సాక్షి, న్యూఢిల్లీ : ఓటరు ఎంతో చైతన్యమైన ఈ రోజుల్లో, ఎవరికి ఓటు వేయాలో ఓటరు ముందే ఓ నిర్ణయానికి వస్తున్న సైద్ధాంతిక వైరుధ్యాల నేటి యుగంలో, క్షణాల మీద సమాచారం చేరువవుతున్న సోషల్ మీడియా కాలంలో కూడా ఎన్నికలకు 70 రోజుల ప్రచారం అవసరమా? ఊరూరా సభలు, వాడవాడల సమావేశాలు, కరపత్రాలు, జెండాలు, బ్యానర్లు, వాహనాలతో ర్యాలీలు, కోట్లాది రూపాయల అనవసరమైన ఖర్చు అవసరమా? మారడానికి మరెంత కాలం?
2004, 2014 జరిగిన ఎన్నికల్లో ప్రచారం కూడా ప్రారంభం కాకుండానే ప్రతి ఇద్దరిలో ఒకరు ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయానికి వచ్చినట్లు ‘లోక్‌నీతి–సీఎస్‌డీఎస్’ జరిపిన అధ్యయనంలో తేలింది. చివరి నిమషంలో లేదా పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు అలాంటి వారి సంఖ్య ప్రతి ఇద్దరిలో ఒకరు ఉండగా, ఇప్పుడు ప్రతి నలుగురులో ఒకరికి తగ్గింది. 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉండగా, ఆ తర్వాత వరుసగా పెరిగి 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది.
సంప్రదాయంగా పార్టీ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు, ఎప్పటికప్పుడు రాజకీయాల పట్ల అవగాహన కలిగిన వారు, సైద్ధాంతిక పరిమితులు ఉన్నవారు, పట్టణ ప్రాంతాలవారు, చదువుకున్న వారు, పత్రికలను ఎక్కువగా చదువుకునే వారు, మధ్యతరగతి వారు, వారిలో ఎక్కువగా మగవారు ముందే ఏ పార్టీకి ఓటు వేయాలో ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఇక అలస్యంగా నిర్ణయం తీసుకునే వారు ఎక్కువగా విజయావకాశాలున్న పార్టీకే ఓటు వేస్తారు. 2014లో ఎన్నికల్లో 45 శాతం ఓటర్లను లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ ఇంటర్వ్యూగా చేయగా వారిలో 40 శాతం మంది తాము విజయం సాధిస్తుందని నమ్మిన పార్టీలకే ఓటు వేశారట. సహజంగా వీరిలో ఎక్కువ మంది చివరిలో ఓటేసిన వారే ఉంటారు.
2014లో జరిగిన ఎన్నికల్లో ఇంకా ప్రచారం కాకముందే కాంగ్రెస్ కన్నా ఎనిమిది శాతం ఎక్కువ మంది ఓటర్లు బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారట. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో బీజేపీకి ఓటు వేయాలనుకున్న వారి శాతం ఎనిమిది నుంచి 16 శాతానికి పెరిగింది. వారిలో ఎవరికి ఓటు వేయాలో 48 గంటల ముందే నిర్ణయం తీసుకున్నవారే ఎక్కువ.
పరిపాటిగా పలు దశల ఓటింగ్
భారత దేశంలో శాంతి భద్రతల కారణాలతో పలు దశల ఓటింగ్‌ను నిర్వహించడం పరిపాటిగా మారింది. 2013–2014 ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఓటర్ల మద్దతు వ్యత్యాసం చాలా తక్కువ. అది ప్రచారం పెరుగుతున్న కొద్దీ ఎక్కువవుతూ వచ్చింది. అంటే బీజేపీ లాభపడుతూ వచ్చింది. మరో విధంగా చెప్పాలంటే 2014లో ఎన్నికల ప్రచారం ఉధృతం అవుతున్నాకొద్దీ కాంగ్రెస్ పారీ మద్దతు పడిపోతు వచ్చింది, గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ పోటీ చేసిన గుజరాత్‌లోని వడోధర, యూపీలోని వారణాసిలతోపాటు సోనియా, రాహుల్ గాంధీలు పోటీ చేసిన రాయ్‌బరేలి, అమేథి నియోజక వర్గాలకు ఏడవ విడతలో ఎన్నికలు జరిగాయి. గత 20 ఏళ్లలో వారణాసిలో అఖరి విడత ఎన్నికలు జరగలేదు.
ఈసారి కూడా వారణాసికి ఆఖరి విడతలో ఎన్నికలు జరుగుతుండగా, రాయ్‌బరేలి, అమేథిలకు ఐదవ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ అవడం వల్ల మోదీతోపాటు గాంధీలకు కూడా మీడియాలో ఎక్కువ ప్రచారం లభించింది. గ్రామీణ ప్రాంతాల వారు, మహిళలు, నిరక్షరాస్యులు సుదీర్ఘ ప్రచారానికి ఎక్కువగా ప్రభావితులు అవుతున్నారు. పార్టీల, హంగు ఆర్భాటాల వల్ల ఏ సిద్ధాంతాలతో సంబంధంలేని గ్రామీణ ప్రజలు ప్రభావితులవుతున్నారు. డబ్బు ఖర్చుకు ఎన్నికల కమిషన్ ఎన్ని పరిమితులు పెట్టినా లాభం కనిపించడం లేదు. ఎన్నికల సంస్కరణల ద్వారా ప్రచారాన్ని కుదించి, నిబంధనలను కట్టుదిట్టం చేస్తే డబ్బు వృధాను నియంత్రించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment