం సృష్టించారు. ఇలా రూ.2.70 కోట్ల విలువైన స్థలాన్ని కాజేశారు. ప్రస్తుతం వాటిని చెరువులుగా మార్చి లీజుకు ఇచ్చేశారు. ఇదిలా ఉంటే 2016 వరకు అడంగల్‌లో పొలం అసలైన యజమానుల పేరుమీదే ఉంది. దీన్ని బట్టి చూస్తే 2014లో ఎమ్మెల్యే బినామీల పేరుతో రిజిస్ట్రేషన్‌ ఎలా అయిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయన్నా భూ యజమానులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే.. మేం కొన్నాం.. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండని తెగేసి చెప్పడాన్ని బట్టి చూస్తే అధికార దర్పం ఎలా ప్రదర్శిస్తున్నారో అర్థం అవుతోంది.

నేతలదీ అదే తీరు..

కృత్తివెన్ను వద్ద నాసికరంగా  కరకట్ట పనులు 

♦ కమలాపురం 20వ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఖాతాలో నిధులు టీడీపీ నాయకులు గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. వాస్తవంగా ఈ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జాయింట్‌ ఖాతా ద్వారా లావాదేవీలు జరపాల్సి ఉండగా.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని కాదని సొంత ఖాతా తెరిచి నిధులు స్వాహా చేశారు. ఈ పనులకు ప్రభుత్వం రూ.58.95 లక్షలు విడతల వారీగా విడుదలయ్యాయి. వీటిల్లో నుంచి రూ.58.89 లక్షలను డ్రా చేసేశారు. వాస్తవంగా ఈ నిధులు అధ్యక్ష, ఉపాధ్యక్షులకు చెందిన సంయుక్త ఖాతాలో పడాల్సిన సొమ్ము కాస్తా ఏకపక్షంగా అధ్యక్షుడు ప్రైవేటు కమిటీ పేరుతో మరొక బ్యాంకు ఖాతాలో వేసుకుని స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. డ్రెయిన్‌ మరమ్మతులకు ఎంత అంచనాలు రూపొందించారో.. అంత కాకుండా అదనంగా చెల్లింపులు చేశారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 
♦ పట్టణంలో అనధికార లేఅవుట్లు రూపొందించి టీడీపీ నాయకుడు బొడ్డు వేణుగోపాల్‌ రావ్‌ విక్రయించడంలో కీలక పాత్ర పోషించారు. తనకు చెందిన ఆర్‌ఎస్‌ నంబరు 353లో 1.47 ఎకరాలుండగా దీని పక్కనే పురపాలక సంఘానికి చెందిన ఆర్‌ఎస్‌ నంబరు 366/1బి లోని పోరంబోకు చెరువుకు సంబంధించిన 18 సెంట్లు స్థలాన్ని 353 ఆర్‌ఎస్‌లో కలిపేసుకున్నారు. అందుకు అప్పటి రెవెన్యూ శాఖతో పాటు రిజిస్ట్రేషన్‌ శాఖ కూడా సహకరించినట్లు విజిలెన్సు నివేదికలు బయటపెట్టాయి. ఈ వ్యవహారం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.

పెడన పట్టణంలో హస్తగతం చేసుకునేందుకు చూస్తున్న కోట్ల విలువైన భూమి ఇదే

బరుల్లో రూ.కోటి వసూలు..

సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. బంటుమిల్లి  మండలం చెందూరు భారీ బరి ఏర్పాటు చేశారు. అటువైపు పోలీసులు వెళ్లకుండా అధికారాన్ని వినియోగించుకున్నారు. అందుకు గాను రూ.కోటి వరకు కలెక్షన్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీల్లో అక్రమాలే...

అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలకు ఆజ్యం పోశారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా ఐదేళ్లుగా దాదాపు 27 అంగన్‌వాడీ పోస్టులు భర్తీ చేశారు. వీరి నుంచి ఒక్కో పోస్టుకు రూ.2 నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా రూ.54 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ అక్రమ వ్యవహారం ఎమ్మెల్యే పీఏ దగ్గరుండి నడిపించినట్లు ఆరోపణలున్నాయి.

నీరు– చెట్టులో తినేశారు..

నియోజవర్గంలో నీరు– చెట్టు నిధులు స్వాహా చేశారు. ప్రస్తుతం బంటుమిల్లి మండలంలో రూ.16 లక్షల ఆర్‌డబ్ల్యూఎస్‌ నిధులతో తాగునీటి చెరువు తవ్వకం పనులు చేపట్టారు. వారం రోజులుగా ఈ పనులు చేస్తున్నారు. సాధారణంగా చెరువు తవ్విన మట్టి ప్రభుత్వ పనులకు వినియోగించాల్సి ఉన్నా.. ఎన్‌హెచ్‌ రోడ్డు
పనులకు తరలిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 200 ట్రాక్టర్ల మట్టిని విక్రయిస్తున్నారు. ట్రాక్టరు రూ.1000 చొప్పున ఇస్తున్నారు. ఇప్పటికే రూ.12 లక్షలు స్వాహా చేశారు. ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. 
♦ ఆఖరికి రైతు బజార్‌లో షాపుల కేటాంపునకు ఒక షాపునకు రూ.25,000 నుంచి రూ.50,000లకు బేరం పెట్టారు.

పూడిక తీతలో అవినీతి మేట..

బంటుమిల్లి మండలంలో నీరు– చెట్టు పథకం కింద తవ్వుతున్న చెరువు 

కాలువల్లో పూడిక తీత పనుల్లో భారీగా బోక్కేశారు. నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా చేపట్టిన పనుల్లో ఏటా రూ.2 కోట్ల చొప్పున రూ.10 కోట్ల వరకు స్వాహా చేసినట్లు సమాచారం. పనులు తూతూ మంత్రంగా చేపట్టి నిధులు కాజేశారు. ఇసుకపర్రు, చేవేండ్ర, కొంగన్‌చెర్ల, కొమ్మంబ, ముక్కొల్లు, వడ్ల మన్నాడు, పెనుమల్లి, నందమూరు డ్రెయిన్ల వద్ద పూడిక తీత, జమ్ము, గుర్రపుడెక్క తొలగించినట్లు చూపి బిల్లులు స్వాహా చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement