జేడీకి మా పార్టీలో స్థానం లేదు: విజయసాయి రెడ్డి | Vijaya Sai Reddy Slams JD Laxmi Narayana | Sakshi
Sakshi News home page

జేడీకి మా పార్టీలో స్థానం లేదు: విజయసాయి రెడ్డి

Published Mon, Apr 22 2019 4:14 PM | Last Updated on Mon, Apr 22 2019 4:17 PM

Vijaya Sai Reddy Slams JD Laxmi Narayana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చంద్రబాబు నాయుడు మోచేతినీళ్లు తాగే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు తమ పార్టీలో స్థానం లేదని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా విజయసాయిరెడ్డి, లక్ష్మీనారాయణల మధ్య ట్విటర్‌ వేదికగా మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి సోమవారం మరో ట్వీట్‌తో చురకలంటించారు. 

‘ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్.’ అని ట్వీట్‌ చేశారు. లక్ష్మీనారాయణతో పాటు చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు.

‘ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి.’ అంటూ మండిపడ్డారు. ‘సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎలాగైనా ఇరికించేందుకు బాబు అండ్‌ కో ఒత్తిళ్లు మొదలు పెట్టారని, పునేఠా ఇప్పటికే బలిపశువయ్యాడన్నారు. కోడ్ అమలులో ఉన్నా మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని ఎల్వీని బెదిరిస్తున్నారని, నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకుని పోయేవారిని పట్టించుకోనవసరం లేదన్నారు.

అమరావతిలోని ‘ప్రజావేదిక’ ప్రభుత్వ ప్రాంగణమని, కానీ టీడీపీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఇప్పటి వరకు దానిని  దుర్వినియోగం చేస్తూ వచ్చారన్నారు. కోడ్‌ అమలులో ఉన్నా తాను ఆపద్ధర్మ సీఎం అని మర్చిపోయి అదే  ప్రజావేదికలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళినే హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement