యోగి ఆదిత్యనాథ్‌ మాటల్లో నిజానిజాలు | Yogi Adityanath Misleading Statements | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 7 2019 5:57 PM | Last Updated on Mon, Jan 7 2019 6:00 PM

Yogi Adityanath Misleading Statements - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మార్చి నెల వస్తే నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతాయి. ఇంతవరకు రాష్ట్రంలో అల్లర్లు జరగలేదు’  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జనవరి 3, 2019న చేసిన ట్వీట్‌ ఇది. ఆ తర్వాత ‘ఫస్ట్‌పోస్ట్‌’  పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

వాస్తవాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సాక్షాత్తు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహిర్‌ 2018, ఫిబ్రవరి 6వ తేదీన లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ 2017లో దేశవ్యాప్తంగా 822 మతపరమైన అల్లర్లు చెలరేగాయని, వాటిలో 195 అల్లర్లు ఒక్క ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే జరిగాయని వెల్లడించారు. ఆ 195 అల్లర్లలో 42 మంది మరణించారని, 542 మంది గాయపడ్డారని కూడా తెలిపారు. ఆయన అన్ని రాష్ట్రాల వివరాలు వెల్లడించగా ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా అల్లర్ల సంఘటనలు జరిగాయి. ఆ తర్వాత రెండోస్థానంలో ఉన్న రాజస్థాన్‌లో 91 సంఘటనలు జరిగి, 12 మంది మరణించగా, 175 మంది గాయపడ్డారు. ఇక మూడవ స్థానంలో ఉన్న  పశ్చిమ బెంగాల్‌లో 58 సంఘటనలు జరగ్గా 9 మంది మరణించారు. 230 మంది గాయపడ్డారు. మొదటి రెండు రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉండగా, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండడం గమనార్హం. 

మూడు ప్రధాన సంఘటనలు
కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాలే కాకుండా మీడియా వార్తల ప్రకారం యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో అల్లర్లకు సంబంధించి మూడు ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సహరాన్‌పూర్‌ పరిధిలోని షబ్బీర్‌పూర్‌ గ్రామంలో 2017, మే 5వ తేదీన ఠాకూర్లు, దళితుల మధ్య అల్లర్లు చెలరేగాయి. రాజ్‌పుత్‌ల రాజు మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా తమ ప్రాంతం నుంచి ఠాకూర్ల ప్రదర్శనను అడ్డుకున్న దళితులపై దాడి చేయడంలో ఒకరు మరణించారు. 15 మంది గాయపడ్డారు. 2018, జనవరి 26వ తేదీన ఇరువర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. ఫలితంగా అక్కడ కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహిస్తున్న యువకులు ఆ ప్రాతంలో నివసిస్తున్న ఓ వర్గం ప్రజలకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో ఘర్షణ తలెత్తింది. ఫలితంగా ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్లు విసురుకొని కాల్పులు కూడా జరుపుకున్నారు. 

బులంద్‌షహర్‌లో
బులంద్‌షహర్‌ పరిధిలో గత డిసెంబర్‌ 27వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు ఆవులను చంపారన్న కారణంగా చెలరేగిన హింసాకాండలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సుబోద్‌ కుమార్, మరో పౌరుడు మరణించారు. ఇన్‌స్పెక్టర్‌ హత్య కేసులో నిందితుడైన భజరంగ్‌ దళ్‌ నాయకుడిని పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. అన్ని జాతీయ వార్తా పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement