అడ్డదిడ్డంగా జరిమానాలు
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు ముకుతాడు వేయాల్సిందే. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే జరిమానా వసూలు చేయాల్సిందే. మద్యం తాగి వాహనం నడిపితే మత్తు దించాల్సిందే...వీటిని ఎవరూ కాదనలేరు. కానీ మొదట అవగాహన కల్పించి తర్వాత ఫైన్లకు పనిచెప్పాల్సి ఉంటుంది. జరిమానాలే పరమావధి కాకూడదు. నెలలో ఇన్ని డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టాలి, ఇన్ని చలానాలు రాయాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో పోలీసులు ఆ లక్ష్యాలను అందుకోవడానికి వక్రమార్గాలు అన్వేషించారు.
ఎలాగైనా కేసులు పెట్టాలన్న అత్యుత్సాహంతో వైన్‌షాపుల వద్ద కాపుకాసి, మద్యం తాగి వాహనం ఎక్కే వారిని పట్టుకొని డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చి ఎక్సైజ్ శాఖకు టార్గెట్(లక్ష్యం) విధించి మద్యం ద్వారా ఆదాయం సంపాదించింది. ఇదే క్రమంలో ఆర్‌టీఏ, పోలీసు శాఖలకు కూడా నెలకు ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ చలానాలు వేయాలని టార్గెట్లు విధించారు. దీంతో పోలీసులు కనబడిన వారినల్లా ఆపి అవిలేవు, ఇవి లేవంటూ ఫైన్లు రాశారు.
దళిత కాలనీలపై దండయాత్ర
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలు నివసిస్తున్న కాలనీలపై ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ సర్కార్ మాత్రం వారిపై దండయాత్ర ప్రకటించింది. విద్యుత్ శాఖ అధికారులను ఉసిగొల్పి ఎస్సీల ఇళ్లకు బలవంతంగా మీటర్లు అమర్చారు. మేము కట్టలేము మొర్రో అంటున్నా వినకుండా వేలకు వేలు గుంజారు. దొంగ కరెంటు వాడుతున్నారని కేసులు నమోదు చేశారు.
ప్రతి ఇంటికీ బలవంతంగా మీటర్లు అమర్చారు
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఊరిలో అన్ని ఇళ్లకు బలవంతంగా విద్యుత్ మీటర్లు అమర్చారు. వాటికి పాత బకాయిలు కూడా కలిపి వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి. మీటర్లు బిగించుకోకపోతే పోలీసులను తెచ్చి కేసులు పెడుతున్నారు. దీంతో ఎవరూ నోరు విప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. – చంద్ర, వెంకటాయపల్లె.
పన్ను వసూళ్లు ఇలా..
సంవత్సరం | పన్ను డిమాండ్ | వసూలు చేసిన మొత్తం | బ్యాలెన్స్ |
2004–05 | 3,79,42,186 | 3,42,64,909 | 36,77,277 |
2012–13 | 6,13,92,493 | 4,95,75,250 | 1,18,17,243 |
2013–14 | 6,30,72,720 | 3,57,55,931 | 2,73,16,789 |
2017–18 | 17,18,32,438 | 8,21,45,292 | 8,96,87,146 |
జీఐఎస్ సర్వే ద్వారా పెరిగిన పన్ను వివరాలు..
మున్సిపాలిటీ | మొత్తం భవనాలు | పన్ను పెరిగిన భవనాలు | పెరిగిన పన్ను కోట్లలో |
కడప | 88423 | 27593 | 2,15,33,710 |
ప్రొద్దుటూరు | 30441 | 19803 | 3,10,73,147 |
బద్వేల్ | 22996 | 13454 | 68,93,791 |
పులివెందుల | 19876 | 12725 | 53,62,498 |
రాయచోటి | 25026 | 11062 | 87,98,742 |
మైదుకూరు | 12784 | 8178 | 38,54,338 |
జమ్మలమడుగు | 10872 | 4888 | 22,99,374 |
ఎర్రగుంట్ల | 10315 | 4025 | 12,62,200 |
రాజంపేట | 10741 | 758 | 8,43,310 |
మొత్తం | 2,29,870 | 1,02,946 | 8,18,21,192 |
పల్లెల్లో పన్ను పోటు
కడప ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటిపన్నుల చెల్లింపు భారంగా మారుతోంది. పన్నులను ఏడాదికి ఏడాదికి పెంచుతూ పేదలపై భారం మోపుతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు పన్ను చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోయినప్పటికీ డ్రైనేజీ మెయింటెనెన్స్ పేరుతో 10 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే పలు చోట్ల లైబ్రరీలు లేకున్నా వాటి నిర్వహణకు 8 శాతం పన్ను వసూలు చేస్తున్నారు.
పింఛన్ డబ్బుల్లో ఇంటిపన్ను పట్టుకుంటున్నారు
మా గ్రామంలో వృద్ధులకు పింఛన్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ డబ్బులోనే ఇంటి పన్ను పట్టుకుని మిగతా డబ్బు ఇస్తున్నారు. ఆ డబ్బులను ట్రెజరీకి జమ చేస్తున్నారో లేదో తెలియడం లేదు. – ఆదినారాయణరెడ్డి, ఖాజీపేట
ఆరు నెలలకు ఒకసారి
ఏడాదికి రెండు సార్లు ఇంటిపన్ను చెల్లిస్తున్నాము. ప్రతి ఆరు నెలలకు ఒక సారి చెల్లించాలి. అలా చెల్లించకపోతే వడ్డీతో చెల్లించాల్సి వస్తుంది. ఈ పన్నును కూడా సంవత్సరానికి ఒక సారి కొంతశాతం పెంచుతూ పొతుంటారు. – రాజశేఖర్‌రెడ్డి, ఆలంఖాన్‌పల్లె.
మున్సిపాలిటీల్లో భారీ మోత
కడప కార్పొరేషన్: ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ సర్కార్ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోగా వారిపై పన్నుల మోత మోగించింది. జీఐఎస్ సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపింది. ఈ సర్వే వల్ల జిల్లాలోని కడప నగరపాలక సంస్థతోపాటు 8 మున్సిపాలిటీల్లోని 90 శాతం ఇళ్లకు పన్నులు అధికంగా పెరిగాయి. జిల్లాలో ఆర్‌వీ అసోసియేట్స్ అనే సంస్థతో 10 మాసాలపాటు జీఐఎస్ సర్వే నిర్వహించారు. జిల్లాలోని కడప కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో మొత్తం రూ.9 కోట్ల మేర పన్నులు పెంచేశారు.
ఇంటి ప్లాన్ లేని భవనాలకు యూసీ చార్జీల రూపంలో 100 శాతం పెనాల్టీ వేశారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో 2,29,900 గృహాలు ఉండగా, జీఐఎస్ సర్వే వల్ల 1.83లక్షల భవనాలకు పన్ను పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సర్వే కోసం ప్రభుత్వం ఆర్వీ అసోసియేట్స్ సంస్థకు కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ మొత్తాన్ని కూడా మున్సిపాలిటీల నుంచే వసూలు చేసింది. భవనాల్లో ఎలాంటి మార్పు లేక పోయినా జీఐఎస్ సర్వేలో పన్ను రెండింతలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
రెవెన్యూ సిబ్బందిపై పెరిగిన పనిభారం
జీఐఎస్ సర్వే నిర్వహిస్తున్న సంస్థ ప్రతి ఇంటికి సంబంధించిన కొలతలు తీసి మున్సిపల్ కమిషనర్లకు నివేదిక రూపంలో ఇచ్చింది. కొన్ని ఇళ్లకు ప్లాన్లు ఉన్నప్పటికీ లేనట్లుగా చూపి పన్నులు విపరీతంగా పెంచేశారు. దీంతో మున్సిపాలిటీల్లోని ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు మళ్లీ క్షేత్ర స్థాయి విచారణ చేయాల్సి వచ్చింది. దీనివల్ల మున్సిపాలిటీల్లో బిల్‌కలెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఓలపై పనిభారం పెరిగిపోయి ఇబ్బందులు పడ్డారు.
పన్నులు తగ్గించాలని జనరల్ బాడీలో తీర్మానం చేసినా పట్టించుకోలేదు
రాష్ట్ర ప్రభుత్వం జీఐఎస్ సర్వే చేసి పన్నులు విపరీతంగా పెంచేసింది. దాదాపు అన్ని ఇళ్లకు పన్నులు పెరిగాయి. ప్లాన్లు ఉన్న వారికి కూడా లేనట్లు చూపి పన్నులు అధికంగా వేశారు. దీనిపై మేము అనేక జనరల్ బాడీ సమావేశాల్లో ప్రశ్నించి ఆ సర్వేను రద్దు చేయాలని తీర్మానం కూడా చేశాము. అయితే మా తీర్మానాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు.– సానపురెడ్డి శివకోటిరెడ్డి, 12వ డివిజన్ కార్పొరేటర్.
రూ.500లు ఉన్న పన్ను రూ.1200 అయింది
మేము వికలాంగుల కాలనీలో ఉంటున్నాము. గతంలో మాకు రూ.500 పన్ను వచ్చేది. ప్రస్తుతం రూ.1200 వస్తోంది. అంతకుముందు ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు అలానే ఉంది. కొత్తగా ఎలాంటి కట్టడాలు చేపట్టలేదు. అయినా పన్ను పెంచేశారు. పన్ను తగ్గించమంటే పెరిగిన పన్ను కట్టమంటున్నారు. – జాషువా, వికాలాంగుల కాలనీ.
ప్రగతి రథం.. బాదుడు పథం
కడప కోటిరెడ్డి సర్కిల్ : అతి సామాన్యుడు ప్రయాణించే ప్రజా ప్రగతి రథచక్రమైన ఆర్టీసీ చార్జీలు పెంచి నడ్డివిరిచారు. అంతేకాక ఐదు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆర్టీసీలో సెస్సులు వసూలు చేస్తూ అదనపు భారం మోపారు. టోల్‌గేటు టాక్స్, బస్టాండ్ మెయింటెనెన్స్, ప్రయాణికుల ఇన్సూరెన్స్ స్కీం సెస్సు పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2015 అక్టోబరు నెల 24వ తేదీన ఆర్టీసీ చార్జీలు పెంచారు. అప్పటి నుంచి చార్జీలు పెంచకపోయినా ప్రయాణికులకు తెలియకుండా పరోక్షంగా టికెట్లలో ఈ సెస్సు చార్జీలు పెంచిన విషయం స్పష్టంగా ఉంది.
2015లో చార్జీలు పెంచిన తీరు ఇలా..
జిల్లాలో ఆర్టీసీ డిపోలు 8 ఉన్నాయి. అన్ని డిపోలలో కలిపి 804 బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు రోజు 3,027 కిలో మీటర్లు తిరుగుతూ ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తున్నాయి. ఈ బస్సుల్లో 4.05 లక్షల మంది ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాలకు వెళుతున్నారు. 2015 అక్టోబరు నెల 24వ తేదీన కిలో మీటరుకు పల్లె వెలుగు బస్సులకు 5 శాతం, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు 10 శాతం, డీలక్స్‌లకు 11 శాతం, సూపర్ లగ్జరీ, ఇంద్ర సర్వీసులకు 10 శాతం చార్జీలు పెంచారు.
టోల్ గేట్...ఇతర సెస్సుల బాదుడు..
జిల్లా నుంచి ప్రతి రోజు ప్రొద్దుటూరు, కర్నూలు, మైదుకూరు, హైదరాబాదుకు బస్సులు తిరుగుతున్నాయి. కడప నగర శివార్లలోని ఖాదర్‌ఖాన్ కొట్టాల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన టోల్‌గేటు మీదుగా బస్సులు ప్రయాణిస్తున్నాయి. రానుపోను, ఒక్కసారి పోవడానికి ప్రతి ప్రయాణికుడి నుంచి బస్సు కండక్టర్లు రూ.5లు వసూలు చేస్తున్నారు. అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసులకైతే బస్టాండ్ మెయిన్‌టెనెన్స్ సెస్సు రూ.2లు, ప్రయాణికుల ఇన్సూరెన్స్ స్కీం సెస్సు కింద రూ.1, యాక్సిడెంటల్ సెస్సు రూ.1 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇతర సర్వీసులకైతే ఎక్కువగా ఉంటోంది.
2015లో చార్జీల భారం మోపారు..
2015 అక్టోబరు నెలలో కిలో మీటరుకు 5 నుంచి 11 శాతం వరకు పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో పెంచుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు ఏటా ఏదో ఒక సెస్సును ప్రయాణికులపై రుద్దుతూనే ఉన్నారు. –సుదర్శన్‌రెడ్డి, వ్యాపారి, కడప.
బస్టాండ్ మెయింటెనెన్స్ సెస్సు ప్రయాణికుడికేం సంబంధం..
ముక్కు పిండి వసూలు చేస్తున్న బస్టాండ్ మెయింటెనెన్స్ సెస్సుకు ప్రయాణికుడికి ఏం సంబందం. ప్రయాణికులు బస్టాండ్‌కు వస్తారు, పోతారు. అక్కడ స్టాళ్ల వారు ఉంటారు. వారి నుంచి మెయింటెనెన్స్ సెస్సురాబడితేనే ఉపయోగం. –రమణ, ప్రయాణికుడు, లక్కిరెడ్డిపల్లె మండలం.
యాక్సిడెంట్ సెస్సు రాబడుతున్నా ఎంతమందికిచ్చారో తెలియదు...
బస్సు ప్రమాదానికి గురైనప్పుడు ఆ బస్సు ప్రయాణికులను ఆదుకోవడంలో తప్పులేదు. కానీ ప్రయాణికుల నుంచి రాబడుతున్న ఈ సెస్సు ఎంతమందికి ఇచ్చారో ఎవ్వరికి తెలీదు. ప్రభుత్వం ఈ సెస్సుపై విధాన ప్రకటన చేయాలి. –రామకోటి, ప్రయాణికుడు, కడప.
సెస్సులే అధికం..
ప్రయాణికులకు ఏ మాత్రం అనుమానం రాకుండా, ఎదురు ప్రశ్నించకుండా సెస్సుల పేరుతో ప్రభుత్వం మోత మోగిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా సెస్సులు వేయలేదు. ఎన్ని సెస్సులు వేసినా ఆర్టీసీ లాభాల్లో ఉందా? అంటే అదీ లేదు. కేవలం ప్రయాణికుల సొమ్ములు దోచుకోవడానికే ఇవన్నీ రాబడుతున్నారు.
– కొప్పోలి స్వప్న, ప్రయాణికురాలు, కడప.
Comments
Please login to add a commentAdd a comment