రాజీలేని పోరాటం | YS Jagan directions to YSRCP MPs to achieve special status and Division guarantees | Sakshi
Sakshi News home page

రాజీలేని పోరాటం

Published Sun, Jun 16 2019 3:44 AM | Last Updated on Sun, Jun 16 2019 9:41 AM

YS Jagan directions to YSRCP MPs to achieve special status and Division guarantees - Sakshi

ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధనకు ఐక్యంగా కృషి  చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం జరిగేందుకు, హామీల సాధనకు ఎంపీలే కళ్లు, చెవుల లాంటివారని అభివర్ణించారు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం తొలిసారి సమావేశమైంది. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, గొడ్డేటి మాధవి, బెల్లాని చంద్రశేఖర్, ఎంవీవీ సత్యనారాయణ, వెంకట సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ, రఘురామకృష్ణంరాజు, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేశ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్‌ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, నల్లకొండగారి రెడ్డప్ప పాల్గొన్నారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో సమావేశమైన ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.

మన బలాన్ని సమర్థంగా వినియోగించుకుందాం.. 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎంపీలతో సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో నాలుగో అతి పెద్ద పార్టీగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భవించింది. దీన్ని ఒక అవకాశంగా భావించాలి. మనకున్న సంఖ్యాబలాన్ని సమర్థంగా వినియోగించుకుని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనపై రాజీలేని పోరాటం చేసి ఫలితాలు రాబట్టాలి. ఆంధ్రప్రదేశ్‌ ఎంపీల గౌరవం పెరిగేలా హుందాగా వ్యవహరిస్తూ సభా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీలో ఎక్కువ శాతం మంది యువకులు, విద్యావంతులు ఉన్నందున భాషాపరమైన సమస్య ఉండదు. శాఖలవారీగా ఎంపీలు కమిటీలు ఏర్పాటు చేసుకుని నిధులు రాబట్టటంపై కృషి చేయాలి. నియోజకవర్గ అవసరాలు దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలను ఎంపిక చేసుకోవాలి. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌గా మిథున్‌రెడ్డి ఇచ్చే సలహాలు, సూచనలు అనుసరించి సభా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఎంపీలను సబ్‌ గ్రూప్‌లుగా ఏర్పాటు చేసి మంత్రిత్వ శాఖల వారీగా సబ్జెక్టులు కేటాయిస్తాం. తరచూ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాల సాధనపై దృష్టి సారించాలి. క్రమశిక్షణ, ఐకమత్యంతో పార్లమెంట్‌లో వ్యవహరించాలి’ అని పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అనంతరం రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రాధాన్య అంశాలను ఆయన ఎంపీలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. 

కలసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
ప్రత్యేక హోదాతోపాటు నియోజకవర్గాలవారీగా సమస్యల గురించి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించాం. పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంపై సీఎంతో చర్చించా. కదిరి నుంచి కొంతమంది పేదలు భిక్షాటన కోసం కేరళ వెళుతున్నారు. అక్కడ ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వీరందరికీ ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లా. ధర్మవరం, హిందూపురంలో చేనేత కార్మికుల కోసం క్లస్టర్ల ఏర్పాటుపై చర్చించా. ఇక రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ తర్వాత దేశంలోని కరువు పీడిత ప్రాంతాల్లో అనంతపురం జిల్లానే రెండో స్థానంలో ఉంది. మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం అదనపు నిధులు సాధించడం, ఉద్యాన సాగును ప్రోత్సహించడంపై చర్చించా. ముద్దనూర్, చిక్‌బళ్లాపూర్‌ రైల్వే ప్రాజెక్టుల గురించి కూడా ప్రస్తావించా. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఎంపీలంతా కలసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. స్నేహపూర్వక వాతావరణంలో కేంద్రం మా సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం.    
– గోరంట్ల మాధవ్, హిందూపురం ఎంపీ

చివరిదాకా పోరాడుతూనే ఉంటాం..
పార్లమెంట్‌లో కలసికట్టుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంపీలను బృందాలుగా ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తాం. ఏ సమస్య ఉన్నా పార్లమెంటరీ పార్టీ నేత, ఫ్లోర్‌ లీడర్ల ద్వారా చర్చించాలని సూచించారు. ప్రత్యేక హోదా కోసం చివరి నిమిషం వరకు 
పోరాడుతూనే ఉండాలని ఆదేశించారు.
– డా. సంజీవ్‌కుమార్, కర్నూలు ఎంపీ

వైఎస్‌ జగన్‌ను కలిసిన కర్ణాటక సీఎం
నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఏపీ భవన్‌లో వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం నంబర్‌ 1 జన్‌పథ్‌కు వచ్చిన ఆయన వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారస్వామిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేశారు.
మామిడి ఎగుమతులకు రైల్వే సహకరించాలి..
ప్రత్యేక హోదా మన నినాదం, దాన్ని సాధించే క్రమంలో ఫ్లోర్‌ లీడర్ల సూచనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. మా జిల్లాలో రైల్వే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, స్టేషన్లు, రైల్వే షెడ్లు, యార్డుల గురించి సభలో ప్రస్తావిస్తా. మా ప్రాంతం నుంచి మామిడి ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా రైల్వే ఏర్పాట్లు చేయాలి. తాగునీరు, సాగునీటి సమస్యలతోపాటు గిరిజన యూనివర్సిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ తదితర అంశాలపై కృషి చేస్తా.  
– బెల్లాని చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ

హామీ మేరకు సహకరించాలని కోరతాం..
ఎంపీల సంఖ్యలో వైఎస్సార్‌ సీపీ దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అంతా కలసికట్టుగా పనిచేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించారు. కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ఉంది  కాబట్టి మానవతా దృక్పథంతో సాయం చేయమని అడుగుతాం. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. ఆ మేరకు సహకరించమని అడుగుతూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని కోరా. నా సూచన బాగుందని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. యువతకు శిక్షణ, అవగాహన, ఉపాధి కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పలు పథకాలున్నాయి. వాటి కింద 50 శాతం వరకు సబ్సిడీ కూడా వస్తోంది. పన్ను రాయితీలు కూడా ఉన్నాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయి. వీటిని వినియోగించుకుంటే యువతకు స్వయం ఉపాధి లభిస్తుంది.
 – మార్గాని భరత్, రాజమండ్రి ఎంపీ

ఏపీ భవన్‌ వద్ద ఘన స్వాగతం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఢిల్లీ వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ భవన్‌ వద్ద పలువురు నేతలు, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి రెహమాన్, పార్టీ ఎంపీలు వంగా గీత, సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనురాధ, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డిశాంతి,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు తదితరులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌.. ఏపీ భవన్‌ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement