Denkada
-
చంద్రబాబు మాట తప్పి ప్రజలను మోసం చేశారు
-
చంద్రబాబు అస్సలు మనిషేనా?: వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పి, ప్రజలను మోసం చేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘అయిదేళ్ల చంద్రబాబు పాలన చూశారు. ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు చూశారు. కులానికో ఓ పేజీ చొప్పున హామీ ఇచ్చి... ఏ విధంగా మోసం చేశారో చూశారు. విజయనగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామన్నారు, మెడికల్ కాలేజీ ఇస్తామని మాట తప్పారు. ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. మీ భవిష్యత్- నా బాధ్యత అంటున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల వ్యక్తిగత, ఆధార్ డేటాను దొంగలించారు. వివరాలన్నింటినీ టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌లో లోడ్ చేశారు. ప్రజల వివరాలను జన్మభూమి కమిటీ సభ్యులకు అప్పగించారు. మహిళల సెల్‌ఫోన్ నెంబర్లను కూడా జన్మభూమి కమిటీ సభ్యులకు ఇస్తున్నారు. తన అయిదేళ్ల పాలన తర్వాత ఈ మాటలు చెప్పడం దారుణం. చంద్రబాబు తన అయిదేళ్ల పాలనలో ఎక్కడ భద్రత ఇచ్చారు?. ఏం భరోసా ఇచ్చారు. చదవండి....(అవినీతి లేని పాలన అందిస్తా: వైఎస్ జగన్) గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. గిరిజన యూనివర్సిటీ ఊసే లేదు. బాబు పుణ్యమా అని జిల్లాలో ఉన్న జూట్ మిల్లులు మూతపడ్డాయి. ఆయన మట్టిని, ఇసుకను కూడా వదల్లేదు. జిల్లాలో నదుల అనుసంధానం కూడా పూర్తి కాలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని వదల్లేదు. లంచాలు రావని భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్‌ను రద్దు చేశారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోతే...టీడీపీ నేతలపై కేసులు లేవు. మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకున్న చింతమనేనిపై కేసు లేదు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబే. ప్యాకేజీ అంగీకరించి బీజేపీ నేతలకు సన్మానం చేశారు. అలాగే రుణాలు మాఫీ చేస్తానని రైతులను నట్టేట ముంచారు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల జీవితాలను తాకట్టు పెట్టారు. రుణాల మాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్కే భద్రత ఇవ్వలేదు. అలాంటిది రాష్ట్ర ప్రజలకు ఏం భద్రత ఇస్తారు. ఆరోగ్యశ్రీ, 108, 104కు భరోసా లేదు. మడమ తిప్పనివాడే నాయకుడు. చంద్రబాబు అర్థమయ్యేలా ఈ ఎన్నికల్లో మీరు తీర్పు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రానికి పట్టిన దిష్టికి ఎన్ని కొబ్బరి కాయలు, గుమ్మడి కాయలు, నిమ్మ కాయలు కొట్టినా దిష్టి పోదు. అదికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతారు. చివరికి తానే హత్య చేయించి.. సాక్ష్యాధారాలను తారుమారు చేసి సిట్ వేస్తారు. ఏపీలో సిట్ అంటే...చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. నిజంగా చంద్రబాబులో కల్మషం లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలి. గ్రామాలకు మూటలు మాటలు డబ్బులు పంపించారు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తాం. పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఇంజినీరింగ్ విద్యకు ఎన్ని లక్షలైనా మేం భరిస్తాం.’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
మరో ఆన్లైన్ మోసం..
డెంకాడ : మండలంలోని గుణుపూరు గ్రామానికి చెందిన మహంతి లక్ష్మికి చెందిన బ్యాంక్ ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ఏపీజీవీబీ డెంకాడ బ్రాంచిలో ఖాతా ఉంది. కొద్ది రోజుల కిందట ఓ అగంతుకుడు నుంచి లక్ష్మికి ఫోన్ వచ్చింది. తాను బ్యాంక్ మేనేజర్‌నని.. మీ ఏటీఎం బ్లాక్ అయిందని.. ఆధార్ నంబర్ చెబితే పునరుద్ధరిస్తామని చెప్పడంతో బాధితురాలు వివరాలు చెప్పింది. అలాగే మరికొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పాలని కోరడంతో బాధితులు చెప్పేశారు. ఇలా రెండేసార్లు చెప్పిన తర్వాత అనుమానం వచ్చిన బాధితులు బ్యాంక్‌లో సంప్రదించగా, వచ్చిన ఫోన్ నకిలీదని తేలింది. అయితే అప్పటికే లక్ష్మి ఖాతా నుంచి రూ. 25 వేలను అగంతుకుడు డ్రా చేసేశాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. -
క్రీడలతో మానసికోల్లాసం
డెంకాడ: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని బెటాలియన్స్ కాకినాడ రేంజ్ డీఐజీ కె.సూర్యచంద్ అన్నారు. చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుళ్లకు సోమవారం స్పోర్ట్స్‌మీట్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను డీఐజీ సూర్యచంద్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపాల్ రాజశిఖామణి, 16వ బెటాలియన్ అదనపు కమాండెంట్ పి.మోహన్‌ప్రసాద్ పావురాలు, బెలూన్స్ ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం డీఐజీ సూర్యచంద్ మాట్లాడుతూ, క్రీడల వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారన్నారు. ఇలాంటి స్పోర్ట్స్‌మీట్ వల్ల దాగిఉన్న క్రీడానైపుణ్యాలు బయటకు వస్తాయన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అడిషినల్ కమాండెంట్ ఎంబీవీ సత్యనారాయణ, బెటాలియన్ పోలీస్ అధికారులు జీవీ ప్రభాకరరావు, కె.తిరుమలరావు, జి.రవీంద్రకుమార్, వీవీ రమణ, ట్రైనింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
విజయనగరం జిల్లా: డెంకాడ మండలం మోదవలసలో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మోదవలస గ్రామంలో జన్మభూమి సభ కోసం అర్జీలు రాస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో సురేష్, కాంతం అనే ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా వీరికి సహాయంగా ఆటోలో వస్తున్న వారిపై మార్గమధ్యలో మరో సారి టీడీపీ వర్గీయులు దాడికి దిగారు. దీంతో మరికొందరు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి రక్షణగా ఉండి ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు గ్రామంలో సైతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
రేసింగ్ కుర్రాళ్లకు బేడీలు
డెంకాడ (విజయనగరం) : బైక్‌లపై వీర విహారం చేస్తూ ఆ మార్గంలో వచ్చిపోయే వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకులపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఆదివారం విశాఖ నుంచి విజయనగరం జిల్లా పైడి భీమవరం వరకు జాతీయ రహదారిపై కుర్రాళ్లు బైక్ రేసింగులకు దిగారు. సమాచారం అందుకున్న విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. -
డెంకాడ ఎంపీపీ కారు దహనం
డెంకాడ: ఇంట్లో పార్క్ చేసి ఉన్న ఓ ప్రజాప్రతినిధి కారు కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం అక్కివరం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇంటి మందు పార్క్ చేసి ఉన్న కారును దుండగులు తగలబెట్టారు. ఇది గుర్తించిన స్థానికులు ఎంపీపీని అప్రమత్తం చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. దీంతో చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏం కష్టమొచ్చిందో...
రిజర్వాయర్‌లో శవాలుగా తేలిన కాబోయే దంపతులు మెంటాడ: త్వరలోనే పెళ్లి చేసుకోవలసిన ఓ జంట రిజర్వాయర్‌లో శవాలై తేలారు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు... డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన రెయ్యి సురేష్(28)కు బొండపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వసంత సుబ్బలక్ష్మితో వివాహం నిశ్చయమైంది. ఈసంవత్సరం అక్టోబర్ 29వ తేదీన వివాహం జరిపించేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. సురేష్ తన అమ్మమ్మ వద్ద మోదవలసలో ఉంటూ ఒక బేకరీలో పని చేస్తున్నాడు. సుబ్బలక్ష్మి గజపతినగరంలోని కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సురేష్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై అత్తారింటికి బొండపల్లి వచ్చి సుబ్బలక్ష్మిని బయటకు తీసుకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. శనివారం ఇంటికి రాకపోయేసరికి ఎక్కడికో వెళ్లి ఉంటారని అంతా భావించారు. అయితే మెంటాడ మండలం ఆండ్రలోని రిజర్వాయర్‌లో ఇద్దరు మృతి చెంది ఉన్నారని, సమీపంలో ఒక ద్విచక్రవాహనం కూడా ఉందని ఆండ్ర పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సురేష్ జేబులో ఉన్న ఆధార్ కార్డు, సెల్‌ఫోన్, ద్విచక్రవాహనం లెసైస్స్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. కుటుంబ సభ్యులు రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకుని మృతులు సురేష్, సుబ్బలక్ష్మిలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పిల్లల ఇష్టప్రకారమే పెళ్లికి నిశ్చయించామని, తమకు ఎటువంటి అనుమానాలు లేవని ఇరువైపులా కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
డెంకాడ, న్యూస్‌లైన్: మండలంలోని పినతాడివాడ- పెదతాడివాడకు మధ్యలో విజయనగరం-నాతవలస ఆర్అండ్బీ రహదారి మలుపు వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డెంకాడ నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై పోతుబారిక నారాయణరావు(20), బోనెల రాంబాబు(20), బోనెల సూరిబాబు వెళ్తున్నారు. పినతాడివాడ, పెదతాడివాడ గ్రామాల మధ్య మలుపు వద్ద అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నారాయణరావు, రాంబాబు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. అటుగా వెళ్తున్న వారు గమనించి గాయపడిన సూరిబాబును చికిత్స నిమిత్తం విజయనగరం తరలించారు. కాగా, మృతుడు పోతుబారిక నారాయణరావు డెంకాడ మాజీ సర్పంచ్ అప్పన్న కుమారుడు. డెంకాడ స్టేట్ బ్యాంకులో ప్రైవేట్ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. ఇదే ఘటనలో మృతి చెందిన రాంబాబుది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని బంటుపల్లి గ్రామం. డెంకాడలో బంధువుల ఇంటికి వచ్చి, ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ప్రమాద ఘటనపై డెంకాడ ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానమే పెనుభూతమైందా?
డెంకాడ, న్యూస్‌లైన్ :అనుమానమే పెనుభూతమైందా.. అనుమానంతోనే భార్యను హతమార్చాడా.. క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం నిండు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో గండిబోయిన రామయ్యమ్మ(28) హత్యకు గురైంది. కట్టుకున్న భర్తే ఆమెను హత్య చేశాడు. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డి.తాళ్లవలస గ్రామానికి చెందిన గండిబోయిన నర్సింగరావు వృత్తిరీత్యా గీత కార్మికుడు. సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో కల్లుగీత తీసేందుకు భార్య రామయ్యమ్మను తీసుకుని గ్రామ పొలిమేరల్లో ఉన్న తాటిచెట్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఏమైందో తెలియదు గానీ... రామయ్యమ్మ తలభాగంపై తన చేతిలో ఉన్న కీడుబడితితో బలంగా కొట్లాడు. అనంతరం గ్రామంలోకి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి పరుగు తీశారు. రక్తపు మడుగులో ఉన్న రామయ్యమ్మను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు విడవడంతో.. మృతదేహాన్ని ఇంటికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. డెంకాడ ఎస్సై కళాధర్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నర్సింగరావు పరారీలో ఉన్నాడు. మృతురాలు రామయ్యమ్మది ఇదే మండలంలోని అమకాం పంచాయతీ బెల్లాం గ్రామం. అమ్మకు ఏమైందో తెలియక... మృతురాలు రామయ్యమ్మకు నర్సింగరావుతో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. స్వయానా మేనత్త కూతురినే అతను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఆరేళ్ల కుమారుడు సురేష్, నాలుగేళ్ల కుమార్తె అప్పయ్యమ్మ ఉన్నారు. అభం శుభం తెలియని పసితనం వీరిది... తమ తల్లి మృతి చెందిందన్న అవగాహన కూడా లేదు... తల్లి మృతదేహం వద్ద అందరూ రోదిస్తుంటే.. వీరు ఏం జరిగిందో తెలియక బిత్తరచూపులు చూస్తుండడం అక్కడి వారిని కలిచివేసింది. తమ తల్లికి ఏమైందని అక్కడి వారిని ప్రశ్నించడం కంటనీరును తెప్పించింది. అనుమానంతోనేనా.. భార్యపై ఉన్న అనుమానంతోనే నర్సింగరావు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. పిల్లల ముఖం చూసైనా కనికారం చూపలేకపోయాడని గ్రామస్తులు శాపనార్థాలు పెడుతున్నారు. -
భవిష్యత్ అవసరాలకు అణుశక్తి తప్పనిసరి
డెంకాడ, న్యూస్‌లైన్: దేశంలో విద్యుత్‌తో పాటు ఇతర రంగాల అవసరాలు తీరాలంటే అణుశక్తి తప్పనిసరి అని అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.బెనర్జీ అన్నారు. గురువారం డెంకాడ మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి దేశంలో 60వేల బిలియన్ వాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు. అందువల్ల ఈ అవసరాలను తీర్చాలంటే తప్పనిసరిగా అణు విద్యు త్ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీరు లేకపోతే జలవిద్యుత్ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కూడా రానురాను బొగ్గు నాణ్యత లేకపోవడం, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. సౌర విద్యుత్‌కు వచ్చేసరికి ఎండ ఉంటే తప్ప చార్జింగ్ అవదన్నారు. అందువల్ల అణువిద్యుత్ అవసరం తప్పని సరి కానుందన్నారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో కొత్తప్లాంట్ ఏర్పాటు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు మెజార్టీ ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ ఇంకా అక్కడ కొంత మందికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ అనుమానాలపై వారికి అవగాహన కల్పించి, వారిని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో కళాశాల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ.ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
వినాయక నిమజ్జనంలో విషాదం
పార్వతి తనయ పాహిమాం....గణపతి బొప్పా మోరియా...బొజ్జ వినాయకునికీ జై... అంటూ భక్తి పారవశ్యంతో శ్రుతి కలిపిన గొంతులు ఒక్కసారిగా ఆర్తనాదాలు చేశాయి. రక్షించమంటూ వేడుకున్నాయి... దీంతో అక్కడి వాతావరణం మారిపోయింది. అంతవరకూ ఉత్సాహంగా నృత్యం చేసిన అందరి కాళ్లూ వణికిపోయాయి. నిశిరాత్రి వేళ... ఒక వైపు భీకరంగా ప్రవహిస్తున్న జల హోరు... ఏమైందో తెలియని అయోమయం... అంతలోనే కొందరు తేరుకుని నదిలో మునిగిపోతున్న ముగ్గుర్ని పైకి లాగారు... చూస్తుండగానే మరో ఇద్దరు గల్లంతయ్యారు. చంపావతి తీరం శోకసంద్రంగా మారింది...అక్కడ 40 అడుగుల గొయ్య ఉందని ఆ గ్రామస్తులందరికీ తెలుసు... అయినా ఆపదలో పడ్డారు. మునిగిపోయిన వారు చేతులు పైకి ఎత్తి తమను కాపాడమని వేడుకున్నా ఆ గొయ్యి వద్దకు వెళ్లి రక్షించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డెంకాడ, న్యూస్‌లైన్: వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా డెంకాడ పంచాయతీలోని దొడ్డుబాడువ గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లో నీరు లేకపోవడంతో మండలంలోని పలు గ్రామాల వారు చంపావతి నదిలో వినాయ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ గ్రామస్తులు కూడా చంపావతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బుధవారం సా యంత్రం బయలుదేరారు. భారీ ఊరేగింపుగా నది వద్దకు చేరేసరికి రాత్రి సుమారు పదకొండున్నర గంటలు కావచ్చింది. విగ్రహం పెద్దది కావడంతో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే విగ్రహం పూర్తిగా మునుగుతుందని భావించి, లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఇంతలోనే నీటి ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో ఆ తాకిడికి నదిలో ఉన్న నలైభై అడుగుల గొయ్యిలోకి ఆ బృందంలోని ఐదుగురు జారిపోయారు. అంతే భయంతో వారు రక్షించమని పెద్దగా అరిచారు. దీనిని గమనించిన కొందరు ముగ్గుర్ని రక్షించారు. అయితే డోల సూరయ్య, కోరాడ అప్పలస్వామిలు మాత్రం బాగా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లిపోయారు. వారికి ఈత సరిగా రాదు. మునిగిపోతున్నామని, కాపాడాలని కోరుతూ, చేతులు పెకైత్తి సైగలు చేశారు. అయితే అక్కడ ఉన్న గొయ్యి ప్రమాదకరం కావడంతో పాటు అర్ధరాత్రి ఆ ప్రాంతమంతా గాడాంధకారంగా ఉండడంతో వారిని కాపాడేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. ఈ గందరగోళంలో ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది చూస్తుండగానే వీరు మునిగిపోయారు. ఈత వచ్చిన వారు ఆ తరువాత నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారు జాము నుంచి మళ్లీ గాలింపుచేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార ఈతగాళ్లను తీసుకువచ్చారు. వీరు తెప్పతో నదిలోకి వెళ్లి వలలు వేసి గాలించారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో డోల సూరయ్య మృతదేహం లభించింది. అనంతరం ఎంత వెతికినా కోరాడ అప్పలస్వామి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదస్థలాన్ని భోగాపురం సీఐ ప్రవీణ్‌కుమార్, డెంకాడ, పూసపాటిరేగ ఎస్ఐలు శ్రీధర్, రామారావులు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీరం...శోక సంద్రం మమ్మల్ని అనాథలను చేసి నీవు విడిచి వెళ్లిపోయావా అంటూ డోల సూరయ్య కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన రోదనలతో చంపావతి తీరం శోకసంద్రంగా మారింది. సూరయ్యకు భార్య చంద్రమ్మ, కుమార్తెలు ఉషారాణి, భారతి, కుమారుడు వెంకటరమణ ఉన్నారు. ఉషారాణి డిగ్రీ చదువుతోంది. భారతి, వెంకటరమణలు ఇంజినీరింగ్ చదువుతున్నారు. సూరయ్య తనకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను పెద్దగా చదువుకోనప్పటికీ తన పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలన్న ఆకాంక్షతో తలకు మించిభారమైనా ముగ్గురు పిల్లలనూ రెక్కల కష్టంపై చదివిస్తున్నాడు. అందొచ్చిన కొడుకు... ఆచూకీ తెలియకుండా పోయిన కోరాడ అప్పలస్వామికి ఇంకా పెళ్లికాలేదు. తల్లిదండ్రులు పైడితల్లి, చిట్టమ్మలతో పాటు సోదరులు వెంకటరమణ, నారాయణరావు ఉన్నారు. వెంకటరమణ ఆటో డ్రైవర్ కాగా, నారాయణరావు చదువుతున్నాడు. అప్పలస్వామి విశాఖలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని కోటి ఆశలతో ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ వార్త అశనిపాతంగా మారింది. అప్పలస్వామి ఆచూకీ తెలియక అతని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడిపెట్టించింది. చంపావతిలో మునిగి మృతి చెందిన డోల సూరయ్య మృతదేహాన్ని మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, వివిధ పార్టీలకు చెందిన మండల నాయకులు రొంగలి కనకసింహాచలం, ప్రతీప్రాజు, పాణీరాజు, పల్లె భాస్కరరావు, పతివాడ అప్పలనారాయణ తదితరులు సందర్శించి కుటుంబాన్ని ఓదార్చారు.