అనుమానమే పెనుభూతమైందా?
Published Tue, Feb 4 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
డెంకాడ, న్యూస్‌లైన్ :అనుమానమే పెనుభూతమైందా.. అనుమానంతోనే భార్యను హతమార్చాడా.. క్షణికావేశంలో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం నిండు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో గండిబోయిన రామయ్యమ్మ(28) హత్యకు గురైంది. కట్టుకున్న భర్తే ఆమెను హత్య చేశాడు. స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డి.తాళ్లవలస గ్రామానికి చెందిన గండిబోయిన నర్సింగరావు వృత్తిరీత్యా గీత కార్మికుడు.
సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో కల్లుగీత తీసేందుకు భార్య రామయ్యమ్మను తీసుకుని గ్రామ పొలిమేరల్లో ఉన్న తాటిచెట్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఏమైందో తెలియదు గానీ... రామయ్యమ్మ తలభాగంపై తన చేతిలో ఉన్న కీడుబడితితో బలంగా కొట్లాడు. అనంతరం గ్రామంలోకి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి పరుగు తీశారు. రక్తపు మడుగులో ఉన్న రామయ్యమ్మను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు విడవడంతో.. మృతదేహాన్ని ఇంటికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. డెంకాడ ఎస్సై కళాధర్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నర్సింగరావు పరారీలో ఉన్నాడు. మృతురాలు రామయ్యమ్మది ఇదే మండలంలోని అమకాం పంచాయతీ బెల్లాం గ్రామం.
అమ్మకు ఏమైందో తెలియక...
మృతురాలు రామయ్యమ్మకు నర్సింగరావుతో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. స్వయానా మేనత్త కూతురినే అతను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఆరేళ్ల కుమారుడు సురేష్, నాలుగేళ్ల కుమార్తె అప్పయ్యమ్మ ఉన్నారు. అభం శుభం తెలియని పసితనం వీరిది... తమ తల్లి మృతి చెందిందన్న అవగాహన కూడా లేదు... తల్లి మృతదేహం వద్ద అందరూ రోదిస్తుంటే.. వీరు ఏం జరిగిందో తెలియక బిత్తరచూపులు చూస్తుండడం అక్కడి వారిని కలిచివేసింది. తమ తల్లికి ఏమైందని అక్కడి వారిని ప్రశ్నించడం కంటనీరును తెప్పించింది.
అనుమానంతోనేనా..
భార్యపై ఉన్న అనుమానంతోనే నర్సింగరావు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పలువురు భావిస్తున్నారు. పిల్లల ముఖం చూసైనా కనికారం చూపలేకపోయాడని గ్రామస్తులు శాపనార్థాలు పెడుతున్నారు.
Advertisement
Advertisement