సాక్షి, విజయనగరం : గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కురుపాం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. గతంలో బాక్సైట్ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికోట్లు తీసుకుని పార్టీ మారారో ఆమె సమాధానం చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. గిడ్డి ఈశ్వరికి ఆత్మాభిమానం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ...‘ 2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాట్లోనే విన్నాం. వైఎస్ జగన్ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు చెప్పడం దురదృష్టకరం. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే...2014లో మీకు వైఎస్ జగన్ సీటు ఇచ్చారో చెప్పాలి. నిన్న, మొన్నటివరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు. గిరిజనులకు టీడీపీ సర్కార్ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు ... మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి...ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే మీరు పార్టీ మారారో చెప్పాలి. వైఎస్‌ఆర్ సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి.’ అని డిమాండ్ చేశారు.
కాగా వైఎస్‌ఆర్ సీపీ జెండాపై గెలిచిన గిడ్డి ఈశ్వరి... సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో వైఎస్‌ఆర్ సీపీకి సీటు దక్కకుండా చేయడం కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి రూ. 25 కోట్ల డీల్‌కు ఒప్పించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment