సాక్షి, విజయనగరం: సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పి, ప్రజలను మోసం చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘అయిదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు చూశారు. కులానికో ఓ పేజీ చొప్పున హామీ ఇచ్చి... ఏ విధంగా మోసం చేశారో చూశారు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామన్నారు, మెడికల్ కాలేజీ ఇస్తామని మాట తప్పారు. ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. మీ భవిష్యత్- నా బాధ్యత అంటున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత, ఆధార్ డేటాను దొంగలించారు. వివరాలన్నింటినీ టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌లో లోడ్ చేశారు. ప్రజల వివరాలను జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించారు. మహిళల సెల్‌ఫోన్ నెంబర్లను కూడా జన్మభూమి కమిటీ సభ‍్యులకు ఇస్తున్నారు. తన అయిదేళ్ల పాలన తర్వాత ఈ మాటలు చెప్పడం దారుణం. చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ఎక్కడ భద్రత ఇచ్చారు?. ఏం భరోసా ఇచ్చారు.
చదవండి....(అవినీతి లేని పాలన అందిస్తా: వైఎస్ జగన్)
గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు. బాబు పుణ్యమా అని జిల్లాలో ఉన్న జూట్ మిల్లులు మూతపడ్డాయి. ఆయన మట్టిని, ఇసుకను కూడా వదల్లేదు. జిల్లాలో నదుల అనుసంధానం కూడా పూర‍్తి కాలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని వదల్లేదు. లంచాలు రావని భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోతే...టీడీపీ నేతలపై కేసులు లేవు. మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకున్న చింతమనేనిపై కేసు లేదు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబే. ప్యాకేజీ అంగీకరించి బీజేపీ నేతలకు సన్మానం చేశారు. అలాగే రుణాలు మాఫీ చేస్తానని రైతులను నట్టేట ముంచారు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల జీవితాలను తాకట్టు పెట్టారు. రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌కే భద్రత ఇవ్వలేదు. అలాంటిది రాష్ట్ర ప్రజలకు ఏం భద్రత ఇస్తారు. ఆరోగ్యశ్రీ, 108, 104కు భరోసా లేదు. మడమ తిప్పనివాడే నాయకుడు. చంద్రబాబు అర్థమయ్యేలా ఈ ఎన్నికల్లో మీరు తీర్పు ఇవ్వాలి.
చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రానికి పట్టిన దిష్టికి ఎన్ని కొబ్బరి కాయలు, గుమ్మడి కాయలు, నిమ్మ కాయలు కొట్టినా దిష్టి పోదు. అదికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారు. చివరికి తానే హత్య చేయించి.. సాక్ష్యాధారాలను తారుమారు చేసి సిట్ వేస్తారు. ఏపీలో సిట్ అంటే...చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. నిజంగా చంద్రబాబులో కల్మషం లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలి. గ్రామాలకు మూటలు మాటలు డబ్బులు పంపించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తాం. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఇంజినీరింగ్ విద్యకు ఎన‍్ని లక్షలైనా మేం భరిస్తాం.’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment