వినాయక నిమజ్జనంలో విషాదం
Published Fri, Sep 20 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
పార్వతి తనయ పాహిమాం....గణపతి బొప్పా మోరియా...బొజ్జ వినాయకునికీ జై... అంటూ భక్తి పారవశ్యంతో శ్రుతి కలిపిన గొంతులు ఒక్కసారిగా ఆర్తనాదాలు చేశాయి. రక్షించమంటూ వేడుకున్నాయి... దీంతో అక్కడి వాతావరణం మారిపోయింది. అంతవరకూ ఉత్సాహంగా నృత్యం చేసిన అందరి కాళ్లూ వణికిపోయాయి. నిశిరాత్రి వేళ... ఒక వైపు భీకరంగా ప్రవహిస్తున్న జల హోరు... ఏమైందో తెలియని అయోమయం... అంతలోనే కొందరు తేరుకుని నదిలో మునిగిపోతున్న ముగ్గుర్ని పైకి లాగారు... చూస్తుండగానే మరో ఇద్దరు గల్లంతయ్యారు. చంపావతి తీరం శోకసంద్రంగా మారింది...అక్కడ 40 అడుగుల గొయ్య ఉందని ఆ గ్రామస్తులందరికీ తెలుసు... అయినా ఆపదలో పడ్డారు. మునిగిపోయిన వారు చేతులు పైకి ఎత్తి తమను కాపాడమని వేడుకున్నా ఆ గొయ్యి వద్దకు వెళ్లి రక్షించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
డెంకాడ, న్యూస్‌లైన్: వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా డెంకాడ పంచాయతీలోని దొడ్డుబాడువ గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లో నీరు లేకపోవడంతో మండలంలోని పలు గ్రామాల వారు చంపావతి నదిలో వినాయ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ గ్రామస్తులు కూడా చంపావతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బుధవారం సా యంత్రం బయలుదేరారు. భారీ ఊరేగింపుగా నది వద్దకు చేరేసరికి రాత్రి సుమారు పదకొండున్నర గంటలు కావచ్చింది. విగ్రహం పెద్దది కావడంతో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అయితే విగ్రహం పూర్తిగా మునుగుతుందని భావించి, లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఇంతలోనే నీటి ప్రవాహం ఉద్ధృతంగా రావడంతో ఆ తాకిడికి నదిలో ఉన్న నలైభై అడుగుల గొయ్యిలోకి ఆ బృందంలోని ఐదుగురు జారిపోయారు. అంతే భయంతో వారు రక్షించమని పెద్దగా అరిచారు. దీనిని గమనించిన కొందరు ముగ్గుర్ని రక్షించారు. అయితే డోల సూరయ్య, కోరాడ అప్పలస్వామిలు మాత్రం బాగా లోతుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లిపోయారు.
వారికి ఈత సరిగా రాదు. మునిగిపోతున్నామని, కాపాడాలని కోరుతూ, చేతులు పెకైత్తి సైగలు చేశారు. అయితే అక్కడ ఉన్న గొయ్యి ప్రమాదకరం కావడంతో పాటు అర్ధరాత్రి ఆ ప్రాంతమంతా గాడాంధకారంగా ఉండడంతో వారిని కాపాడేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. ఈ గందరగోళంలో ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది చూస్తుండగానే వీరు మునిగిపోయారు. ఈత వచ్చిన వారు ఆ తరువాత నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం తెల్లవారు జాము నుంచి మళ్లీ గాలింపుచేపట్టారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార ఈతగాళ్లను తీసుకువచ్చారు. వీరు తెప్పతో నదిలోకి వెళ్లి వలలు వేసి గాలించారు. గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో డోల సూరయ్య మృతదేహం లభించింది. అనంతరం ఎంత వెతికినా కోరాడ అప్పలస్వామి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదస్థలాన్ని భోగాపురం సీఐ ప్రవీణ్‌కుమార్, డెంకాడ, పూసపాటిరేగ ఎస్‌ఐలు శ్రీధర్, రామారావులు సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీరం...శోక సంద్రం
మమ్మల్ని అనాథలను చేసి నీవు విడిచి వెళ్లిపోయావా అంటూ డోల సూరయ్య కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన రోదనలతో చంపావతి తీరం శోకసంద్రంగా మారింది. సూరయ్యకు భార్య చంద్రమ్మ, కుమార్తెలు ఉషారాణి, భారతి, కుమారుడు వెంకటరమణ ఉన్నారు. ఉషారాణి డిగ్రీ చదువుతోంది. భారతి, వెంకటరమణలు ఇంజినీరింగ్ చదువుతున్నారు. సూరయ్య తనకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను పెద్దగా చదువుకోనప్పటికీ తన పిల్లలు మాత్రం బాగా చదువుకోవాలన్న ఆకాంక్షతో తలకు మించిభారమైనా ముగ్గురు పిల్లలనూ రెక్కల కష్టంపై చదివిస్తున్నాడు.
అందొచ్చిన కొడుకు...
ఆచూకీ తెలియకుండా పోయిన కోరాడ అప్పలస్వామికి ఇంకా పెళ్లికాలేదు. తల్లిదండ్రులు పైడితల్లి, చిట్టమ్మలతో పాటు సోదరులు వెంకటరమణ, నారాయణరావు ఉన్నారు. వెంకటరమణ ఆటో డ్రైవర్ కాగా, నారాయణరావు చదువుతున్నాడు. అప్పలస్వామి విశాఖలోని ఒక ప్రైవేటు విద్యా సంస్థలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని కోటి ఆశలతో ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ వార్త అశనిపాతంగా మారింది. అప్పలస్వామి ఆచూకీ తెలియక అతని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడిపెట్టించింది. చంపావతిలో మునిగి మృతి చెందిన డోల సూరయ్య మృతదేహాన్ని మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు, వివిధ పార్టీలకు చెందిన మండల నాయకులు రొంగలి కనకసింహాచలం, ప్రతీప్‌రాజు, పాణీరాజు, పల్లె భాస్కరరావు, పతివాడ అప్పలనారాయణ తదితరులు సందర్శించి కుటుంబాన్ని ఓదార్చారు.
Advertisement
Advertisement