కార్యకర్తలతో మాట్లాడుతున్న గిడ్డి ఈశ్వరి , మంత్రి అచ్చెన్నాయుడు
1. ‘పదవులు, కాంట్రాక్టుల కోసం కాదు.. అభివృద్ధి కోసమే వెళ్తున్నాం’..
– పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్పే మాట.
2. ‘అభివృద్ధిని చూసే మా పార్టీలోకి స్వచ్ఛందంగా వస్తున్నారు. మేం ఎవర్నీ ప్రలోభపెట్టడం లేదు.. ప్యాకేజీలూ ఇవ్వడం లేదు’..
– పచ్చ కండువాలు కప్పే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లించే చిలుక పలుకులు..
ఇవన్నీ వట్టి బూటకపు మాటలేనని తేటతెల్లమైపోయింది. రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ప్యాకేజీలతో పాటు పదవులు.. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు ఎరచూపే మా ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొంటున్నారన్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆరోపణలే నిజమని రుజువయ్యాయి. తాజాగా పార్టీ ఫిరాయించిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సంబంధించి బైటపడిన ఓ వీడియో సాక్ష్యం అందరినీ నిర్ఘాంతపరుస్తోంది. టీడీపీ పంచన చేరే ముందు సన్నిహితులైన ముఖ్యనేతలు, కార్యకర్తలతో గిడ్డి ఈశ్వరి జరిపిన సమాలోచనల్లో టీడీపీ ఆఫర్ల గురించి చక్కగా వివరించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీలో ఓ పెద్ద తలకాయ కోసం తాము ‘అనేక రకాలు’గా ప్రయత్నిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు విలేకరుల వద్ద బయటపెట్టారు. ఈ రెండు పరిణామాలను గమనిస్తే చంద్రబాబు ఏ స్థాయిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారో, నీతిబాహ్య రాజకీయాలు ఏస్థాయికి దిగజారాయో అర్ధమవుతుందని విశ్లేషకులంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘అభివృద్ధి కోసమే తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాను.. గిరిజనుల సంక్షేమం కోసమే టీడీపీలోకి చేరుతున్నాను.. వారి అభివృద్ధే తొలి ప్రాధాన్యం..’’ అంటూ టీడీపీలో చేరిన సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు బూటకమేనని తేలిపోయింది. గిరిజనుల అభివృద్ధే తప్ప తాను ఎటువంటి డిమాండ్లు పెట్టలేదని, ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసమూ తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని ఆమె బీరాలు పోయారు. ఆమే కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పదవులకు రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలోకి అనైతికంగా చేరిన ప్రతి ఎమ్మెల్యే చెప్పింది ఇదే. వారు చెప్పిందాంట్లో అభివృద్ధి అన్నంతవరకు నిజం.. కానీ అది ఎన్నికల్లో ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కాదు.. తమను నమ్ముకున్న కార్యకర్తల అభివృద్ధి అసలే కాదు.. కేవలం వ్యక్తిగత అభివృద్ధి.. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇదే నిజం... తాజాగా టీడీపీలోకి జంప్ అయి ఇదే విధమైన అభివృద్ధి పలుకులు పలికిన గిడ్డి ఈశ్వరి నిజ స్వరూపం బయటపెట్టే వీడియో ఒకటి ‘సాక్షి’కి చిక్కింది. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వైఎస్సార్‌సీపీని అర్ధంతరంగా వీడేందుకు సర్కారుతో ఆమె ఏం డీల్ కుదుర్చుకున్నారన్నది ఈ వీడియోతో బట్టబయలైంది.
పదవి ఇస్తామన్నారు.. అందుకే...
‘‘అమ్మా... వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వెళ్లొద్దు..’’ అంటూ పార్టీ వీడే ముందు రోజు పార్టీ కార్యకర్తలు గిడ్డి ఈశ్వరిని బతిమలాడారు. గిడ్డి ఈశ్వరి వైఎస్సార్‌సీపీని వీడే ముందురోజు ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు వెళ్లి ఆమెను కలిశారు. ‘అమ్మా ఎందుకు ఇప్పుడు మారడం..’ అని వారు అడగ్గా,. ‘‘జాయిన్ అయిన వెంటనే మంత్రి పదవి.. అది వెంటనే కుదరని పక్షంలో మంత్రి హోదాతో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందనే నేను టీడీపీలోకి వెళ్తున్నా.. ఎమ్మెల్యేగా ఇంకా ఏడాది టైమ్ ఉంది కాబట్టి మనం పనులన్నీ చేసుకోవచ్చు..’’ అని ఈశ్వరి చెప్పారు. పైగా చంద్రబాబు నాయుడు అంటే తనకేమీ ఇష్టం లేదని కూడా స్పష్టంగా చెప్పారు. తాను మాట్లాడుతున్న సమయంలో వీడియో తీస్తున్నారని ఓ దశలో గ్రహించిన ఆమె.. అంతా మన వాళ్లే కదా.. బయట వాళ్లు ఎవరూ లేరు కదా.. ఎవరైనా వీడియో షూట్ చేస్తున్నారేమో చూడండి అని ఒకింత కంగారు పడ్డారు. కానీ ఆమె అసలు స్వరూపాన్ని బయటపెట్టాలనే ఓ యువకుడు ధైర్యంగా వీడియో తీసి ‘సాక్షి’కి అందజేశారు.
పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేస్తా: గిడ్డి ఈశ్వరి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన తాను పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. అయితే ఏ పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేస్తారని మీడియా ప్రశ్నించగా అది మీరే తేల్చుకోవాలంటూ జవాబు దాటవేసి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఈ సన్నివేశం చోటు చేసుకుంది. తాను చేసిన పోరాటాల వల్లే బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తగ్గారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు ఇబ్బంది కలిగించబోమని ఇప్పుడు కూడా సీఎం తనకు హామీ ఇచ్చారని గిడ్డి ఈశ్వరి వెల్లడించారు. అసెంబ్లీకి హాజరుకానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందున తాను అసెంబ్లీకి హాజరవుతున్నట్టు చెప్పారు. దివంగత నేత వైఎస్ వల్లే గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉందని ఈశ్వరి అన్నారు. వైఎస్ జగన్‌ను నమ్ముకుని తాము వైఎస్సార్‌సీపీలోకి వచ్చామని, తమను ఎమ్మెల్యేలను చేసిన జగన్ ఇప్పుడు సీట్ల కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానం జరిగిందని వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. పాడేరులో ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ఇకపై టీడీపీ తరుపున గెలిచి వస్తానని అన్నారు.
పెద్దతలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి ఫిరాయించేలా చేయడం కోసం తాము ‘అన్ని రకాలు’గా ప్రయత్నిస్తున్నామని స్వయంగా మంత్రులే అంతర్గత సంభాషణల్లో బయటపెడుతున్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సంగతిని వెల్లడించారు. ‘వైస్సార్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పెద్ద తలకాయ కోసం ప్రయత్నిస్తున్నాం. అనేకరకాలుగా చర్చలు జరుపుతున్నాం. ‘అన్నిరకాలు’గా వారికోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అది వర్కవుట్ అయితే దాదాపు మా లక్ష్యం వందశాతం పూర్తయినట్లే. ఇక అక్కడ మిగిలేది ఒకరో ఇద్దరో మాత్రమే.’ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ముగిసేలోపే ఇది జరుగుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
వీడియోలో గిడ్డి మాటలు యధాతథంగా..
‘‘చంద్రబాబు అంటే మాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు.. మామూలుగా అయితే వెళ్లాలని లేదు.. ఆ పార్టీలోకి వెళ్లడం మాకు ఇష్టం లేదు. డిఫర్ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది.. నేను ఏం చెబుతున్నానంటే.. మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే.. రేపు.. ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవి ఇస్తామన్నారు.. జాయిన్ అయి వెళ్లిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేబినెట్ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా.’’
గిడ్డి ఈశ్వరి ఆఫర్‌పై వీడియో సాక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment