
సాక్షి, న్యూఢిల్లీ : అత్యంత ఉత్కంఠ భరితంగా మారిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలతో పాటు శాసనసభకు కూడా ఒకే రోజు ఎన్నికల షెడ్యూలు ఈసీ ప్రకటించింది.
తొలిదశలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ స్థానాల కోసం ఈ నెల 18 వ తేదీ సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. 18 వ తేదీ నుంచి ప్రారంభమై 25 వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28 న ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రిల్ 11 వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి వీలులేనందున దేశవ్యాప్తంగా ఓట్ల కౌంటింగ్ మే 23న నిర్వహిస్తారు.
- ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో... 20 జనరల్, 4 ఎస్సీ, 1 ఎస్టీలకు కేటాయింపు
- 175 అసెంబ్లీ స్థానాల్లో... 139 జనరల్, 29 ఎస్సీ, 7 ఎస్టీలకు కేటాయింపు
4 జూన్ 2014 న ఏర్పడిన ప్రస్తుత లోక్ సభ పదవీ కాలం వచ్చే జూన్ 3 వ తేదీతో ముగుస్తోంది. అలాగే జూన్ 19, 2014 లో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీ కాలం వచ్చే 18 జూన్ 2019 తో పూర్తవుతోంది. అలాగే ఒడిశా (11 జూన్ 2019), సిక్కిం (27 మే 2019), అరుణాచల్ ప్రదేశ్ (1 జూన్ 2019) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏకకాలంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 11న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి.
- మార్చి 18న మొదటి నొటిఫికేషన్ విడుదల
- ఏప్రిల్ 11న తొలి విడత లోక్ సభ ఎన్నికలు
- ఏప్రిల్ 18న రెండోదశ లోక్ సభ ఎన్నికల
- ఏప్రిల్ 23న మూడో దశ లోక్ సభ ఎన్నికలు
- ఏప్రిల్ 29న నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు
- మే 6న ఐదో దశ లోక్ సభ ఎన్నికలు
- మే 12న ఆరోదశ లోక్ సభ ఎన్నికలు
- మే 19న ఏడో దశ లోక్ సభ ఎన్నికలు
- మే 23న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు
Comments
Please login to add a commentAdd a comment