కోల్‌కత్తా: దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తమ సహచరులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొందరు ప్రచారంలో పాల్గొనక పోయిన సోషల్ మీడియా వారికి విషేస్ తెలియజేస్తున్నారు. తాజాగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ కూడా తన స్నేహితుని కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన అనుపమ్ హజ్రాకు మద్దతుగా ఖలీ ప్రచారంలో పాల్గొన్నారు.
‘నా స్నేహితుడు ఎన్నికల బరిలో నిలువడంతో అతనికి మద్దతు తెలుపడానికి అమెరికా నుంచి వచ్చాను. అతనికి ఓటు వేసి ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించే అవకాశం కల్పించండి. మోదీ మంచి ప్రధాని. దేశం కోసం ఆయన ఎంతో చేశారు. ఆయనను చూసి నేను గర్వపడుతున్నాన’ని ఖలీ తెలిపారు. అయితే తను ఏ పార్టీకి మద్దతు తెలుపడం లేదని.. కేవలం తన స్నేహితుని కోసమే ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అనుపమ్ మాట్లాడుతూ.. ఖలీ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. తమ మధ్య ఉన్న స్నేహం కారణంగానే ఖలీ తొలిసారిగా ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. ఖలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో.. అతన్ని చూడటానికి జనాలు భారీగా తరలివచ్చారు. అతనితో కరచాలనం చేయడానికి, సెల్పీలు తీసుకోవడానికి జనాలు ఎగబడ్డారు.
కాగా, అనుపమ్ 2014లో బోల్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీఎంసీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డరానే కారణంతో టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ ఏడాది జనవరిలో అనుపమ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అనుపమ్ మార్చిలో బీజేపీలో చేరారు. అయితే అనుపమ్‌కు పోటీగా టీఎంసీ ప్రముఖ బెంగాలీ నటి మిమి చక్రవర్తిని బరిలో నిలిపింది.
Comments
Please login to add a commentAdd a comment