సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నీతిబాహ్య రాజకీయం మరో అడుగు దిగజారింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఫిరాయింపు రాజకీయాలు మరింత నీచమైన స్థాయికి చేరుకున్నాయి. రాజ్యాంగ దినోత్సవం రోజునే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మరో ఎమ్మెల్యే ఫిరాయింపునకు రంగం సిద్ధం చేశారు. ఫిరాయింపు రాజకీయాలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా నిస్సిగ్గుగా మళ్లీ అవే ఫిరాయింపులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించడం చూసి దేశం నివ్వెరపోతోంది.
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పచ్చ కండువా కప్పబోతున్నారని, అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీకి సీటు దక్కకుండా చేయడం కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి రూ. 25 కోట్ల డీల్‌కు ఒప్పించినట్లు తెలిసింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారితే రాజీనామా చేయడమో వారిపై అనర్హత వేటు వేయడమో జరగాలి. కానీ ఆ రెండూ లేకుండా స్పీకర్ వంటి రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకుని చంద్రబాబు ఆడుతున్న ఫిరాయింపు రాజకీయాలు చూసి దేశమంతా నివ్వెరపోతోంది.
ఇదేమి ధర్మం..
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్ల దలచుకున్న ప్రజాప్రతినిధి తన పదవికి రాజీనామా చేసి మరలా ప్రజాతీర్పు కోరడం ప్రజాస్వామ్యంలో కనీస ధర్మం. అలాంటి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి తమ పార్టీలోకి ఫిరాయించేందుకు ప్రోత్సహించడమే కాక వారి చేత రాజీనామా చేయించనీయకుండా చంద్రబాబు.. గిడ్డి ఈశ్వరి విషయంలో కూడా అదే వైఖరి కొనసాగిస్తున్న తీరు చూసి ప్రజలు ఛీత్కరిస్తున్నారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలో చేర్చుకుంటున్న చంద్రబాబు వారిపై అనర్హత వేటు పడకుండా చూస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించకుండా కొనసాగించడమే కాక వారికి మంత్రి పదవులలోనూ ప్రతిష్టించడం గమనార్హం.
తనది కాని రాజ్యసభ సీటు కోసం..
తనకు బలం లేకపోయినా రాజ్యసభ సీటు దక్కించుకోవడం కోసం చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని, అందులో భాగంగానే ఫిరాయింపులను ఎగదోస్తున్నారని వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించడం ద్వారా వారికి మరో రాజ్యసభ సీటు దక్కకుండా చేయాలన్న కుట్ర దీని వెనక దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ ఫిరాయింపులను ఎగదోయడమేకాక పైగా ఫిరాయించిన వారిచేతనే ప్రతిపక్షనేతపై ఎదురుదాడి చేయించడానికి, అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడానికి చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు.
ప్రజాసంకల్పయాత్రకు జనాదరణ చూసి ఓర్వలేక..
నాలుగేళ్లుగా చంద్రబాబు సాగిస్తున్న ప్రజాకంటక పాలనలో ప్రజలు పడుతున్న కష్టాల గురించి తెలుసుకునేందుకు, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెల్సిందే. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వేలాదిగా హాజరవుతూ తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ఆదుకోవలసిందిగా అభ్యర్థిస్తూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. 17 రోజులుగా సాగుతున్న పాదయాత్రకు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక జనం దృష్టిని మరల్చేందుకు అధికార తెలుగుదేశం పార్టీ అనేక దారులు అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఈ ఫిరాయింపుల పర్వాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని పార్టీ వర్గాలంటున్నాయి.
అసెంబ్లీని బహిష్కరించినా మళ్లీ అదే సిగ్గుమాలిన పని..
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడమే కాక అందులో నలుగురికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టడం నీతిబాహ్య రాజకీయం తారాస్థాయికి చేరినట్లయింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలలో నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వైఎస్సార్సీపీ ఈ సమావేశాలను బహిష్కరించింది. అసెంబ్లీకి హాజరైతే ఈ నీతిబాహ్య రాజకీయాలను ఆమోదించినట్లవుతుందనే ఇలా బాయ్‌కాట్ చేశామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సాగుతున్న ఈ ఫిరాయింపు రాజకీయాలపై రాజ్యాంగ సంస్థలన్నిటిలోనూ ఫిర్యాదు చేశామని, న్యాయస్థానాలలోనూ పోరాడుతున్నామని వారు పేర్కొంటున్నారు. అధికారపార్టీ నుంచి తమ పార్టీలోకి చేరడానికి సిద్ధపడిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుని తమ నాయకుడు వైఎస్ జగన్ అత్యున్నమైన ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.
అవినీతి సొమ్ముతో అంతులేని అక్రమాలు..
రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. ఇసుక నుంచి ఇరిగేషన్ వరకు, మట్టి నుంచి మద్యం వరకు, బొగ్గు నుంచి సోలార్ టెండర్ల వరకు, కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లు ప్రతి రంగాన్నీ ఓ మాఫియా మాదిరిగా తయారు చేశారు. రియల్ ఎస్టేట్ మాఫియా, కాల్‌మనీ సెక్స్ రాకెట్ మాఫియా రాష్ట్రం పరువును బజారుకీడ్చాయి.. ఇలా అక్రమంగా ఆర్జించిన సొమ్ముతో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చేయని అక్రమాలు లేవు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానూ అదే తరహాలు స్థానిక ప్రజా ప్రతినిధులను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేశారు. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఇదే తీరులో వ్యవహరించారు. ఓటుకు రూ.6వేల నుంచి రూ.8వేలు పంపిణీ చేయడం రాష్ట్రమంతా చూసింది.
మరో అడుగు దిగజారిన నీతిబాహ్య రాజకీయం
Published Mon, Nov 27 2017 4:01 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment