
సాక్షి, అమరావతి : ప్రజల దీవెనతో సాధించిన ఘన విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ్యత మరింత పెరిగిందని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ట్వీటర్ వేదికగా ఆయన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఐదేళ్ల నారాసుర పాలనలో వైఎస్సార్‌సీపీ సైనికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందులో నుంచి పుట్టిన కసిని జగనన్నను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించాలని సూచించారు. మాటకు మాట, ప్రతీకారాలు మనకు, వాళ్లకు తేడా లేకుండా చేస్తాయన్నారు. మరో ట్వీట్‌లో.. వైఎస్ జగన్ పాలనలో ఉజ్వల ఆంధ్రప్రదేశ్ కల సాకారమవుతుందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు భవిష్యత్తుపై పూర్తి భరోసా కల్పిస్తూ రైతన్నల కష్టాలకు కాలం చెల్లే రోజులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. నవరత్నాలతో ప్రతి పేదింటి గడప.. అభివృద్ధికి ఒక ప్రయోగశాలగా మారబోతోందన్నారు. ఇంక అంతకు ముందు వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి హృదయపూర్వక శుభాభినందనలు తెలియ జేస్తూ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే శక్తిని జననేతకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment