
సాక్షి, లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిప్పులు చెరిగారు. యోగి ఉత్తరప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పట్టపగలే దారుణ హత్యలు జరుగుతున్నాయని, రౌడీలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక గొంతులను అణిచివేస్తూ యోగి ప్రభుత్వం ముందుకెళుతోందని, ప్రజాస్వామ్యా విలువలన్నింటిని కాల రాసిందని ధ్వజమెత్తారు.
బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు మరింత చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారనే విషయం గుర్తు చేశారు. మార్చి 2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కానీ, అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు బుధవారం మీరట్‌లో పట్టపగలు జంట హత్యలు జరగడమే నిదర్శనం అన్నారు. ఈ విషయంపై తాము గవర్నర్ రామ్ నాయక్‌ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించినట్లు తెలియజేశారు.