![Venkateswara Maha Swamy Contest On Top Leaders Income Just Nine Rupees - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/1/sholapur.jpg.webp?itok=YjRbfR68)
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల ఖర్చు. డబ్బును నీళ్లప్రాయంగా వెచ్చించగలిగిన వారే.. ఈ రాజకీయ క్రీడలో నెగ్గుకు రాగలరు. కానీ, వెంకటేశ్వర్ మహాస్వామి అనే అభ్యర్థి మాత్రం చేతిలో కేవలం తొమ్మిదంటే తొమ్మిది రూపాయలతో కోట్లాది రూపాయల ఆస్తులున్న, రాజకీయ దిగ్గజాలైన సుశీల్‌కుమార్ షిండే, ప్రకాష్ అంబేడ్కర్, జయసిద్ధేశ్వర మహారాజ్ వంటి దిగ్గజ నాయకులపై పోటీకి దిగి సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం ఈయన మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కారు. మహారాష్ట్రలోని షోలాపూర్ లోకసభ నియోజకవర్గంలో హిందుస్తాన్ జనతా పార్టీ తరఫున వెంకటేశ్వర్ మహాస్వామి అలియాస్ దీపక్ గంగారాం కటకదోండ్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా చేతిలో కేవలం తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఇతర ఆస్తులేమి లేవని అందులో పేర్కొన్నారు. తనకు రూ.45 వేల అప్పు మాత్రం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమర్ షిండే, వంచిత్ ఆఘాడీ తరఫున ప్రకాష్ అంబేడ్కర్, బీజేపీ తరఫున జయసిద్ధేశ్వర మహారాజ్ ఈ స్థానంలో బరిలో ఉండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ లోక్‌సభ నియోజకవర్గంపై పడింది. ఇప్పుడు ‘తొమ్మిది రూపాయల అభ్యర్థి’ వెంకటేశ్వర్ మహాస్వామి వారితో తలపడుతున్న విషయం మరింతగా ఆసక్తి కలిగిస్తోంది.
డిపాజిట్ కోసం అప్పు..
వెంకటేశ్వర్ మహాస్వామి హిందుస్తాన్ జనతా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతోపాటు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులను ప్రకటించారు. అందులోని వివరాలు చూసిన అందరూ అవాక్కయ్యారు. చేతిలో తొమ్మిది రూపాయల నగదు తప్ప మరేమీ ఆస్తులు లేవని, అదే విధంగా తనపై ఎవరూ ఆధారపడి లేరని తెలపడంతో పాటు తనపై రూ.45 వేల అప్పు ఉందని పేర్కొన్నారు. ఈ అప్పు కూడా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావల్సిన డిపాజిట్ డబ్బు చెల్లించేందుకు తీసుకున్నట్టు వెంకటేష్ తెలిపారు. షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎస్‌సీ రిజర్వుడ్. దీంతో ఇక్కడ పోటీచేసే అభ్యర్థులు డిపాజిట్‌గా రూ.12.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ మొత్తం కూడా తన వద్ద లేకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసినట్టు వెంకటేశ్వర్ మహాస్వామి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎవరీ వెంకటేశ్వర్ మహాస్వామి? వెంకటేశ్వర్ మహాస్వామి అలియాస్ దీపక్ గంగారాం కటకదోండ్ ..కర్ణాటకలోని నాగఠాణా అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ఈయన పేరు ఉంది. 31 ఏళ్ల వెంకటేశ్వర్ మహాస్వామి ధారవాడ్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేశారు. – గుండారి శ్రీనివాస్, సాక్షి– ముంబై
Comments
Please login to add a commentAdd a comment