ఏం కష్టమొచ్చిందో...
రిజర్వాయర్‌లో శవాలుగా తేలిన కాబోయే దంపతులు
మెంటాడ: త్వరలోనే పెళ్లి చేసుకోవలసిన ఓ జంట రిజర్వాయర్‌లో శవాలై తేలారు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు... డెంకాడ మండలం మోదవలస గ్రామానికి చెందిన రెయ్యి సురేష్(28)కు బొండపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన వసంత సుబ్బలక్ష్మితో వివాహం నిశ్చయమైంది. ఈసంవత్సరం అక్టోబర్ 29వ తేదీన వివాహం జరిపించేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు.
సురేష్ తన అమ్మమ్మ వద్ద మోదవలసలో ఉంటూ ఒక బేకరీలో పని చేస్తున్నాడు. సుబ్బలక్ష్మి గజపతినగరంలోని కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. సురేష్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై అత్తారింటికి బొండపల్లి వచ్చి సుబ్బలక్ష్మిని బయటకు తీసుకు వెళ్లినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. శనివారం ఇంటికి రాకపోయేసరికి ఎక్కడికో వెళ్లి ఉంటారని అంతా భావించారు. అయితే మెంటాడ మండలం ఆండ్రలోని రిజర్వాయర్‌లో ఇద్దరు మృతి చెంది ఉన్నారని, సమీపంలో ఒక ద్విచక్రవాహనం కూడా ఉందని ఆండ్ర పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడు సురేష్ జేబులో ఉన్న ఆధార్ కార్డు, సెల్‌ఫోన్, ద్విచక్రవాహనం లెసైస్స్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. కుటుంబ సభ్యులు రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకుని మృతులు సురేష్, సుబ్బలక్ష్మిలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. పిల్లల ఇష్టప్రకారమే పెళ్లికి నిశ్చయించామని, తమకు ఎటువంటి అనుమానాలు లేవని ఇరువైపులా కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.