సాక్షి, ఆరిలోవ(విశాఖ తూర్పు) : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడి, విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న శ్రీనివాసరావును ఎట్టకేలకు తల్లిదండ్రులు ములాఖత్ అయ్యారు. 15 రోజుల పాటు కారాగారంలో ఉన్న శ్రీనివాస్‌ను కలవడానికి అతడి తల్లి సావిత్రమ్మ, అన్నయ్య సుబ్బరాజు, బంధువు బత్తుల రామకృష్ణ ప్రసాద్ గురువారం ములాఖత్ తీసుకున్నారు. రెండు వారాల్లో నాలుగు ములాఖత్‌లకు అవకాశం ఉన్నా...జైలులో వారు కలవడం ఇదే మొదటిసారి.
ఉదయం విశాఖ కోర్టులో బెయిల్ వ్యవహారాలు చూసుకున్న వీరు మధ్యాహ్నం 2.30 గంటలకు జైలుకు వచ్చారు. శ్రీనివాసరావును కలసి మాట్లాడిన అనంతరం బయటకు వచ్చిన తల్లి సావిత్రమ్మ, అన్నయ్య, బంధువు మీడియాతో మాట్లాడారు. ‘బెయిల్ మీద నన్ను బయటకు తీసుకెళ్లండి, బయటకు వచ్చిన అనంతరం జరిగినదంతా మీడియా ముందు వెల్లడిస్తానని’ శ్రీనివాసరావు చెప్పాడని అతని తల్లి తెలిపారు.
అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీనివాసరావు బంధువు బత్తుల రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ...కోడికత్తి బూటకం అని ములాఖత్‌లో శ్రీనివాస్ చెప్పినట్లు తెలిపారు. అనుకోకుండా జరిగిన సంఘటనలో జగన్‌కు చిన్న గాయమై రక్తం కారిందని, అంతేకాని కోడికత్తిని వినియోగించలేదన్నట్లు చెప్పుకొచ్చారు. కోడికత్తి కాకపోతే ఇంకేమైనా ఆయుధం వినియోగించినట్లు చెప్పాడా అనే ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఆయన మాటలను బట్టి టీడీపీ నాయకులే రామకృష్ణ ప్రసాద్‌ను ఇక్కడకు తీసుకొచ్చి ఈ మాటలు చెప్పించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment