రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
Published Thu, Feb 27 2014 3:10 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
డెంకాడ, న్యూస్‌లైన్: మండలంలోని పినతాడివాడ- పెదతాడివాడకు మధ్యలో విజయనగరం-నాతవలస ఆర్‌అండ్‌బీ రహదారి మలుపు వద్ద మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డెంకాడ నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై పోతుబారిక నారాయణరావు(20), బోనెల రాంబాబు(20), బోనెల సూరిబాబు వెళ్తున్నారు. పినతాడివాడ, పెదతాడివాడ గ్రామాల మధ్య మలుపు వద్ద అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నారాయణరావు, రాంబాబు సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలారు. అటుగా వెళ్తున్న వారు గమనించి గాయపడిన సూరిబాబును చికిత్స నిమిత్తం విజయనగరం తరలించారు. కాగా, మృతుడు పోతుబారిక నారాయణరావు డెంకాడ మాజీ సర్పంచ్ అప్పన్న కుమారుడు. డెంకాడ స్టేట్ బ్యాంకులో ప్రైవేట్ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. ఇదే ఘటనలో మృతి చెందిన రాంబాబుది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని బంటుపల్లి గ్రామం. డెంకాడలో బంధువుల ఇంటికి వచ్చి, ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ప్రమాద ఘటనపై డెంకాడ ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement