వైస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, విశాఖపట్నం : జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు జల్లా జిల్లాకు ప్రజాదరణ పెరుగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తూ, సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఈ యాత్ర చేపట్టారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా విశాఖలో సంఘీభావ యాత్ర చేపట్టిన విజయసాయి రెడ్డి.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 16న అన్ని జిల్లాల కలక్టరేట్ల వద్ద ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. సంఘీభావ యాత్రలో నాలుగు సంవత్సరాల తెలుగుదేశం పాలనా వైఫల్యాలు ప్రతిబింబిస్తున్నాయన్న ఆయన.. ఎన్నికలు ఎంత తొందరగా వస్తే, అంత త్వరగా టీడీపీకి బుద్ధి చెప్పాలనే ఆకాంక్ష ప్రజల్లో కన్పిస్తోందంటూ వ్యాఖ్యానించారు.
మత్స్యకారుల ఇబ్బందులు పట్టవా..?
విశాఖ దక్షిణ నియోజక వర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ భూకబ్జాలు, ధనార్జనే ధ్యేయంగా ప్రజాకంటక సభ్యుడిగా నిలిచిపోయారని మండిపడ్డారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రేషన్ సరుకులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మత్స్యకారులకు నెలా నెలా రావాల్సిన నాలుగు వేల రూపాయల భృతిని ఇవ్వకుండా వారిని ఇబ్బందుకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
హామీ ఏమైంది..?
ఫిషింగ్ హార్బర్‌ను పోర్ట్ ఆధిపత్యం నుంచి స్వాధీనం చేసుకుని, మత్స్యకార సంఘాలకు అప్పగిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోగా, విశాఖ కంటైనర్ టెర్మినల్ ఆక్రమించుకుంటోందని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో జన్మభూమి కార్యక్రమం కోసం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబు మత్స్యకారుల సమస్యలను పట్టించుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌తో కలిసి వినతి పత్రం అందివ్వడానికి వచ్చిన మత్స్యకార సంఘాల నేతలను తోలు తీస్తానంటూ చంద్రబాబు బెదిరించడం.. మత్స్యకారుల పట్ల ఆయనకున్న వైఖరిని తెలియజేస్తుందంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment